కేజీహెచ్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-11T06:06:48+05:30 IST

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున శనివారం రాత్రి కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కేజీహెచ్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు
కేజీహెచ్‌లో బెడ్‌పై నిద్రిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున

ఆస్పత్రిలోనే రాత్రి బస 


విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):


జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున శనివారం రాత్రి కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి 8.30 గంటలకు క్యాజువాల్టీకి వెళ్లిన కలెక్టర్‌...అక్కడ నుంచి సుమారు రెండు గంటలపాటు పలు వార్డుల్లో కలియతిరిగి రోగులతో మాట్లాడారు. సేవలు ఎలా అందుతున్నదీ తెలుసుకున్నారు. ముందుగా గిరిజన సేవా కేంద్రానికి వెళ్లి సిబ్బందితో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సహకారాన్ని అందించాలని సూచించారు. వెయింట్‌ హాలులో రోగుల సహాయకుల కోసం లగేజీ పెట్టుకునేందుకు కప్‌ బోర్డులు, చార్జింగ్‌ పాయింట్‌లు, దోమ తెరలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వార్డు బాయ్స్‌ డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిగా పాటించాలని, టాయ్‌లెట్స్‌ శుభ్రంగా వుండేలా చూడాలని ఆదేశించారు. పిల్లల వార్డును సందర్శించిన కలెక్టర్‌ అక్కడ మంచినీటి సదుపాయం లేకపోవడం గమనించి అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పర్యటనలో ఆయన వెంట కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ నాయుడు, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది ఉన్నారు. కాగా తనిఖీల అనంతరం కలెక్టర్‌ కేజీహెచ్‌లోనే రాత్రి బస చేశారు. ఆస్పత్రిలో బస చేసిన మొదటి కలెక్టర్‌ ఆయనేనని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-09-11T06:06:48+05:30 IST