ఆలయ భూముల అమ్మకానికి యత్నం

ABN , First Publish Date - 2022-03-16T05:42:34+05:30 IST

దేవదాయ, ధర్మదాయ శాఖకు చెందిన రూ.కోట్లు విలువైన భూమిని రికార్డులు మార్చి స్వాహా చేసేందుకు చేసిన యత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు.

ఆలయ భూముల అమ్మకానికి యత్నం
స్థలాన్ని పరిశీలిస్తున్న దేవదాయశాఖ అధికారులు

చివరి నిమిషంలో అడ్డుకున్న అధికారులు

ఆనందపురం, మార్చి 15:  దేవదాయ, ధర్మదాయ శాఖకు చెందిన రూ.కోట్లు విలువైన భూమిని రికార్డులు మార్చి స్వాహా చేసేందుకు చేసిన యత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని శొంఠ్యాం పంచాయతీలోని గుడిలోవ శ్రీరంగనాథ నారాయణేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్‌ 289/3లో 1.02 ఎకరాల భూమి ఎండోమెంట్‌కు చెందినట్టుగా రికార్డుల్లో ఉంది. దీనిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నట్టు రికార్డు సృష్టించి అమ్మకానికి యత్నించడాన్ని అధికారులు తిరస్కరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భూములను గ్రామస్థుల సాయంతో కొంతమంది నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ముందుగా నేషనల్‌ హైవే విస్తరణలో బాగంగా ఈ స్థలంలో నాలుగు సెంట్ల భూమి అవసరమున్నట్లు గుర్తించి రికార్డులు పరిశీలించగా ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే కొంతమంది నాయకులు రంగప్రవేశం చేసి వారికి అనుకూలమైన వారి పేర్లను సాగుదారులుగా నమోదు చేయించుకున్నట్టు తెలిసింది. వారికి నేషనల్‌ హైవే అదికారులు నగదు మంజూరు చేసి పంపిణీ చేసే సమయంలో తగిన ఆధారాలు చూపకపోవడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో వారితో పట్టాదారు పుస్తకానికి దరఖాస్తు చేసి అధికారులతో కుమ్మక్కై వారి పేరున వన్‌-బీ పట్టాదారు పుస్తకాలను మంజూరు చేయించుకున్నారు. వీటి ఆఽధారంతో పరిహారానికి వెళ్లగా పేర్లు తేడా వుండడంతో నేషనల్‌ హైవే అధికారులు మళ్లీ తిరస్కరించారు. వీటి ఆధారంతో భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు వుంచగా అధికారులు తిరస్కరించినట్టు సమాచారం. ఈ విషయం గ్రామస్థులకు తెలిసి ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో వెబ్‌ల్యాండ్‌లో మార్పు చేయడానికి వీల్లేకుండా రెడ్‌ మార్క్‌ పెట్టడంతో దానిని కూడా తొలగించడానికి నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. 

ఆలయ భూములను పరిశీలించిన అధికారులు

శొంఠ్యాంలోని శ్రీరంగనాథ నారాయణేశ్వరస్వామి ఆలయ భూములను దేవదాయ, ధర్మాదాయశాఖ ఉప కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ స్థలం ఎండోమెంట్‌కు చెందినదిగా నిర్ధారించామని, ఇక్కడ హెచ్చరిక బోర్డులతో పాటు ఫెన్సింగ్‌ వేయా లని అఽధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె.పద్మావతి, ఆలయ కమిటీ చైర్మన్‌ గిరిరాజు, తదితరులు పాల్గొన్నారు. 


Read more