ఉరుగొండ వద్ద ఆటో బోల్తా

ABN , First Publish Date - 2022-10-11T06:16:22+05:30 IST

మండలంలోని కించూరు పంచాయతీ ఉరుగొండ గ్రామం వద్ద సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది.

ఉరుగొండ వద్ద ఆటో బోల్తా
ఉరుగొండ వద్ద ప్రమాదానికి గురైన ఆటో

- ఒకరి మృతి - 14 మందికి గాయాలు

పాడేరురూరల్‌, అక్టోబరు 10: మండలంలోని కించూరు పంచాయతీ ఉరుగొండ గ్రామం వద్ద సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. సంఘటనకు సంబంధించి క్షతగాత్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దసరా సెలవులు ముగియడంతో పెదబయలు మండలం కుంతుర్ల గ్రామానికి చెందిన వారు తమ పిల్లలను పాడేరు, పెదబయలులోని పాఠశాలలకు తీసుకువెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. ఈ ఆటోలో డ్రైవర్‌తో సహా 15 మంది ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. డ్రైవర్‌ కుమారుడు కూడా ఈ ఆటోలోనే ఉన్నాడు. కాగా ఆటో కించూరు పంచాయతీ ఉరుగొండ గ్రామ సమీపానికి వచ్చే సరికి రహదారి అధ్వానంగా ఉండడంతో బోల్తా పడింది. దీంతో కోరాబు బంగారు పడాల్‌(42) తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కోరాబు నారాయణమ్మ(42), పలాసి దేవినాయుడు(38), నుర్మని చిట్టిబాబు(36), పెదబయలులో 10వ తరగతి చదువుతున్న కోరాబు శివప్రసాద్‌(15), 7వ తరగతి చదువుతున్న కోరాబు అజయ్‌కుమార్‌(12) తదితరులకు గాయాలయ్యాయి. వీరిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బంగారు పడాల్‌ మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more