దుమ్ము లేస్తోంది..

ABN , First Publish Date - 2022-09-18T04:57:53+05:30 IST

కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఉంది మాడుగుల మండల వాసుల పరిస్థితి. గుంతలు పడిన రోడ్లుతో అవస్థలు పడుతుంటే.. వాటిని క్రషర్‌ బుగ్గితో కప్పి మరింత ఇబ్బంది పడే దుస్థితి నెలకొంది.

దుమ్ము లేస్తోంది..
ఎం.కోటపాడు-కేజేపురం జంక్షన్‌ రోడ్డులో లేచిన దుమ్ము


రోడ్లపై గుంతలను క్రషర్‌ బుగ్గితో కప్పిన అధికారులు

పెద్ద వాహనాలు వెళితే పొగలా ఎగురుతున్న దుమ్ము 

వాహనదారుల కంట్లో పడుతుండడంతో అవస్థలు 

మాడుగుల రూరల్‌, సెప్టెంబరు 17: కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఉంది మాడుగుల మండల వాసుల పరిస్థితి. గుంతలు పడిన రోడ్లుతో అవస్థలు పడుతుంటే.. వాటిని క్రషర్‌ బుగ్గితో కప్పి మరింత ఇబ్బంది పడే దుస్థితి నెలకొంది. పెద్ద వాహనాలు వెళితే దుమ్ము  రోడ్డంతా కమ్ముకుంటోంది. వడ్డాది-పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఎం.కోటపాడు, ఎంకే.వల్లాపురం, ఘాట్‌రోడ్డు- మాడుగుల, ఘాట్‌రోడ్డు-కింతలి రోడ్డు మార్గాల్లో ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా గుంతలు పడి ఛిద్రంగా మారింది. వర్షాలు పడితే నీరు గుంతల్లో చేరి మడుగులను తలపించేవి. మాడుగుల గ్రామానికి రావాలన్నా, మాడుగుల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా గోతుల రోడ్డుని దాటుకుని వెళ్లడానికి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర రోడ్డు మరమ్మతులు పేరుతో అధికారులు ఈ రోడ్లుపై కంకర పిక్క వేసి, క్రషర్‌ బుగ్గి పోసి రోలింగ్‌ చేశారు. అలాగే ఎం.కోటపాడు, ఎంకే.వల్లాపురం, కేజేపురం జంక్షన్‌ వరకు గ్రానైట్‌ క్వారీ నిర్వాహకుల సహకారంతో కంకర పిక్క వేసి, క్రషర్‌ బుగ్గి వేసి రోలింగ్‌ చేశారు. గుంతల సమస్యలు తీరాయని వాహనదారులు ఎంతో సంబరపడ్డారు. అయితే పెద్ద వాహనాలు వెళితే రోడ్డంతా క్రషర్‌ బుగ్గి లేచి పొగలా చుట్టేస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన దారులు, ఆటోవాళ్లు మరింత ఇబ్బంది పడుతున్నారు. దుమ్ము కళ్లల్లోకి పోయి ఇబ్బంది పడుతున్నామని ద్విచక్ర వాహనదారులు మండిపడుతున్నారు. దీనిపై పాలకులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. Read more