కొందరికే జెండాలు!

ABN , First Publish Date - 2022-08-15T06:18:08+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ జాతీయ జెండా పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆచరణలో సరిగా అమలుకాలేదు.

కొందరికే జెండాలు!
చోడవరంలోని ఒక వీధిలో ఇళ్లపై కనిపించని త్రివర్ణ పతాకాలు

గ్రామాల్లో అరకొరగా జాతీయ పతాకాల పంపిణీ

జెండాల సరఫరాలో ప్రభుత్వం విఫలం

అమలుకాని ‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’ పిలుపు

నివాసాల సంఖ్యతో పోలిస్తే మూడో వంతుమాత్రమే రాక

నచ్చిన వారికి పంపిణీ చేసి చేతులు దులుపుకున్న వలంటీర్లు


చోడవరం, ఆగస్టు 14: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ జాతీయ జెండా పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆచరణలో సరిగా అమలుకాలేదు. దీంతో కొన్ని ఇళ్లపైనే జెండాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక గ్రామంలో వెయ్యి ఇళ్లు వుంటే.. 400 జెండాలు మాత్రమే సరఫరా అయ్యాయి. అధికారుల తీరుపై ప్రజలు తీవ్రఅసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఇందుకోసం ప్రతి ఇంటికీ జెండాతో పాటు, జెండా కర్ర కూడా ఇస్తామని పాలకులు ఆర్భాటంగా ప్రకటించారు. అధికారులు కూడా ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలని హడావుడి చేశారు. దీంతో త్రివర్ణ పతాకాల కోసం నాలుగు రోజుల నుంచి జనం ఎదురు చేశారు. కానీ సచివాలయాలకు పరిమితంగానే జెండాలు సరఫరా అయ్యాయి. వీటిని ప్రతి ఇంటికి అందచేయాలని అధికారులు చెప్పారు. అయితే సచివాలయం పరిధిలో వున్న నివాసాల కన్నా జెండాలు తక్కువ ఇవ్వడంతో వలంటీర్లు తమకు నచ్చిన వారికి, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులకు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. పక్క ఇంటిలో జెండా ఇచ్చి, తమకు ఎందుకు ఇవ్వలేదని పలువురు ప్రజలు వలంటీర్లను నిలదీశారు. నివాసాలకన్నా తక్కువ జెండాలు వచ్చాయని, అందువల్ల అందరికీ పంపిణీ చేయలేదని వలంటీర్లు చెప్పారు. 

నివాసాలు 30 వేలు.. ఇచ్చిన జెండాలు 12 వేలు

చోడవరం మండలంలో బియ్యం కార్డులు 26,569 వున్నాయి. అధిక ఆదాయ వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు మరో నాలుగు వేల మంది వరకు వుంటారు. ప్రతి ఇంటికి ఒక జెండా చొప్పున 30 వేల జాతీయ పతాకాలను పంపిణీ చేయాలి. కానీ జిల్లా కేంద్రం నుంచి 12 వేల జెండాలు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మండలంలో 32 పంచాయతీలు వుండగా సగటున ఒక్కో పంచాయతీకి 400 చొప్పున జెండాలు పంపిణీ చేశారు. మేజర్‌ పంచాయతీ చోడవరంలో ఎనిమిది వేల కుటుంబాలు నివాసం వుంటుండగా, ఇక్కడ 2,300 జెండాలను మాత్రమే అందజేశారు. లక్కవరం పంచాయతీలో 1,780 ఇళ్లు ఉండగా 400 జెండాలే ఇచ్చినట్టు సమాచారం. జాతీయ జెండాల పంపిణీ వ్యవహారంపై స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పెదవి విరుస్తున్నారు. అసలు జెండాలు ఇవ్వకపోయినా ఎటువంటి ఇబ్బంది వుండేది కాదని, అరకొరగా జెండాలు పంపడంతో కొందరికి ఇవ్వలేకపోయామని సర్పంచులు వాపోతున్నారు. 

12 వేల జెండాలు వచ్చాయి

-ఎస్‌డీ శ్యాంసుందర్‌, ఎండీవో, చోడవరం

మండలానికి 12 వేల జాతీయ పతాకాలు మాత్రమే వచ్చాయి. వాటిని సచివాలయాలకు సమంగా పంపించాము.  గ్రామ వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. అయితే నివాసాల సంఖ్యకు అనుగుణంగా జెండాలు రాకపోవడంతో కొందరికి పంపిణీ చేయలేకపోయారు.


Read more