-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » commissioner fire on revenue-NGTS-AndhraPradesh
-
రెవెన్యూపై కమిషనర్ ఫైర్
ABN , First Publish Date - 2022-03-16T06:08:19+05:30 IST
పన్నుల వసూళ్లలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదంటూ జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు, జోనల్ కమిషనర్లపై కమిషనర్ లక్ష్మీషా ఆగ్రహం వ్యక్తంచేశారు.

పన్ను వసూళ్లలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదంటూ అసంతృప్తి
శతశాతం వసూలు కావాల్సిందేనని ఆదేశం
నెలాఖరు నాటికి లక్ష్యం చేరుకోని వారిపైచర్యలు తప్పవని లక్ష్మీషా హెచ్చరిక
విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పన్నుల వసూళ్లలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదంటూ జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు, జోనల్ కమిషనర్లపై కమిషనర్ లక్ష్మీషా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్తి పన్ను, నీటి చార్జీలు, మార్కెట్లు, దుకాణాల ఆశీలు, లీజుల వసూళ్లపై పాతకౌన్సిల్హాలులో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మరో 15 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నప్పటికీ పన్నుల వసూలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ద్వారా ఇంకా రూ.128.36 కోట్లు వసూలు కావలసి ఉందన్నారు. ఖాళీ స్థలాల పన్ను ద్వారా రూ.పది కోట్లు, కొళాయి కనెక్షన్ల నుంచి రూ.57.2 కోట్లు, అద్దెలు, లీజుల రూపంలో రూ.15.41 కోట్లు బకాయి వుండడంపై జోనల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులను ఆయన నిలదీశారు. వాటన్నింటినీ తక్షణమే వసూలు చేయాలని ఆదేశించారు. పన్నులు శతశాతం వసూలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. లక్ష్యం చేరుకోని రెవెన్యూ అధికారులను, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు అడ్మినిస్ర్టేషన్ కార్యదర్శులు, లీజులు పర్యవేక్షించే సూపరింటెండెంట్లు, గుమస్తాలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ బాధ్యతలు చూసేవారంతా ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటలకే విధులకు హాజరై రాత్రి ఎనిమిది గంటల వరకూ పన్నుల వసూళ్లపై దృష్టిపెట్టాలని స్పష్టంచేశారు. మొండి బకాయిదారులు స్పందించకుంటే వారి ఆస్తులు జప్తులు చేయాలని, షాపులను మూసివేయించి, కొళాయి కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. మార్కెట్లు, కల్యాణ మండపాలు కాంట్రాక్టర్లు లీజు బకాయిలన్నీ నెలాఖరు నాటికి చెల్లించేలా కార్యాచరణ రూపొందించి అమలుచేయాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న భవనాలను పరిశీలించి వీఎల్టీ కట్టారా? లేదా? పరిశీలించి...కట్టనివారి నుంచి మూడేళ్ల వీఎల్టీ రాబట్టాలని సూచించారు. రోజువారీ పురోగతి కనిపించాలని, లేనిపక్షంలో డీసీఆర్ను పర్యవేక్షించాలని ఆదేశిస్తానని, అప్పటికీ ఫలితం లేకపోతే తానే నేరుగా బాధ్యులైన ఉద్యోగులతో మాట్లాడి వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.