విజన్‌ డ్రగ్స్‌లో ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-16T02:35:41+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం పంచాయతీ కొండగూడెం పరిధిలోని విజన్‌ డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కెమికల్‌ కాలమ్‌ బ్లాస్ట్‌ కావడంతో ముగ్గురు మృతిచెందారు....

విజన్‌ డ్రగ్స్‌లో ప్రమాదం

లీకేజీ కారణంగా పగిలిన కెమికల్‌ కాలమ్‌

ముగ్గురు ఉద్యోగులు మృతి

దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఘటన

దేవరపల్లి/కొవ్వూరు, నవంబరు 15: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం పంచాయతీ కొండగూడెం పరిధిలోని విజన్‌ డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కెమికల్‌ కాలమ్‌ బ్లాస్ట్‌ కావడంతో ముగ్గురు మృతిచెందారు. ఫ్యాక్టరీలో కెమికల్‌ లీకేజీ కావడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు కెమికల్‌ కాలమ్‌ పగిలిపోయింది. ఈ ప్రమాదంలో చాగల్లు గ్రామానికి చెందిన డిప్యూటీ మేనేజర్‌ దొంగ మహిధర్‌ ముసలయ్య (35), గౌరీపట్నం గ్రామానికి చెందిన కెమిస్టు ఏ.వీ.వీ.సత్యనారాయణ (46), త్యాజంపూడికి చెందిన షిఫ్ట్‌ ఇన్‌చార్జి వై.రత్నబాబు (35) మృత్యువాత పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను హోంమంత్రి తానేటి వనిత, జిల్లా ఎస్పీ సీహెచ్‌.సుధీర్‌కుమార్‌ రెడ్డి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌.శ్రీధర్‌ సందర్శించారు. జేసీ శ్రీధర్‌ ప్రమాద ఘటనను మంత్రికి వివరించారు.

ఫ్యాక్టరీ సాయమే..ప్రభుత్వ సాయం లేదు: మంత్రి

‘‘ఈ సంఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం కింద రూ.20 లక్షలు, మట్టి ఖర్చులకు రూ.2.5 లక్షలు, ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన ఇతర రాయితీలు రూ.6.5 లక్షలు కలిపి ఒక్కొక్క కుటుంబానికి రూ.29 లక్షలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఏం సహాయం అందజేస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. మృతులు ఫ్యాక్టరీ ఉద్యోగులు కావడం వల్ల యాజమాన్యం చేసిన తప్పిదానికి ప్రభుత్వం తరపున యాజమాన్యంతో చర్చించి నష్టపరిహారం ఇప్పిస్తున్నామన్నారు. మృతుల కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.

Updated Date - 2022-11-16T02:35:57+05:30 IST

Read more