కోర్టు ఆదేశాలు బేఖాతరు

ABN , First Publish Date - 2022-10-04T06:24:31+05:30 IST

నీరు-చెట్టు పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు విషయంలో కోర్టు తీర్పులను అధికారులు పట్టించుకోవడంలేదు.

కోర్టు ఆదేశాలు బేఖాతరు
చీడికాడ మండలం ఎల్‌ఎన్‌పురంలో నీటితో నిండుగా వున్న కత్తులబంద చెరువు తనిఖీకి వెళ్లిన ఇంజనీర్ల బృందం (ఫైల్‌ ఫొటో)

నీరు-చెట్టు పనులకు బిల్లులు చెల్లింపులో అధికారులు మీనమేషాలు

కోర్టుధిక్కారం కింద కేసులు వేస్తున్న నీటిసంఘాల మాజీ సభ్యులు

బిల్లులో కోత లేకుండా వడ్డీ కలిపి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశం

అయినా పనుల్లో లోపాల పేరుతో అధికారులు కోత

ఉమ్మడి జిల్లాలో రూ.44.5 కోట్లతో 715 పనులు 

ఇంతవరకు కోనాం ప్రాజెక్టులో రూ.30 లక్షలకు రూ.1.2 లక్షలు మాత్రమే చెల్లింపు



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నీరు-చెట్టు పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు విషయంలో కోర్టు తీర్పులను అధికారులు పట్టించుకోవడంలేదు. న్యాయస్థానంలో ఒకలా చెబుతూ... తరువాత మరోలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు తీర్పును అమలు చేయడంలేదంటూ ఆయా పనులు చేపట్టిన నీటిసంఘాల మాజీ సభ్యులు, చైర్మన్లు కోర్టుధిక్కార పిటిషన్లు వేస్తున్నారు. దీంతో న్యాయమూర్తుల ఆదేశాల మేరకు కోర్టుకు హాజరవుతున్న అధికారులు... నీరు-చెట్టు బిల్లులు చెల్లిస్తామని  చెబుతున్నారు. కానీ పనులు చేపట్టిన వారికి డబ్బులు చెల్లించడంలేదు. దీంతో మళ్లీ కోర్టు ధిక్కార పిటిషన్‌ వేయాల్సి వస్తున్నదని నీటి సంఘాల మాజీ సభ్యులు, చైర్మన్లు వాపోతున్నారు. 

తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు నీరు-చెట్టు పథకం కింద జల వనరుల శాఖ పరిధిలో చెరువులు, గెడ్డల్లో పూడికతీత, గట్లు పటిష్టం, చిన్నపాటి సిమెంట్‌ పనులు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ పథకం కింద 2017 నుంచి 2018 వరకు 715 పనులు జరిగాయి. వీటిని నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులు, డైరెక్టర్లు, సభ్యులు చేపట్టారు. ఇందుకోసం రూ.44.5 కోట్లు వెచ్చించారు. పూర్తిచేసిన పనులను అప్పట్లో క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తనిఖీ చేసి, ఎం.బుక్‌లో నమోదుచేసిన అనంతరం బిల్లుల క్లియరెన్స్‌ కోసం సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో బిల్లులు మంజూరుకాలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు నీరు-చెట్టు పనుల బిల్లులను పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆయా పనులు చేసిన నీటి సంఘాల ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బిల్లుల చెల్లింపునకు కొంత గడువు కోరిన ప్రభుత్వం, నీరు-చెట్టు పనుల తనిఖీలకు జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే జల వనరుల శాఖ కాకుండా ఇతర ఇంజనీరింగ్‌ శాఖల అధికారులతో తనిఖీలు చేయించాలని స్పష్టం చేసింది. జిల్లాలో నీరు-చెట్టు కింద చేసినపనుల తనిఖీలకు గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల ఇంజనీర్లతో పది బృందాలను నియమించారు. ఈ బృందాలు మండలాల వారీగా పనులను తనిఖీ చేయడానికి గత డిసెంబరులో శ్రీకారం చుట్టాయి. అయితే డిసెంబరు తొలి వారం వరకు వర్షాలు కురవడంతో అనేక చెరువుల్లో మార్చి నెలలలో కూడా నిండుగా నీరు వుంది. మొత్తం మీద ఈ ఏడాది ఆగస్టు వరకు ఉమ్మడి జిల్లాలో 300 పనులను తనిఖీ చేసిన ఇంజనీరింగ్‌ బృందాలు మిగిలిన చోట్ల నీరు ఉందని పేర్కొంటూ తరువాత పరిశీలిస్తామని నివేదికలు ఇచ్చారు. తనిఖీ చేసిన 300 పనుల్లో 10 నుంచి 15 పనులు మాత్రమే నాణ్యతలేవంటూ రిమార్క్‌ రాశారు. మిగిలిన పనులు సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ ఈ పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. 

