జడ్పీ ఆస్తుల పరిరక్షణకు కృషి

ABN , First Publish Date - 2022-09-25T06:26:24+05:30 IST

మ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లోని విలువైన ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, కొన్ని చోట్ల వాణిజ్య అవసరాలను తగిన దుకాణాలు నిర్మించనున్నట్టు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపలి సుభద్ర వెల్లడించారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి ఆదివారానికి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో శనివారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు.

జడ్పీ ఆస్తుల పరిరక్షణకు కృషి
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు

నేడు జడ్పీటీసీ సభ్యులకు సత్కారం

జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

విశాఖపట్నం, సెప్టెంబరు 24: ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లోని విలువైన ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, కొన్ని చోట్ల వాణిజ్య అవసరాలను తగిన దుకాణాలు నిర్మించనున్నట్టు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపలి సుభద్ర వెల్లడించారు.  చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి ఆదివారానికి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో శనివారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. జడ్పీ ఆస్తులు అన్యాక్రాంతంకాకుండా బీవోటీ పద్ధతిలో దుకాణాలు నిర్మించి, ఆదాయం పెంచుకుంటామన్నారు. విశాఖలో 56, అనకాపల్లిలో 207, అల్లూరి జిల్లాలో 27 మొత్తం 290 ఆస్తులున్నట్టు గుర్తించామన్నారు. గోపాలపట్నం ఉన్నత పాఠశాల గోడ కూల్చిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేశామని, ఎంఈవో, హెచ్‌ఎంలపై చర్యలకు నిర్ణయించామన్నారు. విశాఖ, అనకాపల్లి పట్టణ పరిధిలో ఉన్న పాఠశాలలను మునిసిపాలిటీలో విలీనం చేయడానికి అంగీకరించామన్నారు. 


అభివృద్ధి పనులకు నిధులు 

జిల్లాలో ప్రతి జడ్పీటీసీ సభ్యుడికి రూ.15 లక్షలు, ఎమ్మెల్యేలకు రూ.50 లక్షలు చొప్పున అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామన్నారు. ఏడాదిలో సాధారణ నిధుల కింద వచ్చిన రూ.282.20 లక్షలతో 82, తాగునీటి కోసం రూ.144.25 నిధులతో 128, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రూ.276. 69లక్షలతో 104, ఎస్సీ గ్రాంట్‌ రూ.310.93 లక్షలతో 93, ఎస్టీ గ్రాంట్‌ రూ.169.08 లక్షలతో 73, 15వ ఆర్థిక సంఘం రూ.145.75 లక్షలతో 38  వెరసి రూ.13.28 కోట్లతో 518 పనులు చేపట్టగా, ఇప్పటివరకు 131 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి సమగ్ర తాగునీటి పథకాలకు వచ్చిన రూ.2805.21 లక్షలను 43 పథకాల నిర్వహణకు వెచ్చించామన్నారు. పనులు జరిగిన వెంటనే బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. కారుణ్య నియామకాలు పూర్తిచేస్తున్నామన్నారు. ఏజెన్సీలో ఎంపీడీవో ఖాళీలను ఇటీవల భర్తీ చేశామన్నారు. మండలాల్లో జడ్పీటీసీ సభ్యులకు చాంబర్ల కేటాయింపుపై ఎంపీపీల సహకారం తీసుకుంటున్నామని వివరించారు. పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆదివారం జడ్పీ హాలులో జడ్పీటీసీ సభ్యులను సత్కరించనున్నామన్నారు. ఏడాది పాలన సంతృప్తినిచ్చిందని, ఇందుకు సహకరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, జడ్పీ అధికారులు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాదిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. జడ్పీ పాఠశాలల్లో చదివే 8,9,10 తరగతుల  విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందజేస్తామని, పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు తీసుకుంటామని సుభద్ర వివరించారు. 

Read more