మార్కెట్‌లో దసరా జోష్‌

ABN , First Publish Date - 2022-10-05T06:39:11+05:30 IST

విజయ దశమి సందర్భంగా ఈ ఏడాది నగరంలో వాహనాలు, ఎలక్ర్టానిక్స్‌, గృహోపకరణాలు, సెల్‌ఫోన్ల విక్రయాలు భారీగా జరిగాయి.

మార్కెట్‌లో దసరా జోష్‌

నగరంలో భారీగా ద్విచక్ర వాహనాలు, కార్లు విక్రయాలు

షోరూములకు బారులుతీరిన వినియోగదారులు

కిటకిటలాడిన ఎలక్ర్టానిక్స్‌, గృహోపకరణాలు విక్రయించే షోరూమ్‌లు

రూ.100 కోట్ల సెల్‌ఫోన్లు అమ్మకం

మూఢం లేకపోతే విక్రయాలు మరింత పెరిగేవంటున్న వ్యాపారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విజయ దశమి సందర్భంగా ఈ ఏడాది నగరంలో వాహనాలు, ఎలక్ర్టానిక్స్‌, గృహోపకరణాలు, సెల్‌ఫోన్ల విక్రయాలు భారీగా జరిగాయి. కార్లు, ద్విచక్ర వాహనాల షోరూమ్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు విక్రయించే షోరూమ్‌లు, సెల్‌ఫోన్‌ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కరోనా కారణంగా వరుసగా రెండేళ్లు వ్యాపారాలు లేవు. ఈ ఏడాది అమ్మకాలు పుంజుకోవడంతో వ్యాపారులు సంతోషంగా ఉన్నారు.

వాహన విక్రయాలు సాధారణ రోజులతో పోల్చితే దసరా నవరాత్రుల సమయంలో చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లు కొనుగోళ్లు కూడా బాగుంటాయి. అయితే కరోనాతో గత రెండేళ్లుగా మార్కెట్లలో సందడి కనిపించలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోవడంతో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరగడంతో ఈ ఏడాది దసరా సందర్భంగా కొత్తవాహనాలు, వస్తువుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. దసరా సందర్భంగా నగర పరిధిలో దాదాపు రూ.300 కోట్ల విలువైన మూడు వేల వరకూ కార్లు అమ్ముడైనట్టు అంచనా వేస్తున్నామని ప్రముఖ ఆటోమొబైల్‌ షోరూమ్‌ ఉద్యోగి ఒకరు వివరించారు. నాలుగైదేళ్ల కిందట సీజన్‌తో పోల్చితే ఇది తక్కువే అయినప్పటికీ గత రెండేళ్ల కంటే చాలా నయమన్నారు. అలాగే నగరంలో ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా భారీగానే జరిగాయి. నగరంలో పండుగను పురస్కరించుకుని రూ.వంద కోట్లు విలువ చేసే 7,500 నుంచి ఎనిమిది వేల ద్విచక్ర వాహనాలు అమ్ముడై వుంటాయని ఆటోమొబైల్‌ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది దసరా పండుగ నెలా ప్రారంభంలో రావడం, మూఢం ఎఫెక్ట్‌ వుండడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడం వల్ల ఆశించిన దానికంటే 15 శాతం విక్రయాలు తగ్గినట్టు ఒక వ్యాపారి వివరించారు. ఇవేవీ లేకపోతే ఈ ఏడాది రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగి వుండేవని అభిప్రాయం వ్యక్తంచేశారు. 

సెల్‌ఫోన్ల మార్కెట్‌లో కూడా దసరా జోష్‌ కనిపించింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు కొంతమంది మొగ్గు చూపుతున్నప్పటికీ సాధారణ దుకాణాల్లో జరిగే వ్యాపారం కూడా ఏమాత్రం తగ్గలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఆఫర్లను ప్రకటించడంతో  సాధారణ దుకాణాలకు వ్యాపారం తగ్గుతుందని అంతా భావించారు. అయితే సాధారణ దుకాణాల్లో కూడా ఎప్పటిలాగే నవరాత్రుల సీజన్‌లో రూ.వంద కోట్ల వరకూ సెల్‌ఫోన్లు విక్రయించామని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక టీవీలు,  రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు వంటి ఎలక్ర్టానిక్స్‌, గృహోపకరణాలు విక్రయించే షోరూమ్‌లలో కూడా సందడి భారీగానే కనిపించింది. టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌ వంటి వస్తువులను ఆన్‌లైన్‌లో కంటే షోరూమ్‌కు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతుంటారు. దీనివల్ల నగరంలోని ఎలక్ర్టానిక్స్‌ దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. స్ర్కాచ్‌ కార్డు, ఈఎంఐ, గోల్డ్‌కాయిన్‌ వంటి ఆఫర్లను ప్రకటించడం కొనుగోలుదారులను మరింత ఆకర్షించినట్టయింది. దసరా సందర్భంగా నగరంలో రూ.120 కోట్ల విలువైన ఎలక్ర్టానిక్స్‌ అమ్ముడైనట్టు వ్యాపారులు అంచనా వేస్తుండడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Read more