విశాఖ నుంచే మళ్లీ పోటీ

ABN , First Publish Date - 2022-11-25T02:16:54+05:30 IST

‘‘రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం.

విశాఖ నుంచే మళ్లీ పోటీ

ఎంపీ, ఎమ్మెల్యేనా అన్నది ప్రజాభీష్టం: లక్ష్మీనారాయణ

ప్రత్తిపాడు, నవంబరు 24: ‘‘రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. విశాఖ నుంచి పోటీ చేయడానికే ప్రాధాన్యం. ఎంపీగానా లేదా ఎమ్మెల్యేగానా అనేది ప్రజల అభీష్టం మేరకు ఉంటుంది’’ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో సాగు చేపట్టిన వరిపంట కోత, నూర్పిడి పనులను గురువారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయానికి సమీకరణలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టమన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలను 26 రాజధానులుగా అభివృద్ధి చేయాలన్నది తన అభిమతమన్నారు. విశాఖను ఐటీ టూరిజం హబ్‌ రాజధానిగా, శ్రీకాకుళం కొబ్బరి, జీడిపప్పు, పనస, గోదావరి జిల్లాల్లో వరి, ఆక్వాల రాజధానులుగా, రాయలసీమను ఖనిజ రాజధానిగా, అభివృద్ధి చేయవచ్చన్నారు. ఇలా వనరులను అనుసరించి జిల్లాలవారీగా పరిశ్రమల స్థాపన, ఎగుమతులు, దిగుమతులు వంటి వాటిపై ఏ జిల్లాకు ఆ జిల్లాను రాజధానిగా అభివృద్ధి చేయవచ్చన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి, అరకులోయలను టూరిజం అభివృద్ధిగా చేపట్టవచ్చన్నారు. విశాఖలో శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే కర్నూలులో మరో సమావేశాల ద్వారా పరిపాలన చేయవచ్చన్నారు. ఎన్నికలకు ఐదేళ్లకు అవకాశం కల్పిస్తే మధ్యలో వివిధ కారణాల వల్ల జరిగే ఉప ఎన్నికల్లో మొదటిసారి గెలుపొందిన అభ్యర్థి తరువాత స్థానంలో నిలిచిన అభ్యర్థికి అవకాశం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నామని తెలిపారు. 50 శాతం ఓట్లు పోలింగ్‌ జరగని ప్రదేశంలో ఎన్నికలు మళ్లీ నిర్వహించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల్లో ఓటింగ్‌ చేయని వారికి ఆదాయ పన్ను 30 శాతం అధికంగా పెనాల్టీ వేసే సంప్రదాయం కొన్ని దేశాల్లో కొనసాగుతోందని జేడీ తెలిపారు.

Updated Date - 2022-11-25T02:16:54+05:30 IST

Read more