దసపల్లా భూములపై వైసీపీ మల్లగుల్లాలు

ABN , First Publish Date - 2022-10-08T06:33:42+05:30 IST

దసపల్లా భూముల వివాదం నుంచి ఎలా బయటపడాలా?...అని ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.

దసపల్లా భూములపై వైసీపీ మల్లగుల్లాలు

రాజకీయంగా నష్టం జరగకుండా చూడాలని పెద్దల ఆదేశం

సీఎం రిపోర్ట్‌ కోరినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం

వాటాల వివరాలు సేకరిస్తున్న నేతలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దసపల్లా భూముల వివాదం నుంచి ఎలా బయటపడాలా?...అని ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. విశాఖపట్నం నగరంలో వేలాది ఎకరాలు 22-ఏ జాబితాలో ఉండగా, ప్రత్యేకంగా దసపల్లా భూములను ఆ జాబితా నుంచి తప్పించడానికి ఉత్తర్వులు జారీచేయడం వివాదాస్పదం కావడం, ప్రజాందోళన వ్యక్తమవుతుండడంతో రాజకీయంగా నష్టం లేకుండా చూడాలని యోచినట్టు తెలిసింది. ఈ భూ వ్యవహారంలో వైసీపీకి చెందిన ఒక నాయకుడికి వాటా ఉందని, ఆయన కుటుంబ సభ్యుల ఖాతా నుంచే నిధుల బదిలీ జరిగిందని జనసేన నాయకులు ఆరోపించడంతో పార్టీ పెద్దలు అది ఎంతవరకు వాస్తవం అనే దానిపై కూపీ లాగుతున్నారు. పార్టీ అధినేత, సీఎం జగన్‌...ఈ అంశంపై ‘గ్రౌండ్‌ రిపోర్ట్‌’ కావాలని ఇక్కడి పార్టీ బాధ్యులను కోరినట్టు చెబుతున్నారు. దసపల్లా భూములకు సంబంధించి 65 మందితో డెవలప్‌మెంట్‌ ఒప్పందం చేసుకున్న ‘ఎస్యూర్డ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌’ భాగస్వాముల లెక్క కూడా తేల్చే పనిలో పార్టీ పెద్దలు నిమగ్నమయ్యారు. భూములు ఇచ్చిన వారికి 29 శాతం మించకుండా వాటా ఇచ్చినందున, మిగిలిన 71 శాతంలో ఎవరెవరికి ఎంతెంత వాటా ఉందో...ఆ లెక్కలు ఇవ్వాలని ఆ ఇద్దరు వ్యాపారులను అడుగుతున్నట్టు సమాచారం. దాంతో వారు అసలు విషయం చెప్పాలా? వద్దా? అని తేల్చుకోలేకపోతున్నట్టు తెలిసింది.  దీనికి సంబంధించిన వార్తలు పత్రికల్లో రావడంతో...అవి ప్రైవేటు భూములేనని, కోర్టు తీర్పును మాత్రమే తాము అమలు చేస్తున్నామని చెప్పి తప్పించుకోవడానికి తొలుత యత్నించారు. అందుకోసం అటు డెవలపర్స్‌తోను, మరుసటిరోజు ఒప్పందం చేసుకున్న వారితోనే ఖండనలు ఇప్పించారు. చివరికి ఆ నాయకుడు కూడా తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ఖండించారు. ‘కోర్టు తీర్పు అమలు చేయవద్దని చెబుతున్నారా?’ అంటూ పత్రికలపై కూడా నిందలు వేసే ప్రయత్నం చేశారు. ఇలా రోజుకో ఖండనతో ఆ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారంటూ పార్టీలో గుసగుసలు మొదలుకావడంతో వాటికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పెట్టారు.


కలెక్టర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

ఇదిలావుండగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై నిర్ణయం తీసుకోవలసిన కలెక్టర్‌ను కూడా వారే సెలవుపై పంపారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ కేసు ఇంత పెద్ద చర్చకు దారితీసిన తరువాత స్వయంగా సీఎం చెబితే తప్ప కలెక్టర్‌ నిర్ణయం తీసుకోలేరని అధికార వర్గాలు అంటున్నాయి. సొంత జిల్లా కడపకు సెలవుపై వెళ్లిన కలెక్టర్‌ అటు నుంచి అటు అమరావతికి వెళ్లి సీఎంను కలిసి...తగిన సూచనలు తీసుకొని వస్తారని సమాచారం. నిబంధనల ప్రకారమైతే ఆయన రాగానే యూఎల్‌సీ చట్టం ప్రకారం ఆ భూములను కాపాడే ప్రయత్నం ప్రారంభించాలి. అలాగే పాత ఫైళ్లను మరోసారి పరిశీలించి, అవసరమైతే మళ్లీ కోర్టులో కేసు వేయాలి. గతంలో పనిచేసిన కలెక్టర్లంతా ఆ విధంగానే చేసుకుంటూ వచ్చారు. ఆయన కూడా అలాగే చేస్తారని విశాఖ ప్రజలు భావిస్తున్నారు.

Read more