కార్పొరేటర్లు కొట్లాట!

ABN , First Publish Date - 2022-08-21T06:47:10+05:30 IST

ఉత్తర భారతదేశంలోని పలు కార్పొరేషన్‌లలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్లిన జీవీఎంసీ కార్పొరేటర్లలో కొందరు శుక్రవారం రాత్రి మనాలీలో రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నట్టు తెలిసింది.

కార్పొరేటర్లు కొట్లాట!
కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న మార్గంలో రోడ్డుపై వెళుతున్న వాహనంపై పడిన కొండచరియలు

మనాలీ హోటల్‌లో గొడవ

ఛండీగర్‌ ప్రయాణాన్ని నేటి ఉదయానికి వాయిదా వేయాల్సిందిగా కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు

విభేదించిన అదే పార్టీ సభ్యులు

రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు

...ఇదే సమయంలో యాత్ర కోసం డబ్బులు వసూలు చేసిసరైన సదుపాయాలు కల్పించలేదని ఆరోపించిన విపక్షాలకు చెందిన కార్పొరేటర్‌పై మూకుమ్మడిగా దాడికి యత్నం


విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):

ఉత్తర భారతదేశంలోని పలు కార్పొరేషన్‌లలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్లిన జీవీఎంసీ కార్పొరేటర్లలో కొందరు శుక్రవారం రాత్రి మనాలీలో రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...శుక్రవారం ఉదయం మనాలీ కార్పొరేషన్‌ను సందర్శించిన కార్పొరేటర్లు సాయంత్రం ఆరు గంటలకు తాము బస చేసిన హోటల్‌కు చేరుకున్నారు. కొంతమంది షాపింగ్‌ వెళ్లి తిరిగి ఎనిమిదిన్నరకు హోటల్‌కు తిరిగివచ్చారు. కార్పొరేటర్లు షెడ్యూల్‌ ప్రకారం రాత్రి పది గంటలకు మనాలీ నుంచి బస్సులో బయలుదేరి శనివారం ఉదయం చంఢీఘర్‌ చేరుకోవాలి. అక్కడ కార్పొరేషన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆ మేరకు రాత్రి పది గంటల సమయంలో కార్పొరేటర్లు హోటల్‌ ఖాళీ చేసి బస్సులు ఎక్కుతుండగా తమకు అలసటగా ఉందని కొంతమంది, వికారంగా ఉందని మరికొందరు, జ్వరం వచ్చిందంటూ ఇంకొందరు పేర్కొంటూ ఛండీఘర్‌ ప్రయాణాన్ని శనివారం ఉదయానికి వాయిదా వేయాలని కోరారు. అయితే ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ ప్రకారమే నడవాల్సి ఉంటుందని, ఎవరైనా ఒకవేళ వుండిపోతే వారి సొంత ఖర్చులతోనే చంఢీఘర్‌ రావాల్సి వుంటుందని ట్రావెల్‌ ఏజెంట్‌ స్పష్టంచేశారు. దీంతో టీడీపీ తరపున గెలిచి వైసీపీ పంచన చేరిన గాజువాక ప్రాంతానికి చెందిన కార్పొరేటర్‌ ఒకరు తాము ఉదయం వస్తామని, ఒక బస్సును తమకు వదిలేయాలంటూ గట్టిగా అరుస్తూ రచ్చ చేశారు. దీనికి తూర్పు నియోజవర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్‌ భర్త కలుగజేసుకుని శనివారం ఉదయం చంఢీఘర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు వెళ్లాల్సి ఉందన, ఇప్పుడు బయలుదేరబోమంటే ఎలా అని ఆయన్ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. గాజువాక ప్రాంతానికి చెందిన కార్పొరేటర్‌కు ముగ్గురు వత్తాసుగా వచ్చారు. ఆ సమయంలో దక్షిణ నియోజకవర్గ పరిధిలో కొన్నాళ్ల కిందట జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్‌ జోక్యం చేసుకుని అనవసరంగా గొడవ ఎందుకని సర్దిచెప్పేందుకు యత్నించగా...మల్కాపురం ప్రాంతానికి చెందిన కార్పొరేటర్‌ ఒకరు తీవ్ర ఆవేశంతో ఆయనపై చేయి చేసుకున్నారు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన అక్కడున్న వైసీపీ కార్పొరేటర్లు ఘర్షణ పడ్డారు. పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన విపక్ష కార్పొరేటర్‌ ఒకరు అదే సమయంలో యాత్ర కోసం భారీగా డబ్బులు వసూలుచేసినా సరైన సదుపాయాలు కల్పించలేదంటూ ఆరోపించడంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు ఆయనపై మూకుమ్మడిగా దాడికి యత్నించారు. చివరకు టీడీపీ కార్పొరేటర్లకు కేటాయించిన రెండు బస్సుల్లో ఒకదానిని శనివారం ఉదయం చంఢీఘర్‌ వస్తామన్న వారి కోసం వదిలేయాలని నిర్ణయించడంతో వారు అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ బస్సు తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబడడంతో లైజినింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న సన్నీ టీడీపీ కార్పొరేటర్ల బస్సును వారికి వదిలేసేందుకు అంగీకరించారు. చివరకు 15 మంది కార్పొరేటర్లు మినహా మిగిలిన వారంతా నాలుగు బస్సుల్లో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మనాలీ నుంచి బయలుదేరారు. మనాలీలో వుండిపోయిన 15 మంది కార్పొరేటర్‌లలో ఐదుగురు తమ సొంత ఖర్చుతో విమానంలో ఛండీఘర్‌ వెళ్లగా, మిగిలిన వారికి ట్రావెల్‌ ఏజెంట్‌ నాలుగు కార్లను సమకూర్చారు. 


మనాలిలో చిక్కుకున్న కార్పొరేటర్లు

కొండచరియలు విరిగి రోడ్డుపై పడడంతో నిలిచిపోయిన వాహనాలు


విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉత్తర భారతదేశంలోని పలు మునిసిపల్‌ కార్పొరేషన్లలో అమలుచేస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు వెళ్లిన మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కార్పొరేటర్లు కొద్దిగంటలు హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ వద్ద చిక్కుకుపోయారు. జీవీఎంసీ నుంచి సుమారు 70 మంది కార్పొరేటర్లు, మరో 30 మంది వరకూ వారి కుటుంబ సభ్యులు...ఢిల్లీ, ఆగ్రా, సిమ్లా, మనాలీ, చండీఘర్‌ కార్పొరేషన్లలో పర్యటనకు ఈనెల 16న ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం మనాలీలో పర్యటన ముగించుకుని చంఢీఘర్‌ వెళ్లేందుకు రాత్రి పది గంటలకు బస్సుల్లో బయలుదేరారు. తెల్లవారుజామున మూడు గంటలకు మండీ అనే ప్రాంతం వద్దకు వెళ్లేసరికి ఒక్కసారిగా కొండచరియలు విరిగి రోడ్డుపై వెళుతున్న ఒక వాహనంపై పడడంతో రెండు వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న నాలుగు బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఉదయం తొమ్మిది గంటల వరకూ రోడ్డు క్లియర్‌ కాకపోవడంతో మహిళా కార్పొరేటర్లు, చిన్నపిల్లలతో వెళ్లినవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసి మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషాలు రాష్ట్ర మంత్రులు సహాయంతో అక్కడి అధికారులతో మాట్లాడి సహాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఎట్టకేలకు కార్పొరేటర్ల వాహనాలు పది గంటల ప్రాంతంలో ముందుకు కదిలాయి.

Read more