300వ రోజుకు మత్స్యకారుల ఆందోళన

ABN , First Publish Date - 2022-09-27T07:02:40+05:30 IST

ఇక్కడి హెటెరో ఔషధ పరిశ్రమ సముద్రంలోకి కొత్తగా వేస్తున్న పైప్‌లైన్లకు భవిష్యత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి మండలంలోని రాజయ్యపేట తీరంలో ప్రారంభించిన మత్స్యకారుల మహాశాంతియుత ధర్నా సోమవారం 300వ రోజుకు చేరుకుంది.

300వ రోజుకు మత్స్యకారుల ఆందోళన
రాజయ్యపేటలో ఆందోళన చేస్తున్న మత్స్యకారులు


సముద్రంలోకి ‘హెటెరో’ కొత్తగా వేస్తున్న పైప్‌లైన్లకు భవిష్యత్తులో అనుమతులు వద్దని డిమాండ్‌

హాజరైన జనసేన,సీపీఎం నాయకులతో పాటు మత్స్యకారులు


నక్కపల్లి, సెప్టెంబరు 26 : ఇక్కడి హెటెరో ఔషధ పరిశ్రమ సముద్రంలోకి కొత్తగా వేస్తున్న పైప్‌లైన్లకు భవిష్యత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి మండలంలోని రాజయ్యపేట తీరంలో ప్రారంభించిన మత్స్యకారుల మహాశాంతియుత ధర్నా సోమవారం 300వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మత్స్యకారులంతా సదరు పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు ఎం.అప్పలరాజు సంఘీభావం ప్రకటించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల న్యాయమైన సమస్య కోసం పది నెలల నుంచి శాంతియుత  ధర్నా చేస్తున్నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మత్స్యకార సంఘం నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే పాత పైప్‌లైన్ల వల్ల సముద్రంలో కాలుష్యం కారణంగా మత్స్యసంపద నాశనమవుతుందన్నారు. దీనివల్ల చేపల వేటపై ఆధారపడ్డ గంగపుత్రలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.  నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కూడా హెటెరో ద్వారా జరుగుతున్న కాలుష్యం వల్ల సుమారు రూ.6.94 కోట్ల జరిమానా రాబట్టాలని ప్రభుత్వానికి సూచించిందన్నారు. అవసరమైతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు గోసల స్వామి, పిక్కి గంగరాజు, పిక్కి స్వామి, మైలపల్లి మహేశ్‌, వాసుపల్లి నూకరాజు, పిక్కి కోదండరావ్‌, మహేశ్‌, గరికిన వరహాలు బాబు తదితరులతో పాటు పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-27T07:02:40+05:30 IST