డిజిడల్‌ కాటాలు

ABN , First Publish Date - 2022-02-19T06:08:10+05:30 IST

ఏజెన్సీలోని వారపు సంతల్లో ఏర్పాటుచేసిన డిజిటల్‌ తూనిక కేంద్రాలు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి.

డిజిడల్‌ కాటాలు

మన్యం వారపు సంతల్లో నిరుపయోగంగా యంత్రాలు

ఆరేళ్ల క్రితం 20 సంతల్లో డిజిటల్‌ తూనిక కేంద్రాల నిర్మాణం

ప్రత్యేక ప్యాకేజీ నిధుల నుంచి రూ.1.2 కోట్లు వ్యయం 

తూకంలో మోసాలకు బ్రేక్‌... సంతోషించిన గిరిజనులు

నాటి కలెక్టర్‌ బదిలీ తరువాత కొరవడిన నిర్వహణ

యథావిధిగా తూకంలో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులు


పాడేరు, ఫిబ్రవరి 18: 

ఏజెన్సీలోని వారపు సంతల్లో ఏర్పాటుచేసిన డిజిటల్‌ తూనిక కేంద్రాలు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. సంతల్లో గిరిజనుల నుంచి వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు తూకంలో మోసాలకు పాల్పడకుండా వుండేందుకు ఏర్పాటుచేసిన డిజిటల్‌ కాటాలు నిరుపయోగంగా మారాయి. ఎక్కువ లావాదేవీలు జరిగే 20 వారపు సంతల్లో సుమారు ఆరేళ్ల క్రితం డిజిటల్‌ తూనిక కేంద్రాలను ఏర్పాటుచేయగా, వీటిల్లో ప్రస్తుతం ఒక్కటి కూడా వినియోగంలో లేదు. డిజిటల్‌ తూనిక కేంద్రాలను ఎవరు నిర్వహించాలన్న దానిపై ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడంతో

ఈ దుస్థితి ఏర్పడిందని గిరిజన రైతులు వాపోతున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో పండించే వ్యవసాయ, ఉద్యానవన పంటలతోపాటు కొండకోనల్లో సేకరించే అటవీ ఉత్పత్తులను గిరిజనులు సమీపంలోని సంతలకు తీసుకువెళ్లి మైదాన ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులకు విక్రయిస్తుంటారు. అయితే వ్యాపారులు మూడు కర్రల కాటాలతో తూకం  విషయంలో మోసాలకు పాల్పడుతున్నారు. వాస్తవ బరువు కంటే ఐదు నుంచి పది శాతం తక్కువ వుండేలా కాటాను, తూనిక రాళ్లను సెట్‌ చేస్తుంటారు. దీనివల్ల తాము నష్టపోతున్నామని, వ్యాపారుల మోసాలను అరికట్టాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తుండేవారు.  


రూ.1.2 కోట్లతో డిజిటల్‌ తూనిక కేంద్రాల నిర్మాణం

జిల్లా కలెక్టర్‌గా యువరాజ్‌ వున్నప్పుడు 2016వ సంవత్సరంలో మన్యం సంతల్లో డిజిటల్‌ తూనిక కేంద్రాలను ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. ఎక్కువ లావాదేవీలు జరిగే పాడేరు, గుత్తులపుట్టు, మినుములూరు, వంట్లమామిడి, హుకుంపేట, కించుమండ, అరకు, సుంకరమెట్ట, డముకు, అనంతగిరి, కాశీపట్నం, జి.మాడుగుల, మద్దిగరువు, అన్నవరం, చింతపల్లి, ఆర్వీనగర్‌, పెదవలస, సప్పర్ల, పెదబయలు, ముంచంగిపుట్టు సంతల్లో ఒక్కొక్కటి రూ.6 లక్షల వ్యయంతో డిజిటల్‌ తూనిక కేంద్రాలను ఏర్పాటు చేయించారు. జిల్లాకు కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధుల నుంచి రూ.1.2 కోట్లు ఖర్చు చేశారు. అదే ఏడాది ఏప్రిల్‌లో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెలకిశోర్‌బాబు డిజిటల్‌ తూనిక కేంద్రాలకు ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో వుండే సిబ్బంది...గిరిజనులు తీసుకువచ్చే సరకులను తూకం వేసి, బరువుకు సంబంధించిన వివరాలతో కంప్యూటర్‌ ద్వారా స్లిప్‌ను అందజేస్తారు. తరువాత రైతులు తమ సరకులను కొనుగోలు చేసే వ్యాపారికి ఈ స్లిప్‌ ఇస్తారు. సరకు ధర మాట్లాడుకుని, నిర్ణీత మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు. డిజిటల్‌ తూనిక కేంద్రాల వల్ల తమకు న్యాయం జరుగుతున్నదని గిరిజన రైతులు సంతోషించారు. 


యువరాజ్‌ బదిలీతో కొరవడిన నిర్వహణ

డిజిటల్‌ తూనిక కేంద్రాల సేవలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. కలెక్టర్‌ యువరాజ్‌ బదిలీ కావడం, డిజిటల్‌ కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఏ శాఖకూ అప్పగించకపోవడంతో క్రమేణా ఒక్కటొక్కటిగా మూతపడ్డాయి. ఆరేళ్ల క్రితం నిర్మించినవి కావడంతో కేంద్రాల్లోని యంత్రాల పరిస్థితి ఏమిటో తెలియదు. కొన్నిచోట్ల ఈ కేంద్రాల భవనాలను వీటిని స్థానికులు తమ సొంత అవసరాలకు వినియోగిస్తుండగా, మరికొన్నిచోట్ల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేశారు. 


మూడు కర్రల కాటాలతో కొనసాగుతున్న మోసం

ఐఏఎస్‌ అధికారి హరినారాయణన్‌...పాడేరు ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో పలు వారపు సంతలను సందర్శించారు. వ్యాపారులు మూడు కర్రల కాటాలతో అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను తూకం వేయడాన్ని గమనించారు. వీటివల్ల మోసాలు జరుగుతున్నట్టు గుర్తించి, వ్యాపారులు విధిగా ఎలక్ర్టానిక్‌ తూనిక యంత్రాలను వినియోగించాలని, లేకపోతే చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీచేశారు. దీంతో అక్కడక్కడా ఎలక్ర్టానిక్‌ తూనిక యంత్రాలను ఏర్పాటుచేశారు. కానీ తర్వాత వచ్చి పీవోలు పట్టించుకోకపోవడంతో మళ్లీ వ్యాపారులు యథావిధిగా పాత కాటాలనే వినియోగిస్తున్నారు.

Read more