ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్‌

ABN , First Publish Date - 2022-10-04T06:51:34+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో వెళుతున్న ఓ లారీ సాంకేతిక సమస్య తలెత్తడంతో రోడ్డు మధ్యలో నిలిచిపోయింది.

ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్‌
ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో నిలిచిపోయిన లారీ

రహదారికి అడ్డంగా నిలిచిపోయిన లారీ

కొండవైపు తుప్పలు తొలగించి దారి చేసిన స్థానికులు

జీపులు, కార్లు, ఆటోలకు లైన్‌ క్లియర్‌

వెనక్కు మళ్లిన ఆర్టీసీ బస్సులు

ఇబ్బంది పడిన ప్రయాణికులు




సీలేరు, అక్టోబరు 3: అల్లూరి సీతారామరాజు జిల్లా ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో వెళుతున్న ఓ లారీ సాంకేతిక సమస్య తలెత్తడంతో రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో చింతపల్లి-సీలేరు ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్పందించిన స్థానికులు లారీకి ఎడమవైపున తుప్పలు తొలగించి ద్విచక్రవాహనాలు, కార్లు, జీపులు వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులను ఇరువైపులా వెనక్కు మళ్లించారు. లారీలు, ఇతర భారీ వాహనాలు కదలలేని పరిస్థితి. సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన జరిగ్గా, రాత్రి 11 గంటల ప్రాంతంలో కూడా లారీని పక్కకు తీయలేదు.  

హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి విశాఖపట్నానికి యాపిల్‌ పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ సాంకేతిక సమస్య తలెత్తి జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ ధర్మాపురం వద్ద ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో ఆగిపోయింది. దీంతో ద్విచక్రవాహనాలు, ఆటోలు మినహా మరే ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటి తరువాత స్థానికులు అక్కడకు చేరుకుని లారీకి ఎడమ వైపున తుప్పలు తొలగించి, మట్టి దిబ్బలను సరిచేయడంతో కార్లు,  జీపులు, మినీ వ్యాన్‌లు వెళ్లడానికి వీలుకలిగింది. బస్సులు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి విశాఖపట్నం, గుమ్మిరేవుల నుంచి నర్సీపట్నం వెళుతున్న బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే బస్సు  మధ్యాహ్నం 12 గంటలకు సప్పర్ల చేరుకోగా, అప్పటికే సమాచారం తెలియడంతో సప్పర్ల వద్ద నిలిపివేశారు. అనకాపల్లి-సీలేరు, నర్సీపట్నం-సీలేరు బస్సులను ధర్మాపురం, సప్పర్ల నుంచి వెనుదిరగడంతో సీలేరు, ధారకొండ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 

కాగా లారీకి మరమ్మతులు చేయించడానికి ఉదయం మెకానిక్‌ను తీసుకురావడానికి  ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి నర్సీపట్నం వెళ్ళిన వాళ్లు సాయంత్రం ఆరు గంటలకు కూడా ఈ ప్రాంతానికి చేరుకోకపోవడంతో

ఆర్టీసీ సిబ్బంది తమ ఉన్నతాధికార్లతో మాట్లాడి 

కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళుతున్న బస్సులోని ప్రయాణికులను, భద్రాచలం నుంచి విశాఖ వెళుతున్న బస్సులోకి, అదే విధంగా ఈ బస్సు (భద్రాచలం-విశాఖ)లోని ప్రయాణికులను ఆ బస్సులోకి (విశాఖ-భద్రాచలం) బస్సులోకి ఎక్కించి  గమ్యస్థానాలకు పంపారు. పాడేరు-డొంకరాయి బస్సులోని ప్రయాణికులను కూడా భద్రాచలం బస్సులో ఎక్కించారు. కాగా నర్సీపట్నం నుంచి మెకానిక్‌ నుంచి తీసుకురావడానికి ఉదయం 9 గంటలకు వెళ్లిన లారీ సిబ్బంది, రాత్రి 11 గంటల సమయానికి కూడా ఇక్కడికి రాలేదని తెలిసింది.


Updated Date - 2022-10-04T06:51:34+05:30 IST