ఆశల నిర్బంధం

ABN , First Publish Date - 2022-02-23T05:47:03+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణికి వినతి పత్రం ఇవ్వాలని భావించిన ఆశ కార్యకర్తలను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు.

ఆశల నిర్బంధం

సమస్యల పరిష్కారం కోరుతూ చలో కలెక్టరేట్‌కు పిలుపు

నేవీ కార్యక్రమాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణికి

వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం

అందుకు కూడా పోలీసుల అడ్డంకులు

ఎక్కడికక్కడ అరెస్టులు

పాదయాత్రలో అక్క,చెల్లెమ్మలంటూ ప్రేమ కురిపించిన జగన్మోహన్‌రెడ్డి వారికిచ్చే మర్యాద ఇదేనా...అంటూ ఆశ కార్యకర్తల ధ్వజం


విశాఖపట్నం/మహారాణిపేట, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): 

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణికి వినతి పత్రం ఇవ్వాలని భావించిన ఆశ కార్యకర్తలను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి బయలుదేరిన ఆశ కార్యకర్తలను రావికమతం, చోడవరం, పెందుర్తి, గాజువాక, లంకెలపాలెం, పెదగంట్యాడ, తదితర ప్రాంతాల్లో అరెస్టు చేశారు. ముఖ్యంగా జగదాంబ జంక్షన్‌ వద్ద గల సీఐటీయూ కార్యాలయానికి ఆశ కార్యకర్తలు రాకుండా పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలో కార్యాలయ సమీపంలో పోలీసులకు, ఆశ కార్యకర్తలకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పలువురు ఆశ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకుని ఆటో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. 

అయితే పోలీస్‌ వలయాన్ని ఛేదించి పలువురు ఆశ కార్యకర్తలు సీఐటీయూ కార్యాలయంలోకి వెళ్లారు. వారిని అందులోనే నిర్బంధించి గేట్లు వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. పాదయాత్ర సమయంలో అక్క,చెల్లెమ్మలంటూ ప్రేమ కురిపించిన జగన్మోహన్‌రెడ్డి...ఈరోజు నిర్బంధాలతో అణచివేతకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చామని, ఫ్లీట్‌ రివ్యూ నేపథ్యంలో దాన్ని విరమించుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణికి వినతిపత్రం సమర్పించాలని భావించామని, అందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఆశ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎట్టకేలకు వినతి.. 

సీఐటీయూ కార్యాలయంలో నిర్బంధానికి గురైన ఆశ కార్యకర్తలు, పోలీసుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మధ్యాహ్నం 12.30 గంటలకు అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షురాలు పి.మణి, మరో ఐదుగురిని పోలీసులు దగ్గరుండి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి కార్యాలయానికి తీసుకువెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. అనంతరం పి.మణి మాట్లాడుతూ ఆశ కార్యకర్తలకు వేతనం రూ.15 వేలకు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలుపదల చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వీటితోపాటు మరికొన్ని సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లాలని యత్నిస్తే..పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. పాదయాత్రల్లో అక్క,చెల్లెమ్మలని చెప్పారని, ఇదా అక్కచెల్లెళ్లకు ఇచ్చే మర్యాదా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో వినతిపత్రం ఇచ్చే హక్కు కూడా లేదా..? అని ప్రశ్నించారు. అలా అన్నవాళ్లు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుంచుకోవాలన్నారు.  సుమారు 200 మంది ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు బి.రామలక్ష్మి, కె.వరలక్ష్మి, మేరీ, సరస్వతి, లక్ష్మితోపాటు వందల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. Read more