డీసీసీబీ డైరెక్టర్‌ అంకంరెడ్డి జమీలు కన్నుమూత

ABN , First Publish Date - 2022-09-08T06:48:16+05:30 IST

: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్‌, నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అంకంరెడ్డి జమీలు కన్నుమూశారు.

డీసీసీబీ డైరెక్టర్‌ అంకంరెడ్డి జమీలు కన్నుమూత
అంకంరెడ్డి జమీలు (ఫైల్‌ ఫొటో)

నాలుగు రోజుల క్రితం బ్రెయిన్‌ స్రోక్‌

విశాఖలో చికిత్స పొందుతూ మృతి

నేడు నాతవరంలో అంత్యక్రియలు


నాతవరం, సెప్టెంబరు 7: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్‌, నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అంకంరెడ్డి జమీలు కన్నుమూశారు. ఆదివారం  ఆయనకు బ్రెయిన్‌స్ర్టోక్‌ రావడంతో విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య పార్వతి, కుమారుడు యశ్వంత్‌, కుమార్తె డాక్టర్‌ సౌమ్య వున్నారు. కుమారుడు ప్రస్తుతం అమెరికాలో వున్నారు. ఆయన ఇప్పటికే ఇండియాకు బయలుదేరారని, గురువారం ఉదయానికి ఇక్కడకు చేరుకుంటారని కుటుంబ సభ్యులు తెలిపారు. జమీలు భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం గురువారం మధ్యాహ్నం వరకు నాతవరంలో వుంచుతామని, తరువాత   వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా జమీలు మృతిచెందినట్టు తెలియడంతో   నాతవరంలో అన్ని వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. 

కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన అంకంరెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ జమీలు నర్సీపట్నం నియోజకవర్గంలో కీలక నేతగా ప్రత్యేక స్థానం పొందారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థుల పరిశీలన జాబితాలో  ఆయన పేరు కూడా వుంది. కాంగ్రెస్‌ హయంలో నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరారు. గత ఏడాది డీసీసీబీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.  


Read more