బాబూరావు ఎంపీటీసీ సభ్యత్వం రద్దు

ABN , First Publish Date - 2022-09-30T05:52:38+05:30 IST

చింతపల్లి ఎంపీటీసీ-3 సభ్యుడు వంతల బాబూరావు ఎన్నికను రద్దు చేస్తూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఉత్తర్వులు జారీ చేశారు.

బాబూరావు ఎంపీటీసీ సభ్యత్వం రద్దు
పదవి కోల్పోయిన వంతల బాబూరావు

- ఎంపీపీ పదవి కూడా..

- చింతపల్లి ఎంపీపీగా అనుషదేవి నియామకం

- ఉత్తర్వులు జారీ చేసిన ఉమ్మడి జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ మల్లికార్జున

చింతపల్లి, సెప్టెంబరు 29: చింతపల్లి ఎంపీటీసీ-3 సభ్యుడు వంతల బాబూరావు ఎన్నికను రద్దు చేస్తూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాబూరావు మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష పదవిని కోల్పోయారు. 2019లో జీకే వీధి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలను నామినేషన్‌ పత్రంలో పొందుపరచలేదని ఆయనపై పిటీషన్‌ దాఖలు కావడంతో ఎలక్షన్‌ ట్రిబ్యునల్‌ కమ్‌ పాడేరు ఏజెన్సీ సబ్‌ జడ్జి ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల అధికారి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఎంపీపీగా తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషదేవిని నియమిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

2021 జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల్లో చింతపల్లి మండలంలో ఉన్న 20 ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ అభ్యర్థులు 10 మంది, స్వతంత్రులు 6, టీడీపీ ఒకటి, సీపీఐ ఒకటి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యారు. 2021 సెప్టెంబరు 24న స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది. వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషదేవి, వైసీపీ రెబ్‌ అభ్యర్థిగా చింతపల్లి-3 ఎంపీటీసీ సభ్యుడు వంతల బాబూరావు పోటీ చేశారు. ఆ ఇద్దరికీ పది మంది చొప్పున ఎంపీటీసీ సభ్యులు మద్దతు ఇచ్చారు. కోరాబు అనుషదేవి, వంతల బాబూరావులు ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో ప్రిసైడింగ్‌ అధికారి రవీంద్రనాథ్‌ లాటరీ వేశారు. ఈ లాటరీలో వంతల బాబూరావు ఎన్నికయ్యారు. 

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అనుషదేవి

ఎంపీపీగా వంతల బాబూరావు ఎన్నిక పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధమని, 2019లో జీకేవీధి పోలీస్‌ స్టేషన్‌లో (ఎఫ్‌ఐఆర్‌ 43/2019) నమోదైన కేసు వివరాలను నామినేషన్‌ పత్రంలో నమోదు చేయాలని ఆరోపిస్తూ ఎలక్షన్‌ ట్రిబ్యునల్‌ కమ్‌ ఏజెన్సీ సబ్‌ జడ్జి పాడేరులో కోరాబు అనుషదేవి పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ఎలక్షన్‌ ట్రిబ్యునల్‌ కమ్‌ ఏజెన్సీ సబ్‌ జడ్జి వి.అభిషేక్‌ ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం 1947 రూల్‌ 11, సెక్షన్‌ 233 ప్రకారం వంతల బాబూరావు చింతపల్లి-3 ఎంపీటీసీ సభ్యత్వాన్ని, ఎంపీపీ పదవిని రద్దు చేస్తూ, లాటరీలో ఓటమిపాలైన తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషదేవిని ఎంపీపీగా నియమించాలని ఈ ఏడాది ఆగస్టు 10న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఆధారంగా ఉమ్మడి జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జున.. వంతల బాబూరావు చింతపల్లి-3 ఎంపీటీసీ సభ్యత్వాన్ని, ఎంపీపీ ఎన్నికను రద్దు  చేశారు. అలాగే తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషదేవిని ఎంపీపీగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను పదవి కోల్పోయిన ఎంపీపీ వంతల బాబూరావు, నూతనంగా ఎంపీపీగా నియమితులైన కోరాబు అనుషదేవి, చింతపల్లి ఎంపీడీవోకి మెయిల్‌ ద్వారా పంపించారు. 

చింతపల్లి-3 ఎంపీటీసీ స్థానానికి మలివిడత ఎన్నిక

చింతపల్లి-3 ఎంపీటీసీ స్థానానికి మలివిడత ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు తీర్పుతో వంతల బాబూరావు ఎంపీటీసీ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఖాళీఅయిన చింతపల్లి-3 ఎంపీటీసీ స్థానానికి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 

అనుషదేవి ప్రమాణ స్వీకారం రేపు!

నూతనంగా నియమితులైన ఎంపీపీ కోరాబు అనుషదేవి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిసింది. ఆమె ప్రమాణ స్వీకారం కోసం మండల పరిషత్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ మెయిల్‌ ద్వారా పంపిన ఉత్తర్వులను పదవి కోల్పోయిన ఎంపీపీ వంతల బాబూరావు, నూతనంగా ఎంపీపీగా నియమితులైన ఎంపీపీ కోరాబు అనుషదేవికి ఎంపీడీవో లాలం సీతయ్య శుక్రవారం స్వయంగా అందజేయనున్నారు. అలాగే నూతన ఎంపీపీ ప్రమాణ స్వీకారం చేసేందుకు శనివారం ఎంపీటీసీ సభ్యులందరూ మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానాలు పంపించనున్నారు. 


Read more