నగరం...నేరమయం

ABN , First Publish Date - 2022-05-30T06:24:11+05:30 IST

ప్రశాంత నగరంలో ఇటీవల వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

నగరం...నేరమయం

ఇటీవల పెరుగుతున్న హత్యలు!

రెండునెలల్లోనే ఏడుగురు బలి

బాధితులు, నిందితులూ రౌడీషీటర్లే

పోలీసుల నిఘా కొరవడడమే కారణమని విమర్శలు


 (విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)


ప్రశాంత నగరంలో ఇటీవల వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సంస్కృతి పెరిగిపోతుండడం పోలీసుశాఖను విస్మయానికి గురిచేస్తోంది. గత రెండు నెలల్లోనే ఏడు హత్యలు జరిగినట్టు పోలీసులే చెబుతున్నారు. రౌడీషీటర్లు, తరచూ కొట్లాటలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారి పట్ల పోలీసు నిఘా లోపించడం, వారి పట్ల ఉన్నతాధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తుండడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పోలీస్‌ శాఖ సిబ్బందే అభిప్రాయపడుతున్నారు.

నగరంలో జరిగిన ఇటీవల సంఘటనల్లో హత్యకు గురైనవారిలోను, మరికొన్ని కేసుల్లో హత్యకు పాల్పడినవారిలో రౌడీషీటర్లే నిందితులు. రౌడీషీట్‌ తెరిచినా భయపడకుండా వారు రెచ్చిపోతున్న తీరు ఈ సంఘటనకు నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా నిందితుల వ్యవహారశైలి, వివిధ ఘటనల్లో వారి పాత్ర ఆధారంగా పోలీసులు వారిపై రౌడీషీట్‌ తెరుస్తారు. అప్పటి నుంచి వారి కదలికలపైనా నిఘా పెడుతుంటారు. అయితే వరుస సంఘటనల నేపథ్యంలో రౌడీషీటర్లపై నిఘా కొరవడుతోందనే వాదన వినిపిస్తోంది. 


పెరుగుతున్న హత్యా సంస్కృతి 

నగర కమిషనరేట్‌ పరిధిలో ఏటా దాదాపుగా 25 హత్య కేసులు నమోదవుతుంటాయి. కొద్దికాలంగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ రెండు నెలల్లోనే ఏడు హత్యలు జరిగాయని పోలీసులే పేర్కొంటున్నారు. ఈనెల 26న మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌లో బాక్సర్‌ సాయితేజను అతని ప్రత్యర్థి వర్గీయులే హత్య చేశారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు నమోదవడం, అవి కాస్తసోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం తెలిసిందే. నిందితులు కిరాతకంగా నరికి చంపడం వారి మానసిక స్థితికి అద్దం పట్టింది. అలాగే రైల్వేన్యూకాలనీకి చెందిన రికవరీ ఏజెంట్‌ రఘుపాత్రుని రాజశేఖర్‌ను ఈనెల 16న అతని స్నేహితుడు, మరో ఇద్దరితో కలిసి ఏయూ విద్యాహాస్టల్‌ వద్ద దారుణంగా హత్యచేశాడు.

డాబాగార్డెన్స్‌లోని జీవీఎంసీ పార్కు ఆరిలోవకు చెందిన మేరంగి సందీప్‌ అనే ఆటోడ్రైవర్‌ను వన్‌టౌన్‌కు చెందిన ముగ్గురు యువకులు కలిసి మార్చి ఆరున హత్య చేశారు. వన్‌టౌన్‌లో పదో తరగతి విద్యార్థిపై దండుపాళ్యం గ్యాంగ్‌ సభ్యులు కత్తులతో హత్య చేసేందుకు యత్నించగా విద్యార్థి గాయాలతో పరుగులు తీసి తప్పించుకున్నాడు. అదే రోజు కొబ్బరితోటలో ఒక వ్యక్తిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. ఇలా రెండు నెలల్లో నగరంలో హత్యలు, హత్యాయత్నాలు సగటున వారానికి ఒకటి, రెండు చొప్పున నమోదయ్యాయి.