ఇదిలావుండగా కోనాం ప్రాజెక్టు కింద చేపట్టిన ఎనిమిది పనులకు రూ.30 లక్షలు చెల్లించాలని కోరుతూ అక్కడ ప్రాజెక్టు సంఘం ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు పిటిషన్‌ను పరిశీలించి, బిల్లుల సొమ్ములో ఎటువంటి కోత విధించకుండా ఎం.బుక్‌ నమోదైన రోజు నుంచి వడ్డీతో కలిపి తక్షణమే చెల్లించాలని నాలుగు నెలల క్రితం ఆదేశాలు ఇచ్చారు.   తరువాత ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడంతో బిల్లులు చెల్లించాలని పే అండ్‌ అకౌంట్స్‌ విభాగానికి జలవనరుల శాఖ సిఫారసు చేయగా, పనుల్లో లోపాలు ఉన్న మేరకు కోతలు విధిస్తామని అక్కడ అధికారులు తేల్చిచెప్పారు. చివరకు విసిగిపోయిన కాంట్రాక్టర్లు కోతలకు అంగీకరించగా, రూ.30 లక్షలకుగాను ఇప్పటి  వరకు రూ. 1.2 లక్షలు మాత్రమే అధికారులు చెల్లించారు.

ఉమ్మడి జిల్లాలో మరో మండలానికి సంబంధించి నీరు చెట్టు కింద  చేపట్టిన 17 పనులకు సంబంధించి రూ.1.3 కోట్లు బిల్లులు ఇవ్వాలని నీటి సంఘం ప్రతినిధులు కోర్టుకు వెళ్లగా... వెంటనే బిల్లులు ఇవ్వాలని రెండు నెలల క్రితమే తీర్పు వచ్చింది. అయినా అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో వీరంతా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో అధికారులు మెట్టు దిగారు. రూ.1.3 కోట్ల చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే పనులు చేపట్టిన వారి ఖాతాల్లోకి డబ్బులు జమ కావడానికి మరికొన్ని నెలలు పడుతుందని అంటున్నారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు చెల్లింపులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చినప్పటికీ, బిల్లుల్లో కోత వేయాలని పే అండ్‌ అకౌంట్స్‌ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించిందని కోనాం ప్రాజెక్టు మాజీ చైర్మన్‌ గండి ముసలినాయుడు ఆరోపించారు. కోర్టు నుంచి అనుమతి తీసుకువచ్చినా ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలేదని, దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.  

ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదు

నీరు-చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు బిల్లుల మంజూరులో జలవనరుల శాఖ ఇంజనీర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించినపుడు జలవనరులశాఖ కార్యదర్శి, చీఫ్‌ ఇంజనీరు నుంచి కిందిస్థాయి ఇంజనీరు వరకు హాజరవుతున్నారు. దీంతో వ్యక్తిగత హాజరు సమయంలో బిల్లులు చెల్లించాలని కోర్టు చెబుతున్నదని, కానీ ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని పలువురు ఇంజనీర్లు వాపోతున్నారు. దీనివల్ల కోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-10-04T06:24:31+05:30 IST