పరిజ్ఞానం పెంపునకు సదస్సులు దోహదం

ABN , First Publish Date - 2022-09-29T05:58:43+05:30 IST

అధునాతన బ్యాటరీల అభివృద్ధిపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సులు ఎంతగానో దోహదపడతాయని రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

పరిజ్ఞానం పెంపునకు సదస్సులు దోహదం
కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్‌ సతీశ్‌రెడ్డి

రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్‌ సతీశ్‌రెడ్డి 

గోపాలపట్నం, సెప్టెంబరు 28: అధునాతన బ్యాటరీల అభివృద్ధిపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సులు ఎంతగానో దోహదపడతాయని రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎన్‌ఎస్‌టీఎల్‌లో ఎలకో్ట్ర కెమికల్‌ ఎనర్జీ కన్వర్షన్‌ అండ్‌ స్టోరేజ్‌ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశోధకులు, విద్యావేత్తలు, పారిశ్రామిక భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామన్నారు. ప్రస్తుత కాలంలో ఎలకో్ట్ర కెమికల్‌ ఎనర్జీ వాహనాల అభివృద్ధి వల్ల దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతుందన్నారు. నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ క్షిపణులు, టార్పిడోలు, జలాంతర్గాముల్లో అధిక శక్తి గల బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఇటువంటి బ్యాటరీల వినియోగంతో ఎలక్ట్రిక్‌ వాహనాలు మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉందన్నారు. ఎన్‌ఎస్‌టీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పర్యావరణ అనుకూల ఇంధన వనరుల ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడానికి ఎలకో్ట్ర కెమికల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ల రూపకల్పన, అభివృద్ధిపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. గత ఐదు దశాబ్దాలుగా శక్తి నిల్వల పరికరాలను అభివృద్ధి చేయడంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ గణనీయమైన సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఐఐఎస్‌ఈఆర్‌ (తిరుపతి) ప్రొఫెసర్‌ విజయమోహనసన్‌ కె పిళ్లై బ్యాటరీల సమస్యలు, ఎదుక్కొంటున్న సవాళ్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నేవల్‌ అండ్‌ ఆర్మ్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (న్యూఢిల్లీ) కేఎస్‌సీ అయ్యర్‌, సీనియర్‌ శాస్త్రవేత్తలు గణేశ్‌కుమార్‌, డాక్టర్‌ బీవీఎస్‌ కృష్ణకుమార్‌, డాక్టర్‌ మను కోరుల్లా, ఆర్‌.శ్రీహరి, డాక్టర్‌ అబ్రహం వరుగీస్‌, తదితరులు పాల్గొన్నారు.


Read more