అస్మదీయులకు అందలం

ABN , First Publish Date - 2022-01-28T06:42:56+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పదుల సంఖ్యలో హానరరీ ప్రొఫెసర్ల (గౌరవ ప్రొఫెసర్లు) నియామకం జరుగుతోంది. ఈ పేరుతో ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి తనకు అవసరమైన వారికి అవకాశాలను కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్‌ ప్రొఫెసర్లను పదుల సంఖ్యలో ఆయన హానరరీ ప్రొఫెసర్లుగా నియమించడంపై క్యాంపస్‌లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

అస్మదీయులకు అందలం

ఏయూలో ఇష్టారాజ్యం

పదుల సంఖ్యలో గౌరవ ప్రొఫెసర్ల నియామకం

తనకు కావాల్సిన వారందరికీ పదవులు కట్టబెడుతున్న వైస్‌ చాన్సలర్‌

సీనియర్లను కాదని బాధ్యతలు అప్పగింత

 ఇంజనీరింగ్‌, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ల పదవీ కాలం ముగిసినా కొనసాగింపు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పదుల సంఖ్యలో హానరరీ ప్రొఫెసర్ల (గౌరవ ప్రొఫెసర్లు) నియామకం జరుగుతోంది. ఈ పేరుతో ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి తనకు అవసరమైన వారికి అవకాశాలను కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్‌ ప్రొఫెసర్లను పదుల సంఖ్యలో ఆయన హానరరీ ప్రొఫెసర్లుగా నియమించడంపై క్యాంపస్‌లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే...

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా మూడేళ్ల నుంచి పనిచేస్తున్న పేరి శ్రీనివాసరావు పదవీ కాలం ముగిసింది. ఆయన తరువాత సీనియారిటీ జాబితాలో ముందున్న ప్రొఫెసర్‌ వెంకటసుబ్బయ్యకు ప్రిన్సిపాల్‌గా అవకాశం కల్పించాలి. అయితే, నిబంధనలను పక్కనపెట్టి..మరోసారి పేరి శ్రీనివాసరావును ప్రిన్సిపాల్‌గా కొనసాగిస్తూ వైస్‌ చాన్సలర్‌ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ భట్టి గత నెల పదవీ విరమణ చేశారు. ఆమె స్థానంలో ప్రిన్సిపాల్‌గా మరొకరిని నియమించాల్సి ఉంది. అయితే ఏయూ ఉన్నతాధికారులు...ఆమెనే హానరరీ ప్రొఫెసర్‌గా నియమించి ప్రిన్సిపాల్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలోని సీనియర్‌ ప్రొఫెసర్లు భగ్గుమంటున్నారు. అదేవిధంగా మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి నాలుగేళ్ల కిందట పదవీ విరమణ చేసిన మరో ప్రొఫెసర్‌ ప్రమీలకు గౌరవ ప్రొఫెసర్‌గా అవకాశం కల్పిస్తూ.. ఉమెన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌గా నియమించారు. ఇంకా కామర్స్‌ విభాగంలో నలుగురు రిటైర్డ్‌ ప్రొఫెసర్లను గౌరవ ప్రొఫెసర్లుగా నియమించారు. అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీలో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ ప్రొఫెసర్‌ను తిరిగి గౌరవ ప్రొఫెసర్‌గా నియమించడమే కాకుండా...అదే (అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీలో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌) బాధ్యతలను అప్పగించడంతోపాటు శానిటేషన్‌ విభాగం డీన్‌గా నియమించారు. దీనిపై పలువురు సీనియర్‌ ప్రొఫెసర్లు గుర్రుగా ఉన్నారు. అలాగే, 2018లో హెచ్‌ఆర్‌ఎం విభాగంలో పదవీ విరమణ పొందిన మరో సీనియర్‌ ప్రొఫెసర్‌ను తాజాగా హానరరీ ప్రొఫెసర్‌గా నియమించారు. ఎకనామిక్స్‌ విభాగంలో ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌కు, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 76 ఏళ్ల వయసు కలిగిన మరో ప్రొఫెసర్‌ను గౌరవ ప్రొఫెసర్లుగా నియమించారు. ఇంకా ఫార్మసీ విభాగం నుంచి మూడేళ్ల కిందట పదవీ విరమణ పొందిన ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌కు గౌరవ ప్రొఫెసర్‌గా అవకాశం కల్పించడంతోపాటు రూసా కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలను అప్పగించారు. వీరితోపాటు గతంలో రెక్టార్‌గా పనిచేసి రెండేళ్ల కిందట పదవీ విరమణ చేసిన ఓ ప్రొఫెసర్‌ను గౌరవ ప్రొఫెసర్‌గా తీసుకోవడంతోపాటు నానో టెక్నాలజీ విభాగానికి డైరెక్టర్‌గా నియమించారు. అలాగే జియాలజీ విభాగంలో పదవీ విరమణ పొందిన నలుగురు రిటైర్డ్‌ ప్రొఫెసర్లకు సైంటిస్టులుగా అవకాశం కల్పించారు. ఇకపోతే, యూనివర్సిటీతో సంబంధం లేని, ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్‌కు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అడ్జస్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌గా నియమించారు. పదవీ విరమణ చేసి దశాబ్దాలు దాటిని వారిని కూడా గౌరవ ప్రొఫెసర్లుగా నియమిస్తుండడం పట్ల యూనివర్సిటీలో పెద్దఎత్తున చర్చ సాగుతోంది.   

గతంలో ఎన్నడూ లేదు

గతంలో ఒకరిద్దరికి అవకాశాలు కల్పించేందుకు అప్పటి వైస్‌ చాన్సలర్లు ఆలోచించేవాళ్లు. గౌరవ ప్రొఫెసర్ల నియామకానికి చాలామంది వీసీలు దూరంగా ఉన్నారు. అయితే, ప్రస్తుత వీసీ అటువంటి వాటన్నింటినీ పక్కన పెట్టి తనకు కావాల్సిన వారికి గౌరవ ప్రొఫెసర్లుగా అవకాశం కల్పిస్తూ...ఉన్నత పదవుల్లో కూర్చోబెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2022-01-28T06:42:56+05:30 IST