అమ్మకానికి చైన్‌మన్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-11-21T00:50:37+05:30 IST

టౌన్‌ప్లానింగ్‌లో అవినీతికి చైన్‌మన్‌లే కారణం. వారిపై ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి.

అమ్మకానికి చైన్‌మన్‌ పోస్టులు

ఆశావహులతో కౌన్సిల్‌లో కీలకనేత బేరసారాలు

రూ.2 లక్షలు ఇస్తే ఇన్‌చార్జిగా పోస్టింగ్‌కు హామీ

ఈనెల 4న ఈ వ్యవస్థను రద్దుచేస్తూ కౌన్సిల్‌ తీర్మానం

వారి నుంచి ఒత్తిడి రావడంతో పునరాలోచన

ఆసక్తి ఉన్నవారిని సంప్రదించే బాధ్యత జోన్‌-5లో పనిచేసే చైన్‌మన్‌కు అప్పగింత

వసూళ్లపై కౌన్సిల్‌లోని పెద్దల్లో అభిప్రాయభేదాలు

జీవీఎంసీ కార్యాలయంలో వాగ్వాదం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

‘టౌన్‌ప్లానింగ్‌లో అవినీతికి చైన్‌మన్‌లే కారణం. వారిపై ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. అవినీతిని పెకిలించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను రద్దుచేస్తూ తీర్మానం చేస్తున్నాం’ ఈనెల నాలుగున జరిగిన జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి చేసిన ప్రకటన ఇది.

మేయర్‌ ప్రకటనతో జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న చైన్‌మన్లు ఉలిక్కిపడ్డారు. నేతల ద్వారా మేయర్‌, కమిషనర్‌ను కలిసి కొనసాగించాలంటూ వినతిపత్రం అందజేశారు. దీనిని అవకాశం మలుచుకునేందుకు కౌన్సిల్‌లోని కీలకనేత రంగం సిద్ధం చేశారు. తనదైన శైలిలో సెటిల్‌మెంట్‌కు శ్రీకారం చుట్టి బేరసారాలకు తెర తీయడం వివాదానికి దారితీసింది.

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగం పరిధిలో 38 మంది చైన్‌మన్‌లు పనిచేస్తున్నారు. పూర్వం ఏదైనా స్థలం సర్వే చేయాలంటే చైన్‌తోనే కొలతలు వేసేవారు. దీంతో చైన్‌ను పట్టుకునేందుకు, సర్వేయర్లకు సహాయంగా ఉండేందుకు ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. కాలక్రమేణా స్థలాల సర్వే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సాగపోతోంది. దీంతో చైన్‌మన్లను భవన నిర్మాణాలకు సంబంధించిన సమాచార సేకరణ, రోడ్డుకి అడ్డంగా భవన నిర్మాణ సామగ్రి వేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారి వివరాలు సేకరించడం లాంటి పనులకు వినియోగిస్తున్నారు. గతంలో వార్డుకి ఒకరు చొప్పున చైన్‌మన్‌లు ఉంటే ఉద్యోగ విరమణ చేసినవారి స్థానంలో కొత్తగా నియామకం నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం 38 మంది పనిచేస్తున్నారు. వీరిలో 18 మంది శాశ్వత చైన్‌మన్‌లు కాగా మిగిలిన 20 మంది ఇతర విభాగాల్లోని అటెండర్లుగా పనిచేస్తూ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారే. ఇదిలావుంటే వార్డులో జరిగే అక్రమ భవన నిర్మాణాలకు చైన్‌మన్‌లే అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరైనా భవన నిర్మాణం ప్రారంభిస్తే అక్కడ వాలిపోతుంటారని, రకరకాల కారణాలతో బెదిరించి డబ్బు గుంజేస్తున్నారని జీవీఎంసీ కమిషనర్‌, మేయర్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. భవన యజమానులకు కార్పొరేటర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు మధ్యవర్తిత్వం నెరపి సెటిల్‌ చేయడంలో వీరే కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఈ వ్యవస్థను రద్దు చేస్తే సమావేశంలో తీర్మానం చేశారు.

ఇన్‌చార్జి పోస్టుకి రూ.రెండు లక్షలు

చైన్‌మన్‌ వ్యవస్థను రద్దుచేస్తున్నట్టు కౌన్సిల్‌లో తీర్మానం చేయడంతో ప్రస్తుతం పనిచేస్తున్నవారంతా మేయర్‌, కమిషనర్‌తో పాటు అన్నిపార్టీల ఫ్లోర్‌లీడర్లకు వినతిపత్రాలు అందజేశారు. శాశ్వత చైన్‌మన్లను అయినా కొనసాగించాలని, ఇందుకోసం ఎదైనా చేస్తామంటూ ఆఫర్‌ ఇవ్వడం కౌన్సిల్‌లో కీలకనేతను ఆలోచనలో పడేసింది. వెంటనే శాశ్వత చైన్‌మన్లకు సారఽథ్యం వహిస్తున్న ఒకరితో మాట్లాడి ఏం చేయాలనుకుంటున్నారో చెబితే, కమిషనర్‌, కౌన్సిల్‌లోని ఇతర పెద్దలను ఒప్పిస్తాననడంతో ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో అతడు కౌన్సిల్‌లో కీలక పదవుల్లో మరో ఇద్దరు నేతలతో చర్చించారు. ఇన్‌చార్జి చైన్‌మన్‌లు 12 మంది అవసరమని, చీఫ్‌సిటీప్లానర్‌తో ప్రతిపాదించాలని నిర్ణయించారు. తొలగించిన 20 మందిలో తిరిగి కొనసాగే ఆసక్తి ఉన్న 12 మందిని ఎంపిక చేసి, ఒక్కొక్కరి నుంచి రూ.రెండు లక్షలు చొప్పున వసూలుకు రంగం సిద్ధం చేశారు. ఆసక్తి ఉన్నవారిని సంప్రదించే బాధ్యతను జోన్‌-5లో పనిచేస్తున్న చైన్‌మన్‌కు అప్పగించారు. ఇదిలావుంటే తన పరిధిలో ఉన్న వారికి కొంత మినహాయింపు ఇవ్వాలని కౌన్సిల్‌లో కీలకస్థానంలో మరో నేత కోరడం అభిప్రాయభేదాలకు దారితీసి, వాగ్వాదం చోటుచేసుకోవడంతో చైన్‌మన్‌ పోస్టులకు బేరం పెట్టిన విషయం బయటపడింది. మేయర్‌ ప్రకటనకు విరుద్ధంగా జేబులు నింపుకోవడం కోసం చైన్‌మన్‌లను కొనసాగించేందుకు కొందరు కీలక నేతలు పావులు కదపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-11-21T00:50:37+05:30 IST

Read more