-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » chavithi sandadi-NGTS-AndhraPradesh
-
చవితి సందడి
ABN , First Publish Date - 2022-08-31T06:03:22+05:30 IST
జిల్లా కేంద్రమైన అనకాపల్లి మార్కెట్‌లో మంగళవారం వినాయక చవితి సందడి కనిపించింది.

ప్రతిమలు, పత్రి, పండ్లు, పూలు కొనుగోలుకు తరలివచ్చిన భక్తులు
రద్దీగా మారిన రహదారులు
అనకాపల్లిటౌన్, ఆగస్టు 30: జిల్లా కేంద్రమైన అనకాపల్లి మార్కెట్‌లో మంగళవారం వినాయక చవితి సందడి కనిపించింది. పత్రి, పూలు, పండ్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేయడానికి భక్తులు తరలిరావడంతో ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు రద్దీగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోలేదు. బహిరంగ ప్రదేశాల్లో పందిళ్లు వేయడానికి పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అయితే ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వీధుల్లో గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లలో కూడా పూజలు చేయడానికి అవసరమైన వినాయక ప్రతిమ, వ్రత సంకల్ప పుస్తకంతోపాటు వివిధ రకాల పత్రిలు, పండ్లు, ఇతర పూజా సామగ్రి కొనుగోలుకు పట్టణ వాసులతోపాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో నెహ్రూచౌక్ నుంచి చిననాలుగురోడ్ల జంక్షన్ వరకు రహదారి మొత్తం రద్దీగా మారింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ధరలు పెంచేశారు. సాధారణ రోజులతో పోలిస్తే పూలు, పండ్ల ధరలు రెట్టింపు అయ్యాయని భక్తులు అంటున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఔత్సాహికులు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. మెయిన్‌రోడ్డులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సీఐ టి.శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఎలమంచిలిలో...
ఎలమంచిలి, ఆగస్టు 30: పట్టణంలో వినాయక చవితి పూజా సామగ్రి అమ్మకం, కొనుగోలుదారులతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. వినాయక ప్రతిమలు, పత్రి, పండ్లు, పూలు, ఇతర సామాన్ల అమ్మకందారులు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేశారు. పట్టణవాసులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి వినాయక చవితికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు.