ఏయూ ఖాళీ!

ABN , First Publish Date - 2022-11-25T01:01:08+05:30 IST

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వ విద్యాలయం ప్రస్తుతం తీవ్రమైన అధ్యాపకుల కొరతతో కునారిల్లుతోంది. ఎంతోమందిని సమున్నతంగా తీర్చిదిద్దిన వర్సిటీ...బోధన సిబ్బంది లేక సతమతమవుతోంది. గతంలో వర్సిటీలో సీటు సాధించేందుకు విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఇప్పుడు సీటు వచ్చినా చేరేందుకు విముఖత చూపే స్థితి వచ్చింది. క్యాంపస్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో తేటతెల్లమవుతోంది.

ఏయూ ఖాళీ!

రెగ్యులర్‌ అధ్యాపకుల కొరతతో సతమతమవుతున్న విశ్వవిద్యాలయం

భర్తీపై దృష్టిసారించని ప్రభుత్వం

బోధనపై తీవ్ర ప్రభావం

శాశ్వత అధ్యాపక పోస్టులు 936

ప్రస్తుతం ఉన్నది 208 మంది మాత్రమే

తొమ్మిది విభాగాల్లో ఒక్క అధ్యాపకుడూ లేరు

కాంట్రాక్టు, గెస్ట్‌ ఫ్యాకల్టీతో తరగతుల బోధన

శాశ్వత సిబ్బంది లేక సాగని పరిశోధనలు

కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల వెనకడుగు

ఇదే పరిస్థితి కొనసాగితే వర్సిటీ ర్యాంకు హుష్‌కాకి

ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆందోళన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వ విద్యాలయం ప్రస్తుతం తీవ్రమైన అధ్యాపకుల కొరతతో కునారిల్లుతోంది. ఎంతోమందిని సమున్నతంగా తీర్చిదిద్దిన వర్సిటీ...బోధన సిబ్బంది లేక సతమతమవుతోంది. గతంలో వర్సిటీలో సీటు సాధించేందుకు విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఇప్పుడు సీటు వచ్చినా చేరేందుకు విముఖత చూపే స్థితి వచ్చింది. క్యాంపస్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో తేటతెల్లమవుతోంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌, కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, లా, ఫార్మసీ, కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఆధ్వర్యంలో 65 డిపార్టుమెంట్‌లను నిర్వహిస్తున్నారు. ఆయా విభాగాలకు 936 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. అయితే, ఏటా పదవీ విరమణ చేసే వారి స్థానంలో నియామకాలు చేపట్టకపోవడంతో ఖాళీలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయా విభాగాల్లో కేవలం 208 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు. అంటే ప్రతి నాలుగు పోస్టులకు మూడు ఖాళీలే. 150 ప్రొఫెసర్‌ పోస్టులకు 130 మంది సేవలందిస్తున్నారు. ఇక అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 275కు గాను 62 మంది, 511 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకుగాను కేవలం 16 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 728 మంది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. చివరిసారిగా 2006లో ఖాళీలను భర్తీచేశారు. అప్పటినుంచి పాలకులు పట్టించుకోకపోవడంతో ఏటా ఖాళీలు పెరుగుతున్నాయి.

