విశాఖ కారు ఆటోమొబైల్స్‌ గ్యారేజీలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-09-25T06:32:07+05:30 IST

పారిశ్రామిక ప్రాంతం షీలానగర్‌కు సమీపంలో వున్న విశాఖ కారు ఆటోమొబైల్స్‌ గ్యారేజీలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది.

విశాఖ కారు ఆటోమొబైల్స్‌ గ్యారేజీలో అగ్ని ప్రమాదం
మంటల్లో గ్యారీజీ

ఐదు వాహనాలు దగ్ధం

రూ.30 లక్షలకు పైగా ఆస్తి నష్టం

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం!

అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబరు 24: పారిశ్రామిక ప్రాంతం షీలానగర్‌కు సమీపంలో వున్న విశాఖ కారు ఆటోమొబైల్స్‌ గ్యారేజీలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరమ్మతుల నిమిత్తం వచ్చిన ఐదు వాహనాలు దగ్ధమవ్వడంతో పాటు షోరూమ్‌ కార్యాలయంతో పాటు ఫర్నీచర్‌ అగ్నికీలలకు ఆహుతైంది. గాజువాక పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జాతీయ రహదారికి ఆనుకుని షీలానగర్‌ సమీపంలో వున్న విశాఖ కారు ఆటోమొబైల్స్‌ గ్యారేజీలో శనివారం సాయంత్రం వరకు విధులు నిర్వహించిన సిబ్బంది గ్యారేజీకి తాళాలు వేసి వెళ్లిపోయారు. అదే సమయంలో గ్యారేజీ షెడ్డు వెనుక భాగం నుంచి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు షోరూమ్‌ యజమాని సురేశ్‌కుమార్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయనతో పాటు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే మంటలకు వాహనాలు దగ్ధమవుతుండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది వచ్చి తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో మరమ్మతుల నిమిత్తం వచ్చిన రెండు కార్లతో పాటు పాత టైర్ల లోడుతో వున్న మహేంద్ర వ్యాన్‌, మారుతీ వ్యాన్‌, మహేంద్ర ట్రక్‌ అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే గ్యారేజీ క్యాబిన్‌తో పాటు అందులో వున్న ఫర్నీచర్‌, ఇతర పనిముట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపకాధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గాజువాక సీఐ ఎల్‌.భాస్కర్‌తో పాటు సిబ్బంది ఇక్కడకు చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల వల్ల ప్రమాదం జరిగి వుంటుందని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ.30 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లి వుంటుందని వారు తెలిపారు.
Read more