దిష్టిబొమ్మల్లా హాట్‌ బజార్లు

ABN , First Publish Date - 2022-09-25T06:17:16+05:30 IST

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా ఉంది మన్యంలోని హాట్‌ బజార్ల నిర్మాణం పరిస్థితి.

దిష్టిబొమ్మల్లా హాట్‌ బజార్లు
పాడేరు మండలం గుత్తులపుట్టులో శ్లాబ్‌ స్థాయిలో నిలిచిన హాట్‌ బజార్‌ నిర్మాణం

 ఏజెన్సీలో 46 బజార్ల నిర్మాణానికి కేంద్రం రూ.2.3 కోట్లు మంజూరు

- ఆ నిధులను విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం

- చేసిన పనికి బిల్లులు రాక నిలిపివేసిన కాంట్రాక్టర్లు

- ఏడాది దాటినా ముందుకు సాగని పనులు 



                            (ఆంధ్రజ్యోతి- పాడేరు) 

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా ఉంది మన్యంలోని హాట్‌ బజార్ల నిర్మాణం పరిస్థితి. ఏజెన్సీ వ్యాప్తంగా హాట్‌బజార్ల నిర్మాణానికి గతేడాది కేంద్రం రూ.2.3 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ, ఆ నిధులను విడుదల చేయకపోవడంతో ఆయా నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఏజెన్సీలో వాటి నిర్మాణాలు ప్రారంభించి ఏడాది దాటినా ఇప్పటికీ అవి పూర్తికాలేదు. 

----

ఏజెన్సీలోని వారపు సంతల్లో గిరిజన రైతులకు వసతి కల్పించేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ 2010- 20 ఆర్థిక సంవత్సరంలో గిరిజన సహకార సంస్థకు రూ.2.3 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనులున్న గ్రామాల్లో హాట్‌ బజార్ల పేరిట చిన్న భవనాలను నిర్మించాలని జీసీసీ, ఐటీడీఏ అధికారులు నిర్ణయించారు. అందుకు వెలుగు అధికారుల ద్వారా ఏజెన్సీలో ఎక్కడెక్కడ హాట్‌ బజార్లను నిర్మించాలనేది గుర్తించారు. ఏజెన్సీలో అనంతగిరిలో 1, అరకులోయలో 5, చింతపల్లిలో 4, డుంబ్రిగుడలో 4, జీకేవీధిలో 6, జి.మాడుగులలో 3, హుకుంపేటలో 7, కొయ్యూరులో 2, ముంచంగిపుట్టులో 3, పాడేరులో 6, పెదబయలులో 5 చోట్ల.. మొత్తం 46 ప్రాంతాల్లో హాట్‌ బజార్లను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో హాట్‌ బజార్‌కు రూ.5 లక్షలు వ్యయం చేయాలని, దానిని పది అడుగుల వెడల్పు, పద్నాలుగు అడుగుల పొడవుతో నిర్మించడంతోపాటు బోరు వేసి తాగునీటి సదుపాయం కల్పించాలని ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే గతేడాది ఆగస్టులో వాటి నిర్మాణ పనులు ప్రారంభించారు. వాటిని నాలుగు నెలల్లోనే పూర్తి చేసి ఈ ఏడాది జనవరి నాటికి పూర్తిగా గిరిజన రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు అప్పట్లో భావించారు.

నిధులు విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం

ఏజెన్సీలో హాట్‌బజార్ల నిర్మాణానికి సంబంధించిన నిధులను కేంద్రం గతేడాది మార్చిలోనే రాష్ట్రానికి విడుదల చేసింది. దీంతో ఏజెన్సీలో వాటి నిర్మాణాలను గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారులు కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. కానీ వాటి నిర్మాణానికి సంబంధించి పలు దశల్లో జరిగిన పనులకు బిల్లులు పెట్టినప్పటికీ, నిధులు విడుదల కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాటి నిర్మాణాలు పూర్తయినా నిధులు విడుదల కాకపోతే ఇబ్బందులు పడతామనే భయంతో ఎక్కడికక్కడ వాటి నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు గతేడాది నవంబరులోనే ఆపేశారు. అప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను సీఎంఎఫ్‌ఎస్‌లో అప్పట్లోనే అప్‌లోడ్‌ చేసినప్పటికీ ఒక్క పైనా విడుదల కాలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్లు చేసిన పని వరకు తమకు బిల్లులు విడుదలైతేనే గాని మిలిగిన పని జోలికి వెళ్లలేమని చేతులేత్తేశారు. వాటి నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు విడుదల చేసినప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా మిన్నకుండడంతో ప్రస్తుతం హాట్‌ బజార్లు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-09-25T06:17:16+05:30 IST