ఆర్‌ఈసీఎస్‌కి ఉరుకులు పరుగులు

ABN , First Publish Date - 2022-11-19T01:12:54+05:30 IST

‘ఆర్‌ఈసీఎస్‌పై హైడ్రామా’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో ఈపీడీసీఎల్‌ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.

ఆర్‌ఈసీఎస్‌కి ఉరుకులు పరుగులు

స్పందించిన ఈపీడీసీఎల్‌ ఉన్నతాధికారులు

ఆరు నెలల ఇంటర్‌నెట్‌ బిల్లు మంజూరు

ట్రాన్స్‌ఫార్మర్ల తనిఖీకి ఎస్‌ఈ కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులు

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

‘ఆర్‌ఈసీఎస్‌పై హైడ్రామా’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో ఈపీడీసీఎల్‌ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఉన్నతాధికారులు ఈ అంశంపై సీరియస్‌ కావడంతో ఎస్‌ఈ కార్యాలయం నుంచి ఇద్దరు ఏడీఈలు కశింకోట వెళ్లి అక్కడ ట్రాన్స్‌ఫార్మర్ల అవసరం ఏమిటో పరిశీలించారు. పాడైపోయిన వాటిని చూశారు. ఎస్‌ఈ కార్యాలయానికి రాసిన లేఖలు తీసుకొని, సాయంత్రంకల్లా ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తామని, సింహాచలం కేంద్రానికి లారీ పంపించాలని సూచించారు. అదే సమయంలో ఆరు నెలలు మంజూరు చేయని ఇంటర్‌నెట్‌ బిల్లును వెంటనే చెల్లించాలని సూచనలు వెళ్లాయి. దాంతో అప్పటికప్పుడు చెక్‌ తయారు చేశారు. దానిని తీసుకొని నిలుపు చేసిన ఇంటర్‌నెట్‌ సేవలు అందించాలని కశింకోట అధికారులు ఆ ఏజెంట్‌ని కోరారు. మిగిలిన అంశాలపై కార్పొరేట్‌ కార్యాలయం అధికారులు ఎస్‌ఈ కార్యాలయం నుంచి వివరణ కోరారు. కశింకోట డివిజన్‌ ఏర్పాటయ్యాక ప్రస్తుత ఎస్‌ఈ ఎన్నిసార్లు తనిఖీకి వెళ్లారు?, అక్కడి పరిస్థితులు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. అక్కడి వ్యవహారాలకు ఆటంకం లేకుండా చూసుకోవాలని సూచించారు.

ఆ ముగ్గురికి రూ.28 లక్షల చెక్‌ తయారీ

కశింకోటలో పరిపాలన అస్తవ్యస్థంగా ఉందని, పదవీ విరమణ చేసిన వారికి కూడా బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని, వారు కలెక్టర్‌ని ఆశ్రయించారని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో కార్పొరేట్‌ కార్యాలయం అధికారులు దానిపై కూడా స్పందించారు. పదవీ విరమణ చేసిన మునగపాక మహిళా ఉద్యోగులకు మొత్తం రూ.28 లక్షల వరకు బెనిఫిట్స్‌ వెళతాయని లెక్కలు తేల్చి, వాటిని అందించడానికి ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-11-19T01:12:56+05:30 IST