-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Badminton winner is PSPB-NGTS-AndhraPradesh
-
బ్యాడ్మింటన్ విజేత పీఎస్‌పీబీ
ABN , First Publish Date - 2022-09-08T06:33:42+05:30 IST
రైల్వే ఇండోర్ స్పోర్ట్సు ఎన్‌క్లేవ్‌లో జరుగుతున్న సెంట్రల్ జోన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో పెట్రోలియం స్పోర్ట్సు ప్రమోషన్ బోర్డు(పీఎస్‌పీబీ) ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఓవరాల్ టీం చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

విశాఖపట్నం(స్పోర్ట్సు), సెప్టెంబరు 7: రైల్వే ఇండోర్ స్పోర్ట్సు ఎన్‌క్లేవ్‌లో జరుగుతున్న సెంట్రల్ జోన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో పెట్రోలియం స్పోర్ట్సు ప్రమోషన్ బోర్డు(పీఎస్‌పీబీ) ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఓవరాల్ టీం చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్(సీఏజీ) రన్నరప్ స్థానం సాధించగా, ఆతిథ్య రైల్వేస్ మూడో స్థానం దక్కించుకుంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌వర్మ(పీఎస్‌పీబీ) 21-9, 26-24 స్కోరుతో కార్తీక్ జిందాల్(సీఏజీ)పై, మహిళల సింగిల్స్‌లో రితుపర్ణ దాస్(పీఎస్‌పీబీ) 21-12, 21-14 స్కోరుతో నిశిత పకలపటి(సీఏజీ)పై, పురుషుల డబుల్స్‌లో సాయి ప్రణీత్-అర్జున్ ఎంఆర్(పీసీపీబీ) 18-21, 21-16, 21-14 స్కోరుతో అర్జునకుమార్రెడ్డి-ఇమాన్ సోనోవాల్(సీఏజీ)పై విజయం సాధించి 3-0 స్కోరుతో చాంపియన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. టీం చాంపియన్‌గా నిలిచిన పీఎస్పీబీతోపాటు ద్వితీయ తృతీయ స్థానాలలో నిలిచిన సీఏజీ, రైల్వేస్ జట్లకు ఏడీఆర్ఎం సుధీర్‌కుమార్ గుప్తా ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే వాల్తేరు మహిళా సంఘం అధ్యక్షురాలు పారిజాత శెత్పతీ, స్పోర్ట్సు ఆఫీసర్ ప్రదీప్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా బుధవారం సాయంత్రం నుంచి ఓపెన్ చాంపియన్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన మ్యాచ్‌ల్లో మహిళల సింగిల్స్‌లో శ్రియాన్సీ పరదేశి (రైల్వేస్) 21-19, 21-16 స్కోరుతో వృశాలి(సీఏజీ)పై, రితుపర్ణ దాస్(పీఎస్‌పీబీ) 21-18, 21-13 స్కోరుతో నిశిత వర్మ(సీఏజీ)పై గెలుపొందారు.