చెలరేగిపోతున్న రౌడీషీటర్లు

ఇటీవల నగరంలో రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారు. గతంలో పోలీసుల నిఘా, చిన్నపాటి వివాదం జోలికి వెళ్లినా కఠినమైన సెక్షన్లతో కేసులు పెట్టి పీడీయాక్ట్‌, నగర బహిష్కరణ, ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద జైలుకి పంపేస్తారనే భయం వుండేది.  కొంతకాలంగా పోలీసు నిఘా తగ్గింది. దీంతో రెచ్చిపోతున్నారు. ఆటోలు, బైక్‌లపై కత్తులు, రాడ్లు పట్టుకుని  తిరుగుతున్నారు. ఎవరైనా ఎదురుచెప్పినా, ప్రశ్నించినా విచక్షణరహితంగా దాడులకు దిగుతున్నారు. దొండపర్తి కూడలివద్ద పట్టపగలు రూపేష్‌ అనే రౌడీషీటర్‌ నలుగురిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అతడిపై తొలత స్వల్ప తీవ్రత ఉండే కేసు నమోదుచేసి, కొంతమంది అభ్యంతరంతో హత్యాయత్నం కేసుగా మార్చారని పోలీస్‌శాఖలో ప్రచారం జరిగింది. వన్‌టౌన్‌ రెల్లివీధిలో పట్టపగలు ఒక యువకుడిని కొంతమంది కత్తులు, రాడ్లతో వెంటాడగా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నాడు. పోర్టురోడ్డులో బైక్‌పై వెళుతున్న ఒక కాంట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు వెనుకనుంచి బైక్‌పై వచ్చి వీపులో కత్తితో పొడిచి హత్యాయత్నం చేశారు. బాధితుడు భయంతో బైక్‌ను ఆపకుండా, వెన్నులో కత్తితోనే కేజీహెచ్‌కు చేరడం చర్చనీయాంశమైంది. 


నేరాలు పెరగడానికి కారణాలివి 

 గతంతో పోల్చితే నగరంలో పోలీసు నిఘా, పెట్రోలింగ్‌  మొక్కుబడిగా సాగుతోంది.

ముఖ్యంగా రౌడీషీటర్లపై  నిఘా కొరవడింది. ప్రతి ఆదివారం మొక్కుబడిగా స్టేషన్‌కు పిలిచి, కౌన్సెలింగ్‌ చేసి పంపించేస్తున్నారు. వారి కదలికలు, వారం రోజుల్లో ఏం చేశాడు, ఎవరెవర్ని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడనేదానిపై లోతుగా ఆరా తీయడం లేదు.

 ఒకసారి హత్యాయత్నం, దోపిడీ లేదా కొట్లాటకు దిగేవారిపై రౌడీషీట్‌ తెరవకుండా హెచ్చరికతో వదిలేస్తున్నారు.

రౌడీషీట్‌ ఉన్న వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు వస్తే, స్టేషన్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. 

వివిధ కేసుల్లో నిందితులు, వారి కుటుంబసభ్యులు, స్నేహితుల వివరాలను సేకరించి వారి వాహనాలను  తనిఖీ చేయడం లేదు. 

రౌడీషీటర్ల విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంభిస్తున్నారనే అభిప్రాయం నగరవాసుల్లో ఉంది. మర్రిపాలెంలో రెండు రోజుల కిందట హత్యకు గురైన సాయితేజ గతంలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ అతడిపై రౌడీ షీట్‌ తెరవలేదంటున్నారు.

 రౌడీషీటర్లను అరెస్టు చేస్తే వారి బంధువులు స్టేషన్‌పైకి, పోలీస్‌వాహనాలపైకి రాళ్లతో దాడికి దిగుతున్నారు. అయినా  వారిపై కేసులు నమోదుచేయకుండా కౌన్సెలింగ్‌ చేసి పంపేయడంతో వారిలో భయం పోయిందంటున్నారు. 

Updated Date - 2022-05-30T06:24:11+05:30 IST