సఖ్యతగా ఉండండి.. సమన్వయంతో పనిచేయండి

ABN , First Publish Date - 2022-02-19T06:12:42+05:30 IST

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్లాస్‌ తీసుకున్నారు.

సఖ్యతగా ఉండండి.. సమన్వయంతో పనిచేయండి
చంద్రబాబునాయుడుతో టీడీపీ నేతలు గిడ్డి ఈశ్వరి, బొర్రా నాగరాజు, ఎంవీవీ.ప్రసాద్‌


పాడేరు టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు క్లాస్‌ 

పాడేరు, ఫిబ్రవరి 18: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్లాస్‌ తీసుకున్నారు. నియోజకవర్గంలలో టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టీడీపీ త్రిసభ్య కమిటీ ప్రతినిధులుగా ఉన్న మాజీ మంత్రి మణికుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు బొర్రా నాగరాజు, ఎంవీవీ.ప్రసాద్‌ల మధ్య నాలుగున్నరేళ్లుగా సఖ్యత లోపించడంతో పార్టీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో నియోజవర్గంలో క్షేత్ర స్థాయిలో టీడీపీకి పట్టున్నప్పటికీ, నేతల్లో సమన్వయ లోపంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి సీనియర్‌ కార్యకర్తలు తీసుకువెళ్లారు. దీంతో గత నెలలో తొలుత మణికుమారి, బొర్రా నాగరాజు, ఎంవీవీ.ప్రసాద్‌లను మంగళగిరిలోకి కేంద్ర కార్యాలయానికి పిలిపించి అందరూ ఐక్యతగా పార్టీ బలోపేతానికి కృషిచేయాలని చంద్రబాబు సూచించారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పిలిపించి త్రిసభ్య కమిటీ సభ్యులైన మణికుమారి, నాగరాజు, ప్రసాద్‌లతో సమన్వయంగా ఉండాలని, అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. అయినప్పటికీ ఈశ్వరి, ఆ ముగ్గురు కలవని పరిస్థితి కొనసాగుతుంది. అయితే మణికుమారి చాలా ఏళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండగా, బొర్రా నాగరాజు, ఎంవీవీ.ప్రసాద్‌ గిడ్డి ఈశ్వరికి దూరంగా ఉన్నారు. అలాగే ఈశ్వరి కూడా వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. 

తాజాగా చంద్రబాబు క్లాస్‌..

పాడేరు ముఖ్య నేతలను సమన్వయంగా ఉండమన్నప్పటికీ పట్టించుకోలేదని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం గిడ్డి ఈశ్వరి, బొర్రా నాగరాజు, ఎంవీవీ.ప్రసాద్‌లను మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి రప్పించుకుని గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు. ముగ్గురు నేతలు ఐక్యంగా ఉంటూ సమన్వయంతో పార్టీ పటిష్టానికి కృషి చేయాలని, ఉమ్మడిగా వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల్లో తీసుకువెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే ముగ్గురూ విభేదాలు వీడి సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబునాయుడు సూచించారు.  

Read more