పథకాల అమలులో జాప్యాన్ని సహించను

ABN , First Publish Date - 2022-09-13T05:49:52+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించే విషయంలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని జోనల్‌ కమిషనర్‌ పొందూరు సింహాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు.

పథకాల అమలులో జాప్యాన్ని సహించను
‘స్పందన’లో జెడ్సీతో మాట్లాడుతున్న బాధితులు

గాజువాక జోనల్‌ కమిషనర్‌ సింహాచలం

గాజువాక, సెప్టెంబరు 12: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించే విషయంలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని జోనల్‌ కమిషనర్‌ పొందూరు సింహాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల మంజూరు విషయంలో ప్రజలను పదే పదే సచివాలయం చుట్టూ తిప్పించికోవడం సమంజసం కాదన్నారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఓ దివ్యాంగురాలు తనకు పింఛన్‌ మంజూరు నిమిత్తం సచివాలయ సిబ్బంది తిప్పించుకుంటున్నారే తప్పా పని పూర్తి చేయడం లేదని జెడ్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నేరుగా సంబంధిత సచివాలయ వెల్ఫేర్‌ సెక్రటరీకి ఫోన్‌ చేసి దివ్యాంగురాలి పింఛన్‌ గురించి ఆరా తీశారు. దీనికి సెక్రటరీ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆయనను మందలించారు. తక్షణమే ఆమె సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

‘స్పందన’కు 48 వినతులు

గాజువాక జోనల్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 48 వినతులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించి 24 ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు అర్జీలు సమర్పించారు. రోడ్లను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టడం, వీధి లైట్లు వెలగడం లేదని, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, తదితర సమస్యలపై వినతులు అందించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులకు జోనల్‌ కమిషనర్‌ సూచించారు. 


Updated Date - 2022-09-13T05:49:52+05:30 IST