అప్పన్న సన్నిధిలో ఆయుధ పూజ

ABN , First Publish Date - 2022-10-03T06:35:31+05:30 IST

అప్పన్న ఆలయం బేడా మండపంలోని సింహవల్లీ తాయారు సన్నిధిలో ఆదివారం సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు.

అప్పన్న సన్నిధిలో ఆయుధ పూజ
ఆయుధ పూజ చేస్తున్న అర్చకులు సీతారామాచార్యులు

సింహాచలం, అక్టోబరు 2: అప్పన్న ఆలయం బేడా మండపంలోని సింహవల్లీ తాయారు సన్నిధిలో ఆదివారం సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు. వార్షిక ఉత్సవాల అంతర్భాగంగా ఏటా ఆశీయుజ మాస పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు సప్తమి రోజున ఆయుధపూజ (వీరలక్ష్మి ఆరాధన) చేయడం ఆచారం. ఉత్సవంలో భాగంగా తెల్లవారు జామున స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత సేవలను యథావిధిగా పూర్తి చేశారు. ఆలయ బేడా మండపంలోని సింహవల్లీ తాయార్‌ సన్నిధిలో కలశారాధన తొలుత జరిపారు.


ముందుగా ఆలయ భాండాగారం నుంచి తీసిన ఆయుధాలను ప్రత్యేక వేదికపై ఉంచారు. షోడశోపచారాలను సమర్పించారు. ధనుర్భాణాలు, నందకం, ఖైజార్‌, కటిబారు, సువర్ణ ఖడ్గం, హలం, గదలు, పాంచజన్యం, తదితర ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. మంగళ నీరాజనాలు సమర్పించి ఫలాల నివేదన జరిపారు.  పూజల్లో సింహాచల దేవస్థానం సహాయ కార్యనిర్వాహణాధికారి ఎన్‌.ఆనందకుమార్‌, నరసింహరాజు, పర్యవేక్షణాధికారి పిళ్లా శ్రీనివాసరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు

Updated Date - 2022-10-03T06:35:31+05:30 IST