పరిశుభ్రతతోనే పరిపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-10-03T06:24:23+05:30 IST

పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అన్నారు.

పరిశుభ్రతతోనే పరిపూర్ణ ఆరోగ్యం
- క్లాప్‌ మిత్రాల సత్కార సభలో కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి


- జిల్లాలో అన్నింటినీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి

-  కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

తుమ్మపాల, అక్టోబరు 2 : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం అనకాపల్లి మండలం బవులవాడ గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛతా  హీ సేవా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లాలో గ్రామాలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇళ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా గ్రామస్థులంతా చొరవ చూపాలన్నారు. గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటే రోగాల బారిన పడే ప్రమాదముందని వివరించారు.  గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి సంపద కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లాలో 646 పంచాయతీలకు గాను దాదాపు 240 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని శతశాతం అమలు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం క్రాప్‌ మిత్రాలకు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మజ్జి లక్ష్మి, ఎంపీటీసీ తోటాడ విజయ్‌, ఈవోపీఆర్డీ ధర్మారావు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T06:24:23+05:30 IST