అంగట్లో అంగన్‌వాడీ పోస్టులు

ABN , First Publish Date - 2022-09-11T06:12:04+05:30 IST

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ పోస్టుల భర్తీ కార్యక్రమం అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తోంది.

అంగట్లో అంగన్‌వాడీ పోస్టులు

వసూళ్లకు తెరదీసిన అధికార పార్టీ నేతలు

ఎవరు ఎక్కువ సొమ్ము ఇస్తే వారికే ఖరారు

ఆయా పోస్టు రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టు రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలు,  కార్యకర్త పోస్టుకు రూ.ఐదు లక్షల నుంచి రూ.ఆరు లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు ప్రచారం

మొక్కుబడి కార్యక్రమంగా మారనున్న ఇంటర్వ్యూలు


(విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి)

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ పోస్టుల భర్తీ కార్యక్రమం అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 66 పోస్టుల భర్తీకి అధికారులు కొద్దిరోజుల కిందట నోటిఫికేషన్‌ విడుదల చేయగా దరఖాస్తులు భారీగా వచ్చాయి. ప్రతిచోట పోస్టుకు పోటీ పడుతున్న అభ్యర్థులు  ఎక్కువగా వుండడంతో అధికార పార్టీ నాయకులు వసూళ్లకు తెరదీశారు. మార్కుల ఆధారంగా కాకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో అధికార పార్టీ నేత (ఎమ్మెల్యే/సమన్వయకర్త) సూచించిన వారికే ఈ పోస్టులను కట్టబెట్టనున్నారు. ఇదే అదనుగా గ్రామ, మండల స్థాయి నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆయా పోస్టుకు వున్న డిమాండ్‌ను బట్టి ఆయా పోస్టుకు రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు, కార్యకర్త పోస్టుకు అయితే రూ.ఐదు లక్షల నుంచి రూ.ఆరు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల మరింత అదనంగా వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మొత్తంలో సగానికిపైగా స్థానిక ఎమ్మెల్యేలు/ఇన్‌చార్జులకు, వారి బంధువులకు ముట్టజెప్పి...మిగిలింది స్థానిక నాయకులు జేబులో వేసుకుంటున్నట్టు చెబుతున్నారు.  


బహిరంగ రహస్యమే.. 

అధికార పార్టీలో పోస్టులు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా వుండడంతో భారీ ధర పలుకుతున్నట్టు చెబుతున్నారు. పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే ఇంటర్వ్యూ మొక్కుబడి కార్యక్రమం అనే విషయం అందరికీ తెలిసిందే. అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సూచించిన  వారి పేర్లనే అధికారులు ఖరారు చేస్తుంటారు. అంతకు మించి ఈ వ్యవహారం పారదర్శకంగా జరిగేందుకు అవకాశం వుండదని పలువురు చెబుతున్నారు. ఇదిలావుండగా ప్రతి గ్రామంలో అధికార పార్టీలో రెండు, మూడు వర్గాలు ఉండడం, ఒకటి, రెండు పోస్టులు ఉన్నచోట కూడా ఆయా వర్గాలు ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులను తీసుకువస్తుండడంతో ఎమ్మెల్యేలు/నియోజకవర్గ ఇన్‌చార్జులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు పేర్లు ఖరారు కాకపోయినా  స్థానిక నాయకులు వసూలు మొదలెట్టేశారు. ఆర్థిక స్థోమత, కుటుంబ బలం వంటి అంశాలను చూసుకుని స్థానిక నాయకులు అభ్యర్థులను ఎమ్మెల్యే కార్యాలయాలకు తీసుకువెళుతున్నారు. 


కొనసాగుతున్న వడపోత ప్రక్రియ.. 

జిల్లాలోని విశాఖపట్నం అర్బన్‌-1 ప్రాజెక్టు పరిధిలో 2 కార్యకర్తల పోస్టులు, 14 హెల్పర్‌, అర్బన్‌ ప్రాజెక్టు-2 పరిధిలో 3 కార్యకర్తల పోస్టులు, 5 హెల్పర్‌, పెందుర్తి ప్రాజెక్టు పరిధిలో ఒక కార్యకర్త పోస్టు, 6 హెల్పర్‌, భీమునిపట్నం ప్రాజెక్టు పరిధిలో తొమ్మిది కార్యకర్తల పోస్టులు, ఒక మినీ కార్యకర్త, 25 హెల్పర్‌ పోస్టులు...మొత్తం 66 పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల ఏడో తేదీలోగా దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల వారీగా వచ్చిన దరఖాస్తులను అధికారులు వడపోస్తున్నారు.

Updated Date - 2022-09-11T06:12:04+05:30 IST