డెంగ్యూ పేరుతో దందా..!

ABN , First Publish Date - 2022-09-19T07:07:09+05:30 IST

జిల్లాలో కొద్దిరోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి.

డెంగ్యూ పేరుతో దందా..!

జ్వరంతో వస్తే  పరీక్ష చేయాల్సిందే

కొందరు వైద్యుల తీరిది 

వైరల్‌ ఫీవర్‌ వచ్చినా భయపడుతున్న జనం

సొమ్ము చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి) 

జిల్లాలో కొద్దిరోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ బాధితులు ఉంటున్నారు. వీరిలో ఎక్కువమంది డెంగ్యూ, డెంగ్యూ లైక్‌ఫీవర్స్‌కు గురయినట్టు సమాచారం. తీవ్రమైన జ్వరం, నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో ఆందోళన చెందుతున్న వారంతా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు డెంగ్యూ పేరుతో దోపిడీ చేస్తున్నారు. అధికమొత్తంలో ఫీజులు వసూలు చేయడంతో పాటు, అన్ని రకాల పరీక్షల పేరుతో పెద్దమొత్తం లాగేస్తున్నారు. 


డెంగ్యూను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చింది. దీంతో నెట్వర్క్‌ ఆస్పత్రులు ఉచితంగా వైద్య సేవలు అందించాలి. అతికొద్ది ఆస్పత్రులు మాత్రమే ఈ సేవలు అందిస్తుండగా, అధికశాతం రోగుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. డెంగ్యూ అని పేర్కొంటే తప్పనిసరిగా ఉచిత సేవలు అందించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో డెంగ్యూ లైక్‌ ఫీవర్‌, వైరల్‌ ఫీవర్‌గా రిపోర్టుల్లో పేర్కొంటున్నాయి. రోగులు, వారి బంధువులకు మాత్రం డెంగ్యూగా చెబుతూనే ఫీజు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్పత్రుల స్థాయిని బట్టి ఐదు నుంచి పది రోజులపాటు ఇన్‌పేషెంట్‌లు గా చేర్చుకుంటున్నారు. రూ.5 వేల నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారు. జ్వరంతో వస్తున్న రోగులను ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నాయని, ఐదారు రోజులు ఉండాలని ఆస్పత్రుల సిబ్బంది చెబుతున్నారు. దీంతో రోగుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది.  


పరీక్షలు తప్పనిసరి.. 

ప్రస్తుతం జ్వరమని ఏ ఆస్పత్రికి వెళ్లినా పరీక్షలు చేయించుకుని రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్ని రోజులుగా జ్వరం ఉంది, నీరసంగా ఉందా..? అని అడుగుతున్న వైద్యులు డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియాతోపాటు ప్లేట్‌లెట్‌ కౌంట్‌తో పాటు మరిన్ని పరీక్షలు చేయించుకురావాలని సూచిస్తున్నారు. రిపోర్టుల్లో నెగిటివ్‌ వస్తున్నా రోగి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఇన్‌పేషెంట్‌లుగా చేరడం మంచిదని సూచిస్తున్నారు. చిన్నపాటి క్లినిక్‌లకు వెళుతున్న రోగులకు దగ్గర్లోని ఓ పెద్ద హాస్పిటల్‌ను సూచిస్తున్నారు. అక్కడి వెళ్తే మొత్తం పరిస్థితి మారిపోతోంది. జ్వరం వల్ల వచ్చిన నీరసాన్ని డెంగ్యూ లైక్‌ ఫీవర్‌, కొన్నిచోట్ల డెంగ్యూగా పేర్కొంటూ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. 


పరీక్షలకు తప్పని బాదుడు.. 

జ్వర లక్షణాలతో వెళ్తే డెంగ్యూ పరీక్షకు రూ.800 నుంచి రూ.1200, మలేరియా, టైఫాయిడ్‌ పరీక్షకు రూ.300 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. మిగిలిన పరీక్షలకు మరో రూ.వెయ్యి అవుతోంది. మొత్తంగా సుమారు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మందులు, ఇతర ఖర్చులకు మరో రూ.5 వేలు పెట్టాల్సిందే. ఇక ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తున్న వారికైతే ఈ ఖర్చు మరో ఐదారు రెట్లు, అంతకంటే అధికంగానే అవుతోంది.  


బ్లడ్‌ బ్యాంకుల చుట్టూ.. 

 జ్వరం బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో ఎక్కువమందికి ప్లేట్‌లెట్స్‌ అవసరమని వైద్యులు చెబుతున్నారు. దీంతో రోగుల బంధువులు బ్లడ్‌ బ్యాంకులు చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోంది. గత పదిరోజుల్లో ప్లేట్‌లెట్స్‌ కోసం బ్లడ్‌ బ్యాంకులకు వస్తున్న వారి సంఖ్య 50 శాతం మేర పెరిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. నగర పరిధిలో 15కుపైగా బ్లడ్‌ బ్యాంకులున్నాయి. సాధారణ రోజుల్లో రక్తం కోసం ఎక్కువగా వస్తుంటారు. గత పది రోజులుగా కేవలం ప్లేట్‌లెట్స్‌ కోసం ఒక్కో బ్లడ్‌ బ్యాంకు సుమారు 30 మంది వరకు వస్తున్నారని చెబుతున్నారు.  డెంగ్యూ సోకిన వ్యక్తికి ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోతే కనీసం మూడు నుంచి నాలుగు యూనిట్లు ఎక్కించాల్సి వస్తుంది. ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.10 వేల వరకు పలుకుతోంది.


ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 20 వేలకు తగ్గితేనే..  

 సాధారణంగా డెంగ్యూ బాధితుల్లో 20 వేల కంటే ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గినప్పుడు మాత్రమే వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. అయితే, లక్ష కంటే తగ్గినప్పటి నుంచి రోగి బంధువులను ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు గురి చేస్తుండడంతో వారు బ్లడ్‌బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వీటి కౌంట్‌ తగ్గుదల ప్రారంభమైన మూడో రోజుల తరువాత నుంచి ఇచ్చే యాంటీబయాటిక్స్‌, ఇతర మందుల వల్ల ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పెరుగుతాయి. అప్పటికీ పెరగకుండా 20 వేల కంటే తక్కువకు పడిపోయినప్పుడు మాత్రమే ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించాల్సి ఉంటుంది. కొందరిలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య బాగానే ఉన్నప్పటికీ.. అంతర్గత అవయవాల్తో రక్తస్రావం జరిగితే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అంతవరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.

Read more