అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండా

ABN , First Publish Date - 2022-10-08T06:13:34+05:30 IST

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన అజెండా అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండా
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పీడిక రాజన్నదొర. చిత్రంలో మంత్రులు ముత్యాలనాయుడు, అమర్‌, ప్రజాప్రతినిధులు

అర్హులందరికీ పథకాలు అందాలి

డీఆర్‌సీ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి రాజన్నదొర

పలు శాఖల పనితీరుపై సమీక్ష

ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి

డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఆదేశం

మొక్కుబడిగా తొలి సమావేశం


అనకాపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన అజెండా అని, అర్హులైన  ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారి  శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా మండలి (డీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడానికి చేయడానికి నివేదికలు సిద్ధం చేయాలని, ఇప్పటికే చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వివిధ శాఖల ప్రగతిని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శించారు. వ్యవసాయం, నీటి పారుదల, గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్యం, తాగునీటి సరఫరా, పౌర సరఫరాలు, తదితర శాఖల పనితీరును సమీక్షించారు. ఆయా శాఖలు చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులు వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ వైద్యులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగుపర్చాలన్నారు. జిల్లాలోని అన్ని జలాశయాలు  పూర్తిగా నిండాయని, అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలని, మిల్లర్లతో మాట్లాడి పంట నూర్పిళ్లు మొదలైన వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ, పథకాల అమలులో నిధుల సమస్య ఏర్పడితే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు లేదా మంత్రుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి... వివిధ శాఖలకు సంబంధించి అదనపు సమాచారాన్ని, చేపట్టిన చర్యలను వివరించారు.  ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, ఎంపీ డాక్టర్‌ బీవీ.సత్యవతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌, డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, జేసీ కల్పనాకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

మొక్కుబడిగా తొలి సమావేశం

అనకాపల్లి జిల్లా ఏర్పాటైన తరువాత తొలిసారి నిర్వహించిన జిల్లా అభివృద్ధి మండలి సమావేశం   మొక్కుబడిగా ముగిసింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించిన ఈ సమావేశాన్ని రెండు గంటల్లోనే ముగించారు. వ్యవసాయం, జల వనరులు, వైద్య ఆరోగ్య, గృహ నిర్మాణ శాఖలపైనే మంత్రులు సమీక్ష జరిపారు. మిగిలిన శాఖల గురించి పట్టించుకోలేదు. కనీసం అజెండాలోని అంశాలను కూడా పూర్తిస్థాయిలో చర్చించలేదు.


Read more