నేడు వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-12-30T01:19:02+05:30 IST

జిల్లాలోని మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో 52.15 ఎకరాల్లో నిర్మించనున్న వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.

నేడు వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన
భీమబోయినపాలెంలో వైద్య కళాశాల నిర్మించే స్థలం ఇదే..

మాకవరపాలెం, డిసెంబరు 29: జిల్లాలోని మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో 52.15 ఎకరాల్లో నిర్మించనున్న వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మట్టి పనులు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పనులు పూర్తి చేశారు. వైద్య కళాశాల నిర్మాణ పనులను నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకోగా, 30 నెలల్లో పనులు పూర్తి చేయాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏలేరు- తాండవ ఎత్తిపోతల పథకానికి..

నర్సీపట్నం, డిసెంబరు 29 : ఏలేరు- తాండవ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం, కాలువ అనుసంధానం కోసం ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలోని ఆరు మండలాల్లో తాండవ జలాశయం కింద సాగవుతున్న 51,465 ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందివ్వడంతో పాటు పత్తిపాడు నియోజకవర్గంలో 6,500 ఎకరాల కొత్త ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకంలో ఏలేరు, తాండవ కాలువలపై ఆరు చోట్ల ఎత్తిపోతల పథకాలు, ఏలేశ్వరం నుంచి గుణిపూడి వరకు 68 కిలోమీటర్లు మేర ఏలేరు కాలువ లైనింగ్‌ పనులు చేపడతారు.

రహదారుల విస్తరణకు...

నర్సీపట్నం అబీద్‌ సెంటర్‌ నుంచి పెదబొడ్డేపల్లి మదుం వరకు రహదారుల విస్తరణ పనులకు రూ.10.6 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో రోడ్లు విస్తరణ, సెంటర్‌ లైటింగ్‌, గ్రీనరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. అలాగే మరో రూ.6 కోట్లతో స్థానిక శ్రీవేంకటేశ్వర స్వామి గుడి రోడ్డు నుంచి పెదబొడ్డేపల్లి వరకు అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారు.

Updated Date - 2022-12-30T01:19:04+05:30 IST