ఏయూ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-02T01:18:48+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంబీఏ విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరిపోసుకున్నాడు.

ఏయూ విద్యార్థి ఆత్మహత్య
మృతుడు మాధవ్‌

మద్దిలపాలెం, డిసెంబరు 1: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంబీఏ విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరిపోసుకున్నాడు. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆంధ్ర విశ్వవి ద్యాలయం డిప్యూటీ రిజిస్ర్టార్‌గా పనిచేస్తున్న పి.రత్నం కుటుంబం సిరిపురం ప్రాంతంలో గల వర్సిటీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటుంది. ఆమె భర్త ఢిల్లీశ్వరరావు నౌకాదళంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరికి ముగ్గురు సంతానం. ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు (వీరు కవలలు). మూడేళ్ల కిందట కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కుమారుడు మాధవ్‌ ఏయూలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల రెండో కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ఇదిలావుండగా రత్నం అస్వస్థతకు గురయ్యారు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడం, తన సోదరుడికి ఉద్యోగం వచ్చి...తనకు రావడంతో మాధవ్‌ మనోవేదన చెందుతుండేవాడు. ఈ నేప థ్యంలో గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లిన ఢిల్లీశ్వరరావు ఇంటికి వచ్చి...అక్కడ కనిపించిన దృశ్యం చూసి భోరుమన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాధవ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

చీడికాడ, డిసెంబరు 1: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మహిళ గురువారం మృతి చెందింది. మండలంలోని ఖండివరం గ్రామానికి చెందిన గుల్లిపల్లి కాసులమ్మ (64) గత నెల 13వ తేదీన గ్రామస్తులతో కలిసి అరకువేలి పిక్నిక్‌కి వెళ్లింది. అదే రోజు సాయంత్రం బొర్రకు సమీపంలోని రోడ్డు పక్కన నిలుచోని ఉండగా వెనుక వైపు నుంచి వచ్చిన వ్యాన్‌ ఢీకొంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాల య్యాయి. వెంటనే స్ధానికులు ఎస్‌. కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

కశింకోట, డిసెంబరు 1 : ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడ్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఇందుకు సంబంధించి ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి తెలిపిన వివరాలివి. నాతవరం మండలం మల్లు భూపాలపట్నం గ్రామానికి చెందిన ముసురుపాము అప్పారావు (54) అనకాపల్లి గాంధీనగరంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. గురువారం అనకాపల్లికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా తాళ్ళపాలెం సమీపంలో ఉన్న బంగారయ్యపేట కూడలి వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆప్పారావు తలకు, కాలుకు తీవ్రంగా గాయమైంది. వెంటనే తాళ్ళపాలెం పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారన్నారు. మృతుడి భార్య లచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 1 : పట్టణానికి ఆనుకొని ఉన్న గుండాల జంక్షన్‌ వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాలివి. స్థానిక విజయరామరాజుపేటకు చెందిన కోరిబిల్లి గణేష్‌ తన చెల్లెల్ని తుమ్మపాల స్కూల్‌లో దిగబెట్టి తిరిగి ఇంటికి వస్తుండగా, గుండాలజంక్షన్‌ వద్ద గవరపాలేనికి చెందిన బొడ్డేడ సూర్య యు టర్న్‌ తిప్పుతున్న సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరూ గాయాలకు గురికావడంతో ప్రథమ చికిత్సలు పొందారు. గణేష్‌ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సూర్య ఆస్పత్రిలో సాయంత్రం వరకు చికిత్స పొందారు.

విద్యుత్‌ షాక్‌గురై మహిళకు తీవ్ర గాయాలు

పాయకరావుపేట, డిసెంబరు 1 : పట్టణంలోని మెయిన్‌ రోడ్డులో గల ఓ భవనంలో నూతనంగా ఏర్పాటవుతున్న బాయ్స్‌ హాస్టల్‌లో గురువారం విద్యుత్‌ షాక్‌గురై మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... పట్టణానికి చెందిన కురుమళ్ళ నేస్తాలమ్మ అనే మహిళ స్థానిక పాత పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఓ షాపు పైఅంతస్తులో కొత్తగా బాయ్స్‌ హాస్టల్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో గురువారం సాయంత్రం పైఅంతస్థులో ఇనుప పైపులను ఒక పక్కకు సర్దుతుండగా, ఆ సమయంలో భవనం ఎదురుగా ఉన్న 33 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ వైరుకు పైపు తగులుకోవడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతోపాటు పైపును పట్టుకుని ఉన్న నేస్తాలమ్మకు విద్యుత్‌ షార్టు సర్యూట్‌ జరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాఽథమిక చికిత్సలకు అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి ఫిర్యాదు అందిందని విచారణ చేస్తున్నామని పాయకరావుపేట సీఐ పి.అప్పలరాజు తెలిపారు.

Updated Date - 2022-12-02T01:18:49+05:30 IST