తొమ్మిది విభాగాల్లో అధ్యాపకులే లేరు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అనేక విభాగాల్లో పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేక బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఒకరిద్దరు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. కొన్ని విభాగాల్లో గెస్ట్‌, కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ పరిధిలోని ఆరు విభాగాల్లో, హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ విభాగంలో ఒక్కరు కూడా రెగ్యులర్‌ అధ్యాపకులు లేరు. ఎకనామిక్స్‌ విభాగంలో 39 పోస్టులకుగాను ముగ్గురే పనిచేస్తున్నారు. మరో కీలక విభాగం కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ డిపార్టుమెంట్‌లో 47 పోస్టులకుగాను ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌లో 18 పోస్టులకు ఇద్దరు, పాలిటిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ విభాగంలో 21 మందికిగాను ఒకరు ఉన్నారు. హిస్టరీ అండ్‌ ఆర్కిలయాలజీ, లింగ్విస్టిక్స్‌, నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌, ఫిలాసఫీ, థియేటర్‌ ఆర్ట్స్‌, ఉర్దూ విభాగాల్లో ఒక్క శాశ్వత అధ్యాపకుడూ లేరు. న్యాయ కళాశాల పరిధిలో 19 పోస్టులకు 16 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసీ కళాశాల పరిధిలోని 29 పోస్టులకు ఏడుగురు సేవలందిస్తున్నారు. కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో గల 24 విభాగాలకు గాను మూడు విభాగాల్లో ఒక్క అధ్యాపకుడు లేరు.మరికొన్ని కీలక విభాగాలను ఒకరిద్దరితోనే నిర్వహిస్తున్నారు. ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌లో ఆరు పోస్టులకు ఒక్కరు కూడా లేరు. సిస్టమ్స్‌ డిజైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో రెండు పోస్టులు ఖాళీ. అప్లైడ్‌ మేథమెటిక్స్‌లో 12 పోస్టులకుగాను తొమ్మిది ఖాళీలు ఉన్నాయి. బయోకెమిస్ర్టీలో తొమ్మిది పోస్టులకు ఏడు, బోటనీ విభాగంలో 28 పోస్టులకు 20, జియాలజీ విభాగంలో 26 పోస్టులకు 23 ఖాళీగా ఉన్నాయి. న్యూక్లియిర్‌ ఫిజిక్స్‌ డిపార్టుమెంట్‌లో 20 పోస్టులకు ముగ్గురే ఉన్నారు. ఫిజిక్స్‌ విభాగంలో 35 పోస్టులకుగాను ముగ్గురు పనిచేస్తుండగా, జువాలజీ విభాగంలోని 25 పోస్టులకు 19 ఖాళీలున్నాయి.

ఇంజనీరింగ్‌లోనూ అదే పరిస్థితి

ఇంజనీరింగ్‌ కళాశాల పరిధిలోని కీలక డిపార్ట్‌మెంట్‌లు అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నాయి.సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి 36 పోస్టులు మంజూరు కాగా 16 పోస్టులు, కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 41 పోస్టులకుగాను 24 ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 26 పోస్టులకుగాను తొమ్మిది ఖాళీలున్నాయి. ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 24 పోస్టులకుగాను 12, ఈసీఈ విభాగంలో 16 పోస్టులకుగాను పది, జియో ఇంజనీరింగ్‌లో పది పోస్టులకు గాను తొమ్మిది ఖాళీలున్నాయి. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 32 పోస్టులకు 15 ఖాళీగా ఉన్నాయి.

బోధనపై తీవ్ర ప్రభావం

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో సీటు కోసం విద్యార్థులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ప్రస్తుతం అనేక విభాగాల్లో శాశ్వత ఫ్యాకల్టీ లేక విద్యార్థులకు ఆశించిన స్థాయిలో బోధన అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొంతమంది ఏయూలో సీటు వచ్చినా ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

ర్యాంకులపై ఖాళీల ప్రభావం..

వర్సిటీలో సరపడా బోధనా సిబ్బంది లేకపోవడంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే ర్యాంకులపై ప్రభావం పడుతోందని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు, యూజీసీ గుర్తింపు పొందాలంటే తప్పనిసరిగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా శాశ్వత బోధనా సిబ్బంది ఉండాలి. కనీసం 60 శాతం సిబ్బంది పనిచేస్తుండాలి. ఈ సంఖ్య 50 శాతానికి తగ్గితే ర్యాంకుపై ప్రభావం పడుతుంది. అయితే, ప్రస్తుతం వర్సిటీలో పనిచేస్తున్న శాశ్వత సిబ్బంది 25 శాతం మాత్రమే ఉంది. దీని ప్రభావం భవిష్యత్తులో వర్సిటీ ప్రగతిపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అనేక విభాగాల్లో పరిశోధనలను శాశ్వత అధ్యాపకుల ఆధ్వర్యంలోనే నిర్వర్తిస్తారు. ప్రస్తుతం ఖాళీలు పెరిగిపోవడంతో విద్యార్థులు పరిశోధనలకు దూరం కావాల్సి వస్తోంది.

కీలక విభాగాలకు వారే దిక్కు..

వర్సిటీలో ఆశించిన స్థాయిలో శాశ్వత సిబ్బంది లేకపోవడం వల్ల బోధనా భారం గెస్ట్‌ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్‌ అధ్యాపకులపైనే పడుతోంది. ప్రస్తుతం ఏయూలో 103 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, మరో 100 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ, సుమారు 30 మంది అడ్జెంట్‌ ప్రొఫెసర్లు సేవలందిస్తున్నారు. అనేక విభాగాల్లో వీరే బోధన ప్రక్రియను నడిపించాల్సిన పరిస్థితి.

Updated Date - 2022-11-25T01:01:10+05:30 IST