సమగ్ర భూ సర్వేలో అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2022-10-12T06:28:46+05:30 IST

సమగ్ర భూ సర్వేలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ హెచ్చరించారు. ప్రతి గ్రామంలో శత శాతం సర్వే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

సమగ్ర భూ సర్వేలో అలసత్వం వద్దు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

- ప్రతి గ్రామంలో శతశాతం సర్వే పూర్తి కావాలి

- జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

పాడేరు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): సమగ్ర భూ సర్వేలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ హెచ్చరించారు. ప్రతి గ్రామంలో  శత శాతం సర్వే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏజెన్సీ మండలాలకు చెందిన తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, గ్రామ సచివాలయ సర్వేయర్లతో భూ రీసర్వేపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర భూ సర్వేతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రధానంగా భూ వివాదాలు పరిష్కారమవుతాయన్నారు. భూములు రీసర్వే చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఎక్కువగా ఉందని తెలిపారు. సమగ్ర సర్వేలో చేపట్టాల్సిన కీలక అంశాలను ఆయన వివరించారు. అందరూ సమన్వయంతో పని చేసి వివాదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా రీ సర్వే చేయాలన్నారు. సర్వే పూర్తయిన అనంతరం జగనన్న భూ రక్ష, భూ హక్కులు పథకంలో భాగంగా శాశ్వత పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన హక్కుదారులందరికీపూర్తి స్థాయిలో హక్కులు కల్పించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. భూముల విస్తీర్ణంలో తేడాలు లేకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వే చేసి గ్రామ హద్దులను, రైతుల భూములకు హద్దులు నిర్ణయించాలన్నారు. త్వరితగతిన రీ సర్వే చేయడానికి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సర్వే బృందాలు, రెవెన్యూ అధికారులు ముందుగా గ్రామ సభలు నిర్వహించాలని, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు రీ సర్వేపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గ్రామాలకు వచ్చే సర్వే బృందాలకు గిరిజన రైతులు సహకారం అందించాల న్నారు. సివిల్‌ వివాదాలు ఉంటే భూముల మ్యుటేషన్‌ చేయకూడదని రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు మాట్లాడుతూ జిల్లాలో 2,969 గ్రామాల్లో భూముల రీసర్వే జరుగుతుందని, సర్వే బృందాలు సమయపాలన పాటించాలని, గ్రామాలకు ముందుగా సమాచారం అందించాలని తెలిపారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా భూముల రీసర్వే జరగాలన్నారు. ఈ సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, డీఆర్‌వో బి.దయానిధి, డీఎఫ్‌వో వినోద్‌కుమార్‌, సర్వే విభాగం ఏడీ వై.మోహనరావు, సర్వే సంస్థల ప్రతినిధులు, ఏజెన్సీ పదకొండు మండలాల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-12T06:28:46+05:30 IST