దంచి కొట్టిన వర్షం

ABN , First Publish Date - 2022-10-08T06:13:44+05:30 IST

ఉపరితల ద్రోణి ప్రభావంతో గడచిన మూడు రోజులుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో మండలంలోని చెరువుల్లో భారీగా నీరు చేరింది.

దంచి కొట్టిన వర్షం
మాడుగుల రూరల్‌: వాడపాడు వద్ద జోరుగా పారుతున్న పెద్దేరు నది

కొనసాగుతున్న ముసురు 

జలమయమైన పల్లపు ప్రాంతాలు

ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, గెడ్డలు

పారుతున్న చెరువుల పొర్లుకట్టులు 

పూర్తిగా పాడైన రహదారులు

కూలిన పెంకిటిల్లు, పూరిళ్లు

కారిపోతున్న ప్రభుత్వ భవనాలు

బుచ్చెయ్యపేట మండలంలో 

వంద ఎకరాల్లో నీటమునిగిన వరి 

చోడవరం, అక్టోబరు 7: ఉపరితల ద్రోణి ప్రభావంతో గడచిన మూడు రోజులుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో మండలంలోని చెరువుల్లో భారీగా నీరు చేరింది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు ఏరుల్లా పారుతున్నాయి. జిల్లాలో అతిపెద్దదైన లక్ష్మీపురం చెరువు నిండిపోయి పొర్లుగట్టుపై నుంచి పారుతున్నది. పట్టణంలోని బాలాజీ నగర్‌లో మోకాలి లోతులో నీరు ప్రవహిస్తున్నది. లోతట్టు ప్రాంతాలైన పూర్ణ థియేటర్‌, రెల్లికాలనీ, చీడికాడ రోడ్డులో కూడా నీరు రోడ్లపై పారుతున్నది. ఇక ప్రధాన రహదారిలో సైతం వర్షపు నీరు రహదారిపై పారుతున్నది. మరో రెండు రోజులు ఇదే విధంగా వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు స్థానికులకు గుబులును రేపుతున్నాయి. 


చెరువును తలపిస్తున్న రోడ్డు


అసలే అధ్వానంగా ఉన్న చోడవరం ప్రధాన రహదారి వర్షాలకు మరింత దయనీయంగా తయారైంది. రహదారి పూర్తిగా శిఽథిలం కావడంతో స్థానిక గాంధీగ్రామం సమీపంలోని రోడ్డు చెరువును తలపిస్తున్నది. సర్పంచ్‌ గాడి అప్పారావు ఈ రోడ్డుపై భారీ గుంతను పూడ్చేందుకు ట్రాక్టర్లతో డెబ్రిస్‌ను పోయిస్తుండడంతోపాటు,రోడ్డుపై నిలిచిపోతున్న నీటిని బయటకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వర్షం మళ్లీ కురుస్తుండడంతో రోడ్డుపై నీరు నిల్వ ఉండిపోవడంతో వాహనదారులు అగచాట్లకు గురవుతున్నారు. 


మండలంలో కుండపోత


బుచ్చెయ్యపేట: అల్పపీడన ద్రోణి ప్రభావంతో మండలంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయం కాగా, పంటలు నీట మునిగాయి. పెద్దేరు, తాచేరు, బొడ్డేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. వడ్డాది, లోపూడి, బంగారుమెట్ట, విజయరామరాజుపేట, ఎల్‌.సింగవరం, పొట్టిదొరపాలెం, భట్లోవ, గంటికొర్లాం గ్రామాల్లో 100 ఎకరాలో వరి పంట నీట మునిగింది. బీఎన్‌ రోడ్డులో బంగారుమెట్ట కూడలి వద్ద రోడ్డుపై నుంచి వర్షం నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాలతో తహసీల్దార్‌ ఎస్వీ. అంబేడ్కర్‌ వరద పరిస్థితిపై వీఆర్వోలతో సమీక్షించారు. నదుల ప్రవాహక ప్రాంతాలకు సమీపంలో ఉన్న మంగళాపురం, విజయరామరాజుపేట, వడ్డాది గ్రామాల్లో లోతట్టు ప్రాంత నివాసులను వరదపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు. 


ఉధృతంగా పెద్దేరు, తాచేరు గెడ్డ


మాడుగుల రూరల్‌: అల్పపీడన ద్రోణి ప్రభావంతో మండలంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పెద్దేరు, తాచేరు, గొర్రిగెడ్డ, ఉరకగెడ్డలతోపాటు చిన్న వాగులు ఉధృతంగా పారుతు న్నాయి. పెద్దేరు జలాశయం నుంచి నీటిని విడిచిపెట్టడంతో వాడపాడు, జంపెన గ్రామాల మధ్య గల వంతెన వద్ద పెద్దేరు నీటి ప్రవాహం జోరందుకుంది. అలాగే అవురువాడ వెళ్లే దారిలో కల్వర్టుపై నుంచి గొర్రిగెడ్డ జోరుగా పారుతుండడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 


కారిపోయిన ప్రభుత్వ కార్యాలయాలు


నాతవరం: వర్షాలకు మండల పరిషత్‌, గ్రంఽథాలయం, తహసీల్దార్‌ కార్యాలయ భవనాలు లీకేజీలతో గదులలో నీరు చేరడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బంది పడ్డారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సిబ్బంది ఉండే గది లీకేజీలతో వర్షం నీరు చేరడంతోపాటు గదులలో ఉండే బీరువాలపై నీరు పడడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన మండలపరిషత్‌ కార్యాలయ భవనం శిఽథిలావస్థకు చేరుకోవడంతోనే లికేజీ అవుతున్నది. అలాగే చిన్నపాటి వర్షానికి గ్రంథాలయం గదులన్నీ నీటితో నిండిపోతున్నాయని పాఠకులు తెలిపారు. అలాగే తహసీల్దార్‌ కార్యాలయంలో రెండు గదులు వర్షానికి కారిపోతున్నాయి.


రోడ్లు జలమయం 


గొలుగొండ: వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహించడంతోపాటు రోడ్లు జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు వాహన చోదకులు అనేక ఇబ్బందులు పడ్డారు. వర్షాలకు రాళ్లగెడ్డ, ధారగెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డుపై వరద నీరు పారడంతో వాహన చోదకులు అనేక ఇబ్బందులు పడ్డారు. నర్సీపట్నం నుంచి కృష్ణాదేవిపేట వెళ్లే రోడ్డులో పప్పుశెట్టిపాలెం నుంచి ఎర్రవరం గ్రామాల మధ్య ఐదు కిలోమీటర్లు రోడ్డు గతుకులమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


వర్షానికి కూలిన పెంకిటిల్లు, పూరిళ్లు


కృష్ణాదేవిపేట: వర్షాలకు శుక్రవారం ఇళ్లు కూలిపోయాయి. ఏఎల్‌పురం బీసీ కాలనీకి చెందిన షేక్‌ కొండాసాయిబ్‌, అనిమిరెడ్డి శేషు, శ్రీశైలపు జోగినాధం, చోద్యం గ్రామంలో బంగారు సత్యవతి, అదపురెడ్డి రాజు, చిట్టెమ్మ తదితరుల పూరిళ్లు, పెంకిటిల్లు కూలిపోయాయి. వర్షం నీటిలో మునగడంతో మరుగుదొడ్లు, ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ఏఎల్‌పురంలో వినాయకవీధి, బీసీ కాలనీల్లో రోడ్డుపై మురుగు పారింది. పాతకృష్ణాదేవిపేటలో వజ్రపు కన్నయ్యమ్మ అనే వృద్ధురాలు పెంకిటిల్లు గురువారం అర్ధరాత్రి కుప్పకూలింది.  

Updated Date - 2022-10-08T06:13:44+05:30 IST