చెరకు మద్దతు ధర రూ.2821.25

ABN , First Publish Date - 2022-10-01T06:44:55+05:30 IST

రానున్న క్రషింగ్‌ సీజన్‌లో చెరకు మద్దతు ధర టన్ను రూ.2821.25లుగా జిల్లా కలెక్టర్‌, ఫ్యాక్టరీ చైర్మన్‌ అయిన రవి పట్టన్‌శెట్టి ప్రకటించారు.

చెరకు మద్దతు ధర రూ.2821.25
గోవాడ షుగర్స్‌ మహాజనసభ వేదికపై కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు రాజు, రామానాయుడు, తదతరులు

గోవాడ షుగర్స్‌ మహాజన సభలో కలెక్టర్‌ ప్రకటన

ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వినతి

రాజకీయాలకు అతీతంగా ఫ్యాక్టరీని కాపాడుకోవాలి: డిప్యూటీ సీఎం

చెరకు బకాయిలు పూర్తిగా చెల్లించాకే క్రషింగ్‌: ప్రభుత్వ విప్‌

అవకతవకలపై వైసీపీ, టీడీపీ నేతలు సవాళ్లు.. ప్రతిసవాళ్లు


చోడవరం, సెప్టెంబరు 30: రానున్న క్రషింగ్‌ సీజన్‌లో చెరకు మద్దతు ధర టన్ను రూ.2821.25లుగా జిల్లా కలెక్టర్‌, ఫ్యాక్టరీ చైర్మన్‌ అయిన రవి పట్టన్‌శెట్టి ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం గోవాడ షుగర్స్‌ మహాజన సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, గత సీజన్‌లో వచ్చిన పంచదార రికవరీ శాతం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అనుగుణంగా ఈ ధరను నిర్ణయించినట్టు చెప్పారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ మహాజన సభలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు ఆయన వెల్లడించారు. సభలో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ, మంత్రి అమరనాఽథ్‌, తాను, విప్‌ ధర్మశ్రీ కలిసి గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిస్థితిని సీఎంకు వివరించి గ్రాంట్‌ మంజూరు అయ్యేలా కృషి చేశామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఫ్యాక్టరీని కాపాడుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఫ్యాక్టరీ నిర్వహణను గాడిలో పెట్టి, లాభాల బాటలో నడిపించేందుకు రిటైర్డ్‌ అధికారి ఎండీ రామయ్యను తిరిగి ఫ్యాక్టరీ ఎండీగా తీసుకు  వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఆంక్షల కారణంగా పంచదార విక్రయాల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతుల తరపున తాను హైకోర్టులో కేసు వేయించానని చెప్పారు. దీంతో పంచదార విక్రయాలకు అడ్డంకులు తొలగిపోయాయన్నారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు విడతల్లో రూ.77.51 కోట్లు గ్రాంటు రూపంలో ఇచ్చి ఆదుకున్నదన్నారు. గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ.2,500 చొప్పున చెల్లించామని, మిగిలిన రూ.275 (టన్నుకు) కూడా త్వరలో చెల్లించి ఆ తరువాత క్రషింగ్‌ ప్రారంభిస్తామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మాట్లాడుతూ... డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్‌ కలిసి సీఎంతో మాట్లాడి డిస్టిలరీ ఏర్పాటు చేయిస్తే పార్టీలకు అతీతంగా వారిద్దరినీ సత్కరిస్తామని అన్నారు.. ఆప్కాబ్‌ నుంచి అప్పు తీసుకోకుండా చెరకు బకాయిలు చెల్లించామని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ చెరకు బకాయిల చెల్లింపుల్లో తీవ్రజాప్యం వల్ల రైతులపై వడ్డీ భారం పెరిగిపోతున్నదని అన్నారు. మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ, చెరకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జనసేన నాయకుడు పీవీఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ, చెరకు డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒంటి కన్నుముచ్చు విత్తనం, సామగ్రి కొనుగోళ్లలో జరిగిన అవతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాగా సభలో మాట్లాడిన కొందరు రైతులు ప్రస్తుత సీజన్‌లో ఎరువులు, పురుగుమందులు ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నించారు.

అవకతవకలపై సవాళ్లు.. ప్రతిసవాళ్లు

గోవాడ షుగర్స్‌లో గత పాలకవర్గం హయాంలో జరిగిన అవకతవకలు, ప్రస్తుతం వస్తున్న ఆరోపణలపై మహాజనసభలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ, అవకతవకలకు పాల్పడినవారు భయపడేలా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యుల నుంచి డబ్బులు రికవరీ చేయాలని సూచించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు.. గత పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫ్యాక్టరీ వ్యవహారాలు, ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తాము అధికారం చేపట్టిన తరువాత మొలాసిస్‌ విక్రయాల్లో తప్పులు జరుగుతున్నట్టు సమాచారం అందిన వెంటనే ఆ టెండర్‌ను నిలిపివేయించానన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొలాసిస్‌ విక్రయాల్లో అవకతవకలు జరిగినా ఎందుకు స్పందించలేదని టీడీపీ నేతలను ప్రశ్నించారు.  ధర్మశ్రీ మాట్లాడుతూ, అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణ అయినా జరిపించుకోవచ్చని, తాము సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు.  కాగా సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ జనసేన నాయకుడు జెర్రిపోతుల నానాజీ, రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు.  ఫ్యాక్టరీ ఎండీ వి.సన్యాసినాయుడు ఆర్థిక నివేదికను సభకు సమర్పించారు. షుగర్స్‌ మాజీ చైర్మన్‌ గూనూరు మల్లునాయుడు, దొండా కన్నబాబు, సీడీసీ చైర్మన్‌ దొండా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Read more