దసరా సందడి

ABN , First Publish Date - 2022-10-05T05:41:57+05:30 IST

దసరా పండుగ సందర్భంగా కొనుగోలుదారులతో గృహోపకరణాలు, వస్త్ర దుకాణాలు, వాహనాల షోరూమ్‌లు రద్దీగా మారాయి. ఎలక్ర్టానిక్స్‌ వస్తువులపై డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు ఇస్తుండడంతో సెల్‌ ఫోన్లు కొనుగోలుకు యువత మొబైల్‌ షాపుల వద్ద క్యూ కట్టారు. పూలు, పండ్లు, ఇతర పూజా సామగ్రి విక్రయించే ప్రాంతాలకు ప్రజలు పోటెత్తారు.

దసరా సందడి
కొనుగోలుదారులతో సందడిగా వున్న అనకాపల్లిలోని ఒక వస్త్ర దుకాణం

మార్కెట్‌లో పండుగ కళ

కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న దుకాణాలు

పలు రకాల వస్తువులపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు 

దుస్తులు, బంగారం, సెల్‌ఫోన్లు, గృహోపకరణాల షాపుల్లో రద్దీ

కరోనా తగ్గడంతో అమ్మకాలు బాగున్నాయని వ్యాపారులు ఆశాభావం

అనకాపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా కొనుగోలుదారులతో గృహోపకరణాలు, వస్త్ర దుకాణాలు, వాహనాల షోరూమ్‌లు రద్దీగా మారాయి. ఎలక్ర్టానిక్స్‌ వస్తువులపై డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు ఇస్తుండడంతో సెల్‌ ఫోన్లు కొనుగోలుకు యువత మొబైల్‌ షాపుల వద్ద క్యూ కట్టారు.  పూలు, పండ్లు, ఇతర పూజా సామగ్రి విక్రయించే ప్రాంతాలకు ప్రజలు పోటెత్తారు. 

కరోనా ప్రభావంతో గత రెండేళ్లు దసరా పండుగను ప్రజలు అంత ఉత్సాహంగా జరుపుకోలేదు. ఈ ఏడాది వైరస్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. మిగిలిన పండుగలతో పోలిస్తే దసరా పండుగకు ఒక ప్రత్యేకత వుంది. ఇతర పండుగలను ఒకట్రెండు రోజులు.. మహా అయితే మూడు రోజులపాటు జరుపుకుంటుంటారు. కానీ దసరా పండుగను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయాల్లో నిత్యం కుంకుమపూజలు, అభిషేకాలు జరుపుతారు. అమ్మవారిని రోజుకో అవతారంలో అలంకరిస్తారు. ఆలయాలన్నీ భక్తులతో సందడిగా వుంటాయి. వీధుల్లో మండపాలు ఏర్పాటుచేసి, అమ్మవారి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. మరోవైపు కొత్త దుస్తులు, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు, వాహనాలను కొనుగోలు చేయడానికి పలువురు ఆసక్తి చూపుతుంటారు. దీంతో ఆయా దుకాణాలు గత రెండు మూడు రోజుల నుంచి రద్దీగా మారాయి. వస్త్రాలు, రెడీమెడ్‌ దుస్తులు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, టీవీలు, వాషింగ్‌ మెషిన్లు, ఇతర ఎలక్ర్టానిక్స్‌, ఎలక్ర్టికల్‌ వస్తువులపై పలు షోరూమ్‌లు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ప్రకటించడంతో యువత, మహిళలతో ఆయా షాపుల్లో రద్దీ నెలకొంది. అనకాపల్లిలో నెహ్రూచౌక్‌, పెరుగు బజారు జంక్షన్‌, చిన్న నాలుగురోడ్డ జంక్షన్‌, చింతావారి వీఽధి ప్రాంతాల్లోని పలు దుకాణాలు గత రెండు మూడు రోజులుగా  కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. బంగారం, దుస్తులు, గృహోపకరణాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 20-30 శాతం మేర అధికంగా జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట వంటి పట్టణ ప్రాంతాల్లో కూడా ఆయా వ్యాపారాలు జోరుగా సాగాయి. కరోనా ప్రభావంతో గడిచిన రెండేళ్లు వ్యాపారాలు అంతంతమాత్రంగానే సాగాయని, ఈసారి కరోనా ప్రభావం లేకపోవడంతో అమ్మకాలు పెరుగుతాయని ఆయా వ్యాపారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

తగ్గిన వాహనాల అమ్మకాలు

దసరా పండుగ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయడం పలువురు సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అష్టమి, నవమి, దశమి రోజుల్లో వాహనం డెలివరీ అయ్యేలే షోరూమ్‌లలో ముందుగానే బుక్‌ చేసుకుంటుంటారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ద్విచక్రవాహనాలు, కార్లు అమ్మకాలు తగ్గాయని షోరూమ్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. వాహనాల ధరలు 10 నుంచి 20 శాతంవరకు పెరగడంతో పలువురు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని, దీంతో కొత్త వాహనాల అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగడంలేదని అనకాపల్లికి చెందిన ఓ కంపెనీకి చెందిన ద్విచక్రవాహనాల షోరూమ్‌ యజమాని చెప్పారు.


Read more