వాన నీటిలో దళిత కాలనీలు

ABN , First Publish Date - 2022-10-11T06:42:01+05:30 IST

గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కరుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పగలు, రాత్రిళ్లు అన్న తేడాలేకుండా ముసురు వాతావరణం నెలకొనగా, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

వాన నీటిలో దళిత కాలనీలు
దుర్గా కాలనీలో ఇళ్లమధ్య నిలిచిన వర్షపు నీరు

 గతరం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం

 లోతట్టు ప్రాంతాల్లో భారీగా నిలిచిన నీరు

 రోడ్లు గోతులమయంగా మారడంతో వాహనచోదకులకు అవస్థలు 

 ‘పేట’ పట్టణంలో జల దిగ్బంధంలో దళిత కాలనీలు

వర్షాకాలంలో తరచూ ఇదే సమస్య ఉన్నా.. పట్టించుకోని అధికారులు 

పాయకరావుపేట, అక్టోబరు 10 : గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కరుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పగలు, రాత్రిళ్లు అన్న తేడాలేకుండా ముసురు వాతావరణం నెలకొనగా, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా పాయకరావుపేట పట్టణంలో సోమవారం పడిన వర్షానికి పలు దళిత కాలనీల్లోకి నీరు భారీగా చేరింది. రైల్వే పట్టాల అవతల ఉన్న కాలనీల్లో చేరిన నీరు 24 గంటలుగా బయటకుపోయే మార్గంలేక ఇళ్ల మధ్యలో నిలిచిపోయింది. దీంతో నివాసితులు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. అలాగే, పట్టణంలోని మెయిన్‌ రోడ్డును ఆనుకుని ఉన్న కంటోన్మెంట్‌ ఏరియాలోని వీధుల్లో వర్షపునీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి. కొండల నుంచి కిందికి వస్తున్ననీరు గెడ్డ కాలువల్లో పేరుకుపోయిన పూడిక కారణంగా ముందుకు ప్రవ హించే వీలులేక దుర్గాకాలనీ, అంబేడ్కర్‌, రాజీవ్‌నగర్‌ కాలనీల్లో నిలిచిపోయింది. గత్యంతరం లేక ఆ నీటిలోనుంచే నివాసితులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వీరంతా పేదలు కావడంతో ఇంట్లో కనీసం వంట చేసుకునే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడితే పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తాయనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇళ్ల మధ్య నిలిచిన వర్షపు నీరు బయటకు పోయేలా చర్యలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు. ఇదిలావుంటే,  దుర్గాకాలనీలో నీరు నిలిచిపోవడంతో వంట చేసుకోలేని పలు పేదలకు వైసీపీ నాయకులు జగతా శ్రీను ఆధ్వర్యంలో పలు వురు వార్డు సభ్యులు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎన్‌ మూర్తి, దాసరి శ్రీను, తాటిపాక లోవరాజు, ముక్కుడుపల్లి దాసు తదితరులు పాల్గొన్నారు.


Read more