కేజీహెచ్‌లో వైద్య సేవలపై డీఎంఈ సమీక్ష

ABN , First Publish Date - 2022-06-12T06:33:08+05:30 IST

కేజీహెచ్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు ఆస్పత్రి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

కేజీహెచ్‌లో వైద్య సేవలపై డీఎంఈ సమీక్ష

విశాఖపట్నం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కేజీహెచ్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు ఆస్పత్రి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆయన ఆస్పత్రిలోనే గడిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏఎంసీలోని సెమినార్‌ హాల్‌లో కేజీహెచ్‌లోని పలు విభాగాధిపతులతో సమీక్షించిన ఆయన.. రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. సాయంత్రం నాలుగు నుంచి సుమారు రెండు గంటలపాటు కేజీహెచ్‌లోని క్యాజువాల్టీతో పాటు పలు వార్డులు, సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లను సందర్శించారు. సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ను రోగులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న రోగి మిత్రలను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. అలాగే మరికొంత మంది సిబ్బందిని తొలగించాలని సూచించగా, అందుకు కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నట్టు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై లిఖితపూర్వక ఆదేశాలను జారీ చేస్తానని ఆయన చెప్పినట్టు తెలిసింది. రోగులకు మెరుగైన వైద్య సేవలందించే విషయంలో రాజీ పడొద్దని, వైద్య సిబ్బంది అలసత్వంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బయో మెట్రిక్‌ను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలితో పాటు ఏడీ శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వైజీ జ్ఞాన సుందరరాజు, ఆర్‌ఎంవో డాక్టర్‌ బిందు మాధవి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-12T06:33:08+05:30 IST