ప్లానింగ్‌లో గందరగోళం

ABN , First Publish Date - 2022-12-13T01:22:33+05:30 IST

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఒక డీసీపీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. టౌన్‌ప్లానింగ్‌లో ముగ్గురు డీసీపీలు ఉండగా...ఒక్కరికే నాలుగు జోన్లు కేటాయించారు.

ప్లానింగ్‌లో గందరగోళం

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌లో ఒకే డీసీపీకి నాలుగు జోన్లు కేటాయింపు

అన్నీ అత్యంత కీలకమైనవే

పనుల్లో పురోగతి ఉండడం లేదనే విమర్శలు

మరో ఇద్దరు డీసీపీలకు రెండేసి జోన్లు కేటాయింపు

గతంలో ఉన్నట్టుగానే కొనసాగిస్తున్నామంటున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఒక డీసీపీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. టౌన్‌ప్లానింగ్‌లో ముగ్గురు డీసీపీలు ఉండగా...ఒక్కరికే నాలుగు జోన్లు కేటాయించారు. మిగిలిన ఇద్దరు డీసీపీలకు రెండేసి జోన్లు కేటాయించారు. నాలుగు జోన్లు బాధ్యతలు చూస్తున్న అధికారి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళితే మరుసటిరోజు పది గంటల వరకూ ఏమీ పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో సదరు అధికారి బాధ్యతల భారం తమపై పడుతోందని సహచర అధికారులు వాపోతుండగా, తమ పనులు సకాలంలో జరగడం లేదంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

జీవీఎంసీలో టౌన్‌ప్లానింగ్‌ విభాగం అత్యంత కీలకమైనది. నగరంలో భవన నిర్మాణాలకు అనుమతులు, రహదారుల విస్తరణకు సర్వే, టీడీఆర్‌లు జారీ, ప్రైవేటు స్థలాలకు సర్వే సర్టిఫికెట్లు మంజూరు వంటివన్నీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులే చేయాల్సి ఉంటుంది. అంతటి కీలకమైన టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో చీఫ్‌ సిటీప్లానర్‌ ఆధ్వర్యంలో ముగ్గురు డిప్యూటీ సిటీ ప్లానర్‌ (డీసీపీ)లు, ప్రతి జోన్‌ (ఎనిమిది జోన్లు ఉన్నాయి)కు ఒక అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ (ఏసీపీ) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో నలుగురు డీసీపీలు ఉండడంతో ఒక్కో డీసీపీకి రెండేసి జోన్‌ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆయా జోన్లలో భవన నిర్మాణాల అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఏసీపీ తర్వాత డీసీపీలు పరిశీలించి తదుపరి చీఫ్‌ సిటీప్లానర్‌కు పంపిస్తుంటారు. అలాగే భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్లు (ఓసీ)లు జారీ చేయాలన్నా, ప్రజావసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల స్థలం తీసుకున్నప్పుడు వారికి టీడీఆర్‌లు (ట్రాన్స్‌ఫర్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌) జారీ చేయాలన్నా సరే ఏసీపీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక తయారుచేసి డీసీపీలకు పంపిస్తే వారి స్థాయిలో మరోసారి పరిశీలించి చీఫ్‌ సిటీప్లానర్‌కు నివేదిస్తారు. అంతటి కీలకమైన డీసీపీ పోస్టు కోసం జీవీఎంసీలో బాగా పోటీ ఉంటుంది. కొన్నాళ్ల కిందట డీసీపీలుగా పనిచేసిన నలుగురిలో ఒకరు విజయవాడ బదిలీపై వెళ్లిపోవడంతో ఆమె చూసిన రెండు జోన్ల బాధ్యతలను అప్పట్లో చురుగ్గా పనిచేస్తారనే గుర్తింపు కలిగిన డి.రాంబాబుకు అదనంగా అప్పగించారు. కొద్దిరోజుల కిందట జరిగిన సాధారణ బదిలీల్లో రాంబాబుకు విజయవాడ బదిలీ కావడంతో ఆయన స్థానంలో మరొకరు వచ్చారు. రాంబాబు గతంలో చూసిన నాలుగు జోన్లను కొత్త అఽధికారికి అప్పగించారు. జోన్‌-1 (భీమిలి), జోన్‌-2 (మధురవాడ), జోన్‌-3 (ఆశీల్‌మెట్ట), జోన్‌-8 (పెందుర్తి) వంటి కీలకమైన జోన్లలో భవన నిర్మాణాలతోపాటు మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల విస్తరణ, విశాఖ-భోగాపురం బీచ్‌ కారిడార్‌ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. నగరంలో జరుగుతున్న నిర్మాణాల్లో సగం మధురవాడ, పెందుర్తి పరిసరాల్లోనే జరుగుతున్నాయి. అంతటి కీలకమైన జోన్లను చూస్తున్న అధికారి అంతే చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. రాత్రిపూట కూడా అధికారుల సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌లు, సిబ్బందిని నుంచి సమాచారం సేకరించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. తెల్లవారుజాము నుంచే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి నిర్మాణాల తీరుతెన్నులు, ఇతర విధులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఆయా జోన్లను చూస్తున్న డీసీపీ మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉద్యోగానికి సంబంధించిన విషయాలను పూర్తిగా పక్కన పెట్టేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరైనా ఏదైనా పనిమీద ఫోన్‌ చేస్తే ‘ఇప్పుడు చేశారేంటి. అంత అర్జంట్‌ ఏమొచ్చింది. రేపు ఉదయం కార్యాలయానికి వచ్చి మాట్లాడండి’ అని సమాధానం చెబుతున్నారు. దీనిపై సీసీపీతోపాటు జీవీఎంసీ కమిషనర్‌కు కూడా సమాచారం వున్నప్పటికీ ఎందుచేతనో పట్టించుకోవడం లేదని ఆ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక అధికారి ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపనిపక్షంలో ఉన్నతాధికారులు...వారికి బాధ్యతలను తగ్గించి, చురుగ్గా పనిచేసే వారికి అప్పగిస్తుంటారు. కానీ సదరు డీసీపీకి అధికార పార్టీలో కీలక నేతల అండదండలు ఉన్నాయని, అందువల్లే ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని మరికొందరు అధికారులు చెబుతున్నారు. సదరు డీసీపీకి సంబంధించిన జోన్లలో పనులు ఏవైనా పెండింగ్‌లో ఉంటే వాటిని మిగిలిన ఇద్దరు డీసీపీలకు అప్పగించేస్తున్నారని ఆ విభాగంలోని సిబ్బంది చెబుతున్నారు. ఇదిలావుంటే ఆయా జోన్లకు సంబంధించిన పనుల మీద వచ్చే ప్రజలు కూడా సదరు అధికారి సాయంత్రం ఆరు గంటల తర్వాత అందుబాటులో ఉండకపోవడం, రోజుల తరబడి తమ పనులకు అతీగతీలేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఈ విషయం...జీవీఎంసీ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా గతంలో పనిచేసిన రాంబాబు స్థానంలో పోస్టింగ్‌ తెచ్చుకోవడంతో ఆయన చూసిన జోన్లనే కొత్త అధికారికి అప్పగించామన్నారు. ఒకటి, రెండు నెలల్లో సదరు అధికారి తెలంగాణకు వెళ్లిపోతారు కాబట్టి సమస్య పరిష్కారమైపోతుందని చెప్పడం గమనార్హం.

Updated Date - 2022-12-13T01:22:33+05:30 IST

Read more