అటవీశాఖ కొత్త డివిజన్‌ కేంద్రాల ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-29T06:34:41+05:30 IST

పాడేరు, చింతపల్లిలో అటవీ శాఖ నూతన డివిజన్‌ కేంద్రాలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వీటిని ఏర్పాటు చేశారు.

అటవీశాఖ కొత్త డివిజన్‌ కేంద్రాల ప్రారంభం
చింతపల్లి డివిజన్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న డీఎఫ్‌వో సూర్యనారాయణ

- పాడేరు, చింతపల్లిలో కార్యాలయాలు


పాడేరు, చింతపల్లిలో అటవీ శాఖ నూతన డివిజన్‌ కేంద్రాలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వీటిని ఏర్పాటు చేశారు. పాడేరు అటవీ డివిజన్‌ పరిధిలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు ఉండగా, చింతపల్లి డివిజన్‌ పరిధిలోకి చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలు వస్తాయి. దీంతో ఏజెన్సీలోని రెండు అటవీ డివిజన్లు సింగిల్‌ లైన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఉండే ఐటీడీఏ పరిధిలోనే ఉంటాయి.

-------

పాడేరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక అటవీ డివిజన్‌ కార్యాలయాన్ని డీఎఫ్‌వో వినోద్‌కుమార్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక అటవీ డివిజన్‌లో చోటు చేసుకున్న మార్పులను డిప్యూటీ రేంజ్‌ అధికారులు, రేంజ్‌ అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అటవీ రేంజర్‌ శ్రీనివాసరావు, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాడేరు అటవీ డివిజన్‌ పరిధిలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు ఉన్నాయి. అనంతగిరి మండలం విశాఖపట్నం అటవీ డివిజన్‌ పరిధిలో ఉంది. 

చింతపల్లిలో..

చింతపల్లి: అటవీశాఖ నూతన డివిజన్‌ కేంద్రాన్ని స్థానిక డీఎఫ్‌వో చిట్టపులి సూర్యనారాయణ బుధవారం ప్రారంభించారు. చింతపల్లి డివిజన్‌ పరిధిలో ఆరు రేంజ్‌లు, 93 బీట్లను కేటాయించారు. భవిష్యత్తులో అటవీశాఖ బీట్లు సంఖ్య పెరిగే అవకాశముంది. డివిజన్‌కి 240 మంది ఉద్యోగులను కేటాయించారు. చింతపల్లి డీఎఫ్‌వోగా ఇప్పటి వరకు నర్సీపట్నం డీఎఫ్‌వోగా విధులు నిర్వహించిన సూర్యనారాయణను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేయడంతో బుధవారం చింతపల్లిలో అటవీశాఖ డివిజన్‌ కేంద్రం కార్యాలయాన్ని డీఎఫ్‌వో ప్రారంభించారు. డివిజన్‌ కార్యాలయానికి బదిలీపై వచ్చిన వివిధ విభాగాల ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు సైతం విధుల్లో చేరారు. పూర్వ చింతపల్లి రేంజ్‌ కార్యాలయాన్ని డివిజన్‌ కార్యాలయంగా మార్పు చేశారు. దీంతో చింతపల్లి రేంజ్‌కి డీఆర్వో కార్యాలయాన్ని కేటాయించారు. డివిజన్‌ కార్యాలయంతో పాటు నూతన చింతపల్లి రేంజ్‌ కార్యాలయాన్ని కూడా డీఎఫ్‌వో ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ప్రాంగణంలో డీఎఫ్‌వో, అటవీశాఖ ఉద్యోగులు మొక్కలు నాటారు. 

అటవీ సంరక్షణకు అధిక ప్రాధాన్యం

చింతపల్లి అటవీశాఖ డివిజన్‌ పరిధిలో అటవీ సంరక్షణ, రంగురాళ్ల తవ్వకాల నియంత్రణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎఫ్‌వో చిట్టపులి సూర్యనారాయణ తెలిపారు. డివిజన్‌ కేంద్రం ప్రారంభించిన డీఎఫ్‌వో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. చింతపల్లి సబ్‌ డివిజన్‌ నర్సీపట్నం డివిజన్‌ పరిధిలో ఉండేదన్నారు. నర్సీపట్నం డివిజన్‌ పరిధిలో ఉన్న 1,97,181.02 హెక్టార్ల అడవులను చింతపల్లికి కేటాయిస్తూ నూతన డివిజన్‌ ఏర్పాటు చేశారన్నారు. డివిజన్‌ పరిధిలో ఉన్న అడవులన్నీ షెడ్యూల్డ్‌ ప్రాంతం పరిధిలో ఉన్నాయన్నారు. డివిజన్‌ పరిధిలో సీలేరు, ఆర్‌వీనగర్‌, లోతుగెడ్డ, చింతపల్లి, మర్రిపాకలుతో పాటు నూతనంగా పెదవలస రేంజ్‌లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డివిజన్‌ పరిధిలో ప్రస్తుతం 93 మంది ఉద్యోగులు ఉన్నారని, ఇతర ఖాళీ పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నారన్నారు. డివిజన్‌ పరిధిలో మారుజాతి చెట్లు అధికంగా ఉన్నాయన్నారు. నర్సీపట్నం డివిజన్‌ పరిధిలో ఉన్న 75,900 హెక్టార్లలో 189 టేకు ప్లాంటేషన్లలో 85 శాతం చింతపల్లి డివిజన్‌ పరిధిలోకి వచ్చాయన్నారు. డివిజన్‌ పరిధిలోని అడవులను కాపాడుకోవడంతో పాటు అటవీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. డివిజన్‌ పరిధిలో రంగురాళ్ల క్వారీలు కూడా ఉన్నాయని, వర్షాకాలంలో వ్యాపారుల ప్రోత్సాహంతో రైతులు తవ్వకాలు నిర్వహిస్తున్నారన్నారు. రంగురాళ్ల తవ్వకాల వల్ల కూలీలు ప్రమాదాలకు గురయ్యే అవకాశముందన్నారు. అడవులకు నష్టం కలుగుతుందని, ఈ మేరకు రంగురాళ్ల తవ్వకాలను పూర్తి స్థాయిలో నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, మర్రిపాకలు, లోతుగెడ్డ రేంజ్‌ అధికారులు శ్రీనివాసరావు, టీవీవీ వర్మ, ఎల్‌బీకే పాత్రుడు, చింతపల్లి డీఆర్వో వెంకటరమణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-29T06:34:41+05:30 IST