విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్‌ ఎనర్జీ అసిస్టెంట్‌ మృతి

ABN , First Publish Date - 2022-08-21T06:07:00+05:30 IST

విద్యుదాఘాతానికి గురై విద్యుత్‌ శాఖలో ఎనర్జీ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2 జేఎన్‌ఎల్‌ఎం)గా విధులు నిర్వహిస్తున్న తాజుద్దీన్‌ (22) మృతి చెందిన సంఘటన మల్కాపురం సబ్‌ స్టేషన్‌ పరిధిలోని షిప్‌యార్డు లోవగార్డెన్స్‌లో శనివారం చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్‌ ఎనర్జీ అసిస్టెంట్‌ మృతి
మృతి చెందిన తాజుద్దీన్‌ (ఫైల్‌ ఫొటో)

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

దర్యాప్తు చేస్తున్న ఈపీడీసీఎల్‌ విజిలెన్స్‌ విభాగం అధికారులు, పోలీసులు

మల్కాపురం, ఆగస్టు 20: విద్యుదాఘాతానికి గురై విద్యుత్‌ శాఖలో ఎనర్జీ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2 జేఎన్‌ఎల్‌ఎం)గా విధులు నిర్వహిస్తున్న తాజుద్దీన్‌ (22) మృతి చెందిన సంఘటన మల్కాపురం సబ్‌ స్టేషన్‌ పరిధిలోని షిప్‌యార్డు లోవగార్డెన్స్‌లో శనివారం చోటుచేసుకుంది. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ ఇస్లాంపేటలో నివాసం వుంటున్న తాజుద్దీన్‌ మల్కాపురం జాలరవీధి పరిధిలో గల సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం ఉదయం షిప్‌యార్డు లోవగార్డ్‌న్స్‌ వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన విద్యుత్‌ లైన్‌లో మరమ్మతులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా పోర్టులో సంబంధిత విభాగానికి విద్యుత్‌ సరఫరా కావడం లేదంటూ పోర్టు అధికారులు మల్కాపురం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో లైన్‌మన్‌ అర్జున్‌, తాజుద్దీన్‌ మరమ్మతులు చేపట్టేందుకు లోవగార్డన్స్‌కు వెళ్లారు. అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి తాజుద్దీన్‌ ఎక్కి మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై ట్రాన్స్‌ఫార్మర్‌ పైనే మృతి చెందాడు. లైన్‌మన్‌ అర్జున్‌ ఈ విషయాన్ని ఈపీడీసీఎల్‌ అధికారులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని క్రేన్‌ సహాయంతో మృతదేహన్ని కిందకు దించారు. అనంతరం సమీపంలో వున్న ఐఎన్‌ఎస్‌ కల్యాణి ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. కాగా ట్రాన్స్‌పార్మర్‌పై మరమ్మతులు చేసేటప్పుడు మల్కాపురం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి ఎల్‌సీ (లైన్‌ క్లియరెన్స్‌) తీసుకున్నాకే పనులు చేపట్టామని, అయినా ఏ కారణం వల్లో విద్యుత్‌ సరఫరా కావడంతో తాజుద్దీన్‌ మృతి చెందాడని అర్జున్‌ చెబుతున్నాడు. ఈ ఘటనపై ఈపీడీసీఎల్‌ విజిలెన్స్‌ విభాగం అధికారులు ప్రత్యేకంగా  దర్యాప్తు సాగిస్తున్నారు. అలాగే మల్కాపురం సీఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన

విద్యుదాఘాతంతో మృతి చెందిన తాజుద్దీన్‌ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మల్కాపురం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద కుటుంబ సభ్యులు, ఎనర్జీ అసిస్టెంట్‌ ఉద్యోగులు, ఇస్లాంపేటకు చెందిన గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే కల్యాణి ఆస్పత్రిలో వున్న మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు అంగీకరిస్తామని చెబుతున్నారు. సీఐ దుర్గాప్రసాద్‌, ఈపీడీసీఎల్‌ డీఈ నాయుడు, ఏఈలు పిచ్చయ్య, శ్రీనివాస్‌, విద్యుత్‌ శాఖ యూనియన్‌ నాయకులు, సీపీఎం స్థానిక నాయకులు, మాజీ కార్పొరేటర్‌ రఫీ, తదితరులు కుటుంబ సభ్యులు, తదితరులతో చర్చలు జరుపుతున్నారు. Read more