విధి వంచితుడు...

ABN , First Publish Date - 2022-09-08T05:45:56+05:30 IST

సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ కొత్తపాలెం సమీపంలో మంగళవారం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో గాయపడిన స్థానిక సుభాష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన నల్లగంట్ల దుర్గాప్రసాద్‌ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు.

విధి వంచితుడు...
దుర్గాప్రసాద్‌ (ఫైల్‌ ఫొటో)

బాణసంచా పేలుడు ఘటనలో మరొకరి మృతి

కంచరపాలెంలో విషాదం

ఉపాధి కోసం వెళ్లి మృత్యువాత

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

కంచరపాలెం, మహారాణిపేట, సబ్బవరం, సెప్టెంబరు 7: సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ కొత్తపాలెం సమీపంలో మంగళవారం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో గాయపడిన స్థానిక సుభాష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన నల్లగంట్ల దుర్గాప్రసాద్‌ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఊర్వశి జంక్షన్‌ సమీపంలో గల సుభాష్‌ నగర్‌లో దుర్గారావు భార్య భవానీ, కుమార్తె త్రివేణి, కుమారుడు జాన్‌ మనోహర్‌లతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. దుర్గాప్రసాద్‌ కొన్నాళ్లు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయాడు. కొన్నాళ్లు భార్యతో కలిసి మాస్క్‌లు విక్రయించాడు. ఆ తరువాత ఏ పనీ దొరకకపోవడంతో తిమోతి అనే చర్చి పాస్టర్‌ సూచనతో బాణసంచా తయారీ పనిలో చేరాడు. మంగళవారం జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్‌ బుధవారం మృతిచెందాడు.


అనాథలైన భార్య, పిల్లలు

దుర్గారావు మృతితో భార్య, పిల్లలు అనాఽథలయ్యారు. భార్య భవానీ ఇళ్లలో పనులు చేస్తుంటుది. కుమార్తె డిగ్రీ పూర్తిచేసింది. కొడుకు మనోహర్‌ స్థానిక ప్రైవేటు స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వమే దయ చూపించి కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మహిళ పరిస్థితి విషమం

 బాణసంచా పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్న ఎన్‌.దుర్గాప్రసాద్‌  బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. క్షతగాత్రులలో ఒకరైన బండి మహేష్‌ మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఇదే ఘటనలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కమలమ్మ పరిస్థితి విషమంగాఉందని వైద్యులు తెలిపారు.


పేలుడు ఘటనలో ఇద్దరి అరెస్టు

బాణసంచా పేలుడు ఘటనకు సంబంధించి బుధవారం ఇద్దరిని ఆరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు సీఐ రంగనాథం తెలిపారు. అనకాపల్లి గవరపాలెం సమీపంలోని సంతబయలుకు చెందిన చర్చి ఫాదర్‌ ఆరి వరహాలు అలియాస్‌ తిమోతీ, బాణసంచా తయారీకి షెడ్డు ఇచ్చిన స్థలం లీజుదారుడు ఆరిపాక గ్రామానికి చెందిన సింగంపల్లి పైడితల్లిపై ఆర్‌ఐ వీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి, నిందితులను సాయంత్రం అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించిన అనంతరం కేసు నమోదు చేసి బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇక్కడ బాణసంచా తయారీ రెండేళ్లుగా సాగుతున్నట్టు గుర్తించామన్నారు.


Read more