సొసైటీల తనిఖీల్లో ఆడిటర్ల చేతివాటం!?

ABN , First Publish Date - 2022-09-08T06:41:56+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో లొసుగులను కొంతమంది ఆడిటర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సొసైటీల తనిఖీల్లో ఆడిటర్ల చేతివాటం!?

అక్రమాలు కనిపించినా పట్టించుకోకుండా

ఉండేందుకు కొంతమంది డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు

రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు

జరిమానాల రూపంలో రైతులపైనే ఆ భారం వేస్తున్న సంఘాలు

సహకార ఆడిటర్‌ ఒకరికి నగరంలో సొంత కార్యాలయం

ఏం జరిగినా పట్టించుకోని అధికారులు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో లొసుగులను కొంతమంది ఆడిటర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఆడిట్‌ పూర్తిచేసిన తరువాత రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నట్టు పలువురు సొసైటీ సిబ్బంది చెబుతున్నారు. అక్రమాలు కప్పిపుచ్చి, అంతా బాగుందని సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే భారీగా బరువు పెట్టాల్సిందేనని...ఇది బహిరంగ రహస్యమేనని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఒక సొసైటీ ఉద్యోగి అన్నారు.

ఉమ్మడి జిల్లాలో గల 98 సొసైటీల్లో 40 లాభాల్లో, మిగిలిన 58 నష్టాల్లో ఉన్నాయి. వీటితోపాటు ఉద్యోగులు సహకార సంఘాలు, హౌస్‌ బిల్డింగ్‌ సోసైటీలు ఉన్నాయి. అయితే లాభనష్టాలతో నిమిత్తం లేకుండా సొసైటీ ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ఆడిట్‌ జరగాలి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) లెక్కలపై ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆడిట్‌ ప్రారంభించారు. ప్రస్తుతం మెజారిటీ సొసైటీల ఆడిట్‌ పూర్తయింది. మిగిలిన సంఘాల ఆడిట్‌ ఈ నెలాఖరుకు పూర్తికానున్నది. సొసైటీల వార్షిక లావాదేవీలను సహకార శాఖకు చెందిన ఆడిటర్లే చూస్తారు. మూడు జిల్లాల సహకార శాఖ కార్యాలయాల పరిధిలో  గల వంద మంది ఆడిటర్లకు సొసైటీలు కేటాయిస్తారు. ఆడిటర్లు వారం, పది రోజులు తమకు కేటాయించిన సొసైటీలకు వెళ్లి మొత్తం లావాదేవ్డీలు పరిశీలిస్తారు. సొసైటీలు ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. సిబ్బందికి జీతాలు, ఇతర ఖర్చులు చూపించాలి. కానీ సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్ల ఖర్చులు పరిమితికి మించి ఉంటుంటాయి. అనకాపల్లి జిల్లాలోని పలు సొసైటీల్లో ముందస్తు అనుమతి లేకుండా లక్షల్లో సొమ్ములు డ్రా చేసి భవన నిర్మాణాలు చేపట్టారు. అక్కడ రికార్డులు సక్రమంగా వున్నాయని చూపించకపోతే సిబ్బందిపై చర్యలు ఉంటాయి. కానీ ఆడిటర్లు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో కొన్ని సొసైటీల్లో సిబ్బంది భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రాజకీయ నాయకుల దన్నుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి సొసైటీల ఆడిట్‌లో ఆడిటర్లకు భారీగా ముడుపులు అందాయని తెలిసింది. కొందరు ఆడిటర్లు  ఆడిట్‌కు వెళ్లినప్పుడు తమతో ప్రైవేటు వ్యక్తులను తీసుకువెళుతుంటారు. అందుకు దారి ఖర్చులు, భోజనాలకు సరిపడా సొమ్ములు తీసుకుంటుండగా, మరికొందరు వారికి మొత్తం ఖర్చు, ఫీజు రూపేణా కొంత లాగేస్తున్నారు. కొందరైతే సొంత వాహనానికి పెట్రోల్‌ కొట్టించాలని కూడా అడుగుతుంటారని చెబుతున్నారు. ఆడిట్‌ సమయంలో జరిగే అనధికార ఖర్చు మొత్తం సొసైటీ నుంచే పెడుతుంటారు. దీనికి సొసైటీలో సభ్యులైన రైతుల నుంచి పలు రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రుణ వసూళ్ల సమయంలో జరిమానాల పేరిట కొంత మొత్తం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇదిలావుండగా సహకార శాఖలో కొంతమంది మాత్రమే సొసైటీల లావాదేవీలు స్వయంగా ఆడిటింగ్‌ చేస్తున్నారని, మరికొంతమంది ఆ బాధ్యతను వేరేవారికి అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్‌ పూర్తయిన తరువాత సీనియర్ల నుంచి రిపోర్టు తీసుకుని దానిపై సంతకం చేసి అందజేస్తుంటారని సహకార శాఖ ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సొసైటీ నుంచి తీసుకునే మామూళ్ల నుంచి కొంత ఆ సీనియర్లకు చెల్లిస్తుంటారని చోడవరం ప్రాంతానికి చెందిన ఒక సంఘం ఉద్యోగి వివరించారు. 

సహకార శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ ఆడిటర్‌ ఒకరు నగరంలో సొంతంగా కార్యాలయం నిర్వహిస్తున్నారని, ఆడిట్‌ చేయలేని వారంతా సొసైటీల రికార్డులు అక్కడకు తీసుకువెళ్లి ఇస్తున్నారని మరో సొసైటీ డైరెక్టర్‌ వ్యాఖ్యానించారు.  కశింకోట ఆర్‌ఈసీఎస్‌ ఆర్థిక లావాదేవీలు తనిఖీ చేసే ఆడిటర్‌ ఒకరు భారీ భవనం నిర్మించినట్టు చెబుతున్నారు. ఇదిలావుండగా ఉద్యోగుల సహకార సంఘాలు, హౌస్‌ బిల్డింగ్‌ సంఘాల ఆడిట్‌లో కూడా చేతివాటం చూపడం పరిపాటైంది. సంఘాలు పాల్పడే అక్రమాలు, ఇతరత్రా ఉల్లంఘనలను కొందరు ఆడిటర్లు గుర్తించి నివేదికలో పేర్కొంటారు. అయితే ఆయా సొసైటీల నిర్వాహకులు సహకార శాఖ అఽధికారులను మేనేజ్‌ చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు సొసైటీల్లో  కార్యదర్శుల నుంచి పాలకవర్గం వరకు అక్రమాలు పాల్పడుతుండడం సాధారణ విషయమేనని, వీరి వెనుక రాజకీయ పార్టీ పెద్దలు వుంటారని ఒక సొసైటీ మాజీ కార్యదర్శి వ్యాఖ్యానించారు. దీంతో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు ఆడిటర్లకు కొంత ముట్టజెప్పి మరికొంత పాలకవర్గాలు జేబులో వేసుకుంటున్నాయన్నారు. ఈ విషయంలో సంఘాల్లో సభ్యులుగా వున్న రైతులే చివరకు నష్టపోతుంటారని వివరించారు. కాగా సొసైటీల ఆడిటర్లను పర్యవేక్షించాల్సిన సహకార శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పిలిచి మందలించి అక్కడితో విడిచిపెడుతున్నారంటున్నారు. ముఖ్యంగా హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలు, ఉద్యోగులు ఎక్కువగా వుండే సొసైటీల నుంచి భారీగానే ముడుపులు అందుతుంటాయని ఇటీవల జిల్లాల విభజనతో విశాఖ నుంచి మరో జిల్లాకు వెళ్లిన ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-09-08T06:41:56+05:30 IST