ఖాళీ అవుతోన్న స్టీల్‌ ప్లాంటు!

ABN , First Publish Date - 2022-12-30T01:05:08+05:30 IST

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ఉద్యోగుల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తోంది. ‘

ఖాళీ అవుతోన్న స్టీల్‌ ప్లాంటు!

ఒకవైపు నిలిచిన పోస్టుల భర్తీ

మరోవైపు ఏటా వందలాది మంది పదవీ విరమణ

ఇంకొకవైపు ప్రైవేటీకరణ ప్రతిపాదనతో రాజీనామా చేసి వెళ్లిపోతున్న ఉద్యోగులు

అదేబాటలో మరికొందరు...

వదలని యాజమాన్యం

ఎన్‌ఓసీ ఇవ్వని వైనం

ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పోస్టులన్నీ ఖాళీయే

నాడు 64 మంది చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు...నేడు 20 మందే

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ఉద్యోగుల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తోంది. ‘అమ్మ పెట్టదు...అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా ప్రవరిస్తోంది. ప్లాంటును ప్రైవేటీకరించడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నందున ఉద్యోగుల సంఖ్య పెంచుకోకూడదని వ్యూహాత్మకంగా 2019 నుంచి పోస్టుల భర్తీ నిలిపివేసింది. 2020లో నోటిఫికేషన్‌ ఇచ్చినా...ఆ తరువాత దానిని రద్దు చేసింది. అసలు కీలకమైన ఉద్యోగుల నియామకం జరిగి చాలా కాలమైంది. కొంతకాలం ఐటీఐ చేసిన వారిని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా, ఇంజనీరింగ్‌ చేసిన వారిని మేనేజ్‌మెంట్‌ ట్రైనీలుగా తీసుకున్నారు. ఇప్పుడు...అది కూడా ఆగిపోయింది.

విశాఖ ఉక్కు పెద్ద కర్మాగారమని..ఐఐటీల్లో చదివినవారు గతంలో ఇక్కడకు వచ్చి చేరారు. ప్లాంటును ప్రైవేటీకరిస్తారని తెలియడంతో...అటువంటి వారంతా బయటకు వెళ్లిపోవడానికి యత్నిస్తున్నారు. మరోవైపు నెలకు 50 నుంచి 60 మంది చొప్పున ఏడాదికి 500 మందికి పైగా రిటైర్‌ అవుతున్నారు. ఒకవైపు ఉద్యోగులు తగ్గిపోతుండగా, మరోవైపు రిక్రూట్‌మెంట్‌ ఆపేశారు. పోనీ పనిచేస్తున్న వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇస్తున్నారా?...అంటే అదీ లేదు. దాంతో భవిష్యత్తుపై బెంగతో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు.

ఎన్‌ఓసీలు ఇవ్వడం లేదు

ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉన్నత స్థాయి అధికారులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు వెళుతుంటారు. ఇది చాలా సాధారణంగా జరుగుతుంది. ఎక్కడెక్కడో పనిచేసిన వారు ఇక్కడకు డైరెక్టర్లుగా, సీఎండీలుగా వచ్చినట్టే...ఇక్కడి వారు ఇతర సంస్థలకు డైరెక్టర్లుగా, ఈడీలుగా, ఎండీలుగా వెళుతుంటారు. ఆయా సంస్థల్లో నోటిఫికేషన్‌ పడినప్పుడు దరఖాస్తు చేస్తారు. ఇంటర్వ్యూకు పిలుపు వచ్చినప్పుడు ఇక్కడ నిరంభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) తీసుకొని సమర్పించాలి. మొన్నటివరకు ఇలాంటి ఎన్‌ఓసీలు అడిగిన వారికి ఇచ్చేవారు. ఇప్పుడు అలా అడిగితే ఇవ్వడం లేదు. మీరు ఉద్యోగం వచ్చి వెళ్లిపోతే...ఇక్కడ ఎవరితో పనిచేయించుకోవాలని అని ప్రశ్నిస్తూ హెచ్‌ఓడీలు నిరాకరిస్తున్నారు. దాంతో ఉన్నతోద్యోగులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. దుర్గాపూర్‌ వపర్‌ ప్లాంటులో పోస్టులు పడితే ఇక్కడివారు 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఎన్‌ఓసీలకు దరఖాస్తు చేస్తే ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక్కడ భవిష్యత్తు లేదు...బయటకు వెళదామంటే...అవకాశం ఇవ్వరు..? ఎలా అని అంతా వాపోతున్నారు. అలాగని ఏదీ రాతపూర్వకంగా చెప్పడం లేదు. ఈ బాధలు పడలేక గత ఆరు నెలల్లో 103 మంది ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేసి వెళ్లిపోయారు.

అనేక పోస్టులు ఖాళీ

స్టీల్‌ప్లాంటులో పర్సనల్‌ డైరెక్టర్‌ లేరు. ఫైనాన్స్‌ డైరెక్టర్‌ పోస్టులో అధికారికి ఆగస్టులో గడువు ముగిసింది. ఆయన్ను గాలిలో పెట్టారు. మూడు రోజుల క్రితమే ప్రాజెక్ట్స్‌కి డైరెక్టర్‌ను వేశారు. వాస్తవానికి ఇప్పుడు ప్రాజెక్టులు ఏమీ లేవు. ఇకపోతే 15 మంది ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ పోస్టులన్నీ ఖాళీ. ఎవరినీ నియమించలేదు. చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు 64 మంది ఉండాలి. కేవలం 20 మందే ఉన్నారు.

Updated Date - 2022-12-30T01:05:10+05:30 